జగన్‌ చెప్పిన ‘మూడు రాళ్లు.. మూడు కథలు’

18 May, 2018 19:00 IST|Sakshi

సాక్షి, నల్లజర్ల: రాష్ట్ర ప్రజానీకాన్ని అన్ని రకాలుగా దోచుకుంటోన్న దళారీలు జన్మభూమి కమిటీలైతే.. ఆ దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. పొగాకు, ఆయిల్‌పామ్‌, వరి, మొక్కజొన్న.. ఏ ఒక్కపంటకూ గిట్టుబాటు ధర కల్పించలేని ముఖ్యమంత్రి.. మరోవైపు తన హెరిటేజ్‌ సంస్థ కోసం రైతులను నిలువునా ముంచేస్తున్నారని, పంటల్ని తక్కువ ధరకు కొనుగోలుచేసి, మూడింతల లాభలకు అమ్ముకుంటూ తానే పెద్ద దళారీగా అవతరించాడని ఆరోపించారు. 165వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు.

పైసలు మింగుతున్నారుతప్ప పోలవరం పూర్తిచేయట్లేదు: ‘‘ఇక్కడి రైతులు, జనం నాతో చాలా విషయాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మా నియోజకవర్గం కూడా సస్యశామలం అవుతుందని, ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తికావడంలేదని బాధపడుతున్నారు. నిజమే, 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిలో 6లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే పూర్తయింది. అసలు కేంద్రం పూర్తిచేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమేంటి? సిమెంట్‌, ఇసుక.. ధరలన్నీ తగ్గినా కాంట్రాక్టుల రేట్లు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. నామినేషన్‌ పద్ధతితో తన బినామీలకు సబ్‌ కాంట్రాక్టులు అప్పగించారు. కేవలం డబ్బులు దండుకోవడమేతప్ప పనులు పూర్తిచేయాలన్న ధ్యాసేలేదు. రాష్ట్రానికి వరదాయినిలాంటి ప్రాజెక్టును ఇంత దారుణంగా విస్మరిస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు, ప్రాజెక్టులు గుర్తుకువస్తాయన్నది తెలిసిందే. దీని గురించి ఇక్కడి రైతులే నాకొక కథ చెప్పారు.. అది ‘‘మూడు రాళ్ల కథ..’


మూడు రాళ్లు.. మూడు కథలు: గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  పశ్చిమగోదావరి జిల్లాలోని ఇదే నియోజకవర్గం చుట్టుపక్కల మూడు ప్రాజెక్టులకు శిలాఫలాకాలు ఆవిష్కరించారు. ఒకటి తాడేపూడి ప్రజెక్టు. సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టుకు చంద్రబాబు రాయి వేసి ఊరుకుంటే.. మహానేత వైఎస్సార్‌ మాత్రం పనులు దాదాపు పూర్తిచేయించారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి తాడేపూడి ప్రాజెక్టుకు పిల్లకాలువలు కూడా తవ్వించలేకపోయారు. రెండోది కొవ్వాడ కాలువపై ఎల్లెండిపేట వద్ద రిజర్వాయర్‌ నిర్మాణం. దానికీ చంద్రబాబే రాయివేసి వెళ్లిపోయారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశమున్న ఆ ప్రాజెక్టునూ వైఎస్సారే కట్టించారు. ఇక మూడోది ద్వారకా తిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లి వద్ద గిరియమ్మ ప్రాజెక్టు. చంద్రబాబు శిలాఫలకం మాత్రమే వేసిన ఆ ప్రాజెక్టును వైఎస్సార్‌ 2010లోనే పూర్తిచేసి, ట్రయల్‌రన్‌ చేయించారు. ఇప్పటివరకూ ఆ ప్రజెక్టుకు పిల్లకాలువలు కట్టించే పనులు పూర్తికాలేదంటే రైతులపట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి మోసగాళ్లు అవసరమా?: ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. అందులో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేసేవాళ్లు నాయకులు మనకు అవసరమా? ఒకప్పుడు రేషన్‌ షాపులో 185 రూపాయలకే అన్ని నిత్యావసరాలు వచ్చేవి. ఇవాళ రేషన్‌ కార్డులనే ఎత్తేసే పరిస్థితి. పెట్రోల్‌, డీజిల్‌పై విపరీతంగా పన్నులు బాదుతున్నారు. కరెంట్‌ చార్జీలు, ఆర్టీసీ టికెట్ల ధరలు అదుపులేకుండా ఉన్నాయి. బాబు చేతిలో మోసపోనివారంటూ ఎవరూలేరు.

హోదాపై బాబు దగా: చంద్రబాబు చేసిన అన్ని మోసాల్లోకి ప్రత్యేక హోదా అంశంలో దారుణంగా మోసం చేశాడు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన ఆయనకు ప్రత్యేక హోదా గుర్తుకురాలేదు. అనునిత్యం హోదా నినాదాన్ని అవమానించి, చులకన చేస్తూ మాట్లాడాడు. వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తే అడ్డుకున్నాడు. మొన్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరిరోజు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే హోదా వచ్చేదే. ఆ పనిచేయకుండా దీక్షల పేరుతో నాటకాలకు తెరలేపారు చంద్రబాబు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాళ్లకు బుద్ధిచెప్పాలి. పొరపాటున క్షమిస్తే రేపు ఇంటికో కేజీ బంగారం, కారు ఇస్తానని ముందుకొస్తాడు.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వరాలు: రేప్పొద్దున ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో ఏమేం చెయ్యబోతున్నది నవరత్నాల ద్వారా ఇప్పటికే చెప్పాం. అందులో నుంచి డ్వాక్రా మహిళలకు ఏమేం చెయ్యబోతున్నామో మరోసారి గుర్తుచేస్తాను.. మన ప్రభుత్వ రాగానే పొదుపు సంఘాల అప్పు ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం. ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయిస్తాం..’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు