వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక ప్రచారం!

20 Feb, 2019 03:55 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు  టీడీపీ నేతలను ఆదేశించారు. ఆ పార్టీ చేయించే సర్వేలన్నీ తప్పులని చెప్పాలని.. పలు సర్వేలు చేసేవాళ్లను అడ్డుకోవడంలో వారి కుట్ర ఉందని ప్రచారం చేయాలని ఆదేశించారు. మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో అన్ని స్థానాల్లో గెలవాలని, చేసిన పనులు చెప్పాలని చంద్రబాబు సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే దొంగఓట్లు చేర్చి వాళ్లే ఫిర్యాదు చేస్తున్నారని ప్రచారం చేయాలన్నారు. ఓటమి భయంతోనే దొంగఓట్లు అంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పాలని సూచించారు. మచిలీపట్నం సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విజయవాడ సమీక్షలో ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. 

నా కుటుంబానికి జగ్గంపేట సీటివ్వండి: తోట
అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయలేనని కాకినాడ ఎంపీ తోట నరసింహం చంద్రబాబుకు చెప్పారు. ఉండవల్లిలో ఆయన తన కుటుంబసభ్యులతో సీఎంను కలిశారు. తాను పోటీ చేయడం లేదు కాబట్టి తన భార్య లేదా కుటుంబసభ్యుల్లో ఒకరికి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సీటు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం జగ్గంపేటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తోట నరసింహం జగ్గంపేట సీటు ఇవ్వాలని కోరడంతో.. మంగళవారం సాయంత్రం జ్యోతులనెహ్రూ చంద్రబాబును కలవడం చర్చనీయాంశమవుతోంది.

ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో సమావేశం
సీఎం చంద్రబాబు ఉండవల్లిలో ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ 39 డిమాండ్లను పరిష్కరించాలని వారు చంద్రబాబును కోరగా.. కొన్నింటికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. కరెంట్‌ టారిఫ్‌ యూనిట్‌ రూపాయికి తగ్గింపును పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన టీడీపీ నేత..
సీఎంతో సమావేశమయ్యేందుకు విజయవాడ వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం హోటల్‌లో ఉన్న బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాజంపేట అసెంబ్లీ సీటు ఆశిస్తున్న బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఆయనకు సీటు ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో.. తీవ్ర ఒత్తిడికి లోనై బ్రహ్మయ్య అస్వస్థతకు గురయ్యారనే వాదన వినిపిస్తోంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు