సోనియాగాంధీతో బాబు భేటీ 

20 May, 2019 03:57 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల సరళి, ఫలితాలపై చర్చ!

రాహుల్, పవార్, ఏచూరి తోనూ బాబు సమావేశం 

ఫలితాలు వెలువడే వరకు వేచి చూద్దామన్న పవార్‌  

సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు ఆదివారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఆమె నివాసంలో చంద్రబాబు అరగంటపాటు ఆమెతో భేటీ అయ్యారు. చంద్రబాబు గతంలోనే రాహుల్‌గాంధీని కలసి కాంగ్రెస్‌తో జట్టుకట్టినా సోనియాతో ముందెన్నడూ ముఖాముఖీ సమావేశమవ్వలేదు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో, చెన్నైలో మాజీ సీఎం కరుణానిధి విగ్రహావిష్కరణ సమయంలో సోనియా, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్, టీడీపీ ప్రత్యర్థులుగా పోటీ పడటం, సోనియాని ఇటలీ దెయ్యం అని, సోనియాగాంధీ కాదు సోనియా గాడ్సే అని, సోనియాను దేశం నుంచి తరిమేయాలి అంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో విమర్శించిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీలోని సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో మొదటిసారి ముఖాముఖీ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల సరళిపై, పోలింగ్, ఫలితాలపై ఇరువురు చర్చించుకున్నట్టు సమాచారం.  ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడంపై సమాలోచనలు చేసినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.  

రాహుల్, పవార్, ఏచూరిలతోనూ భేటీ.. 
ఆదివారం ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసిన చంద్రబాబు లక్నోలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌లతో జరిపిన తన సమావేశ వివరాలను తెలియజేసినట్లు సమాచారం. అనంతరం శరద్‌పవార్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో భేటీ సందర్భంగా కేవలం ఎన్నికల సరళి, ఫలితాలపై చర్చించుకున్నామని, అంతకుమించి ఏమీ లేదని తెలిపారు. ఫలితాలు వెలువడే వరకు వేచి చూద్దామని అన్నారు. అనంతరం ఏపీ భవన్‌కు వచ్చిన చంద్రబాబును సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే రాష్ట్రపతిని కలవడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారన్నది అసందర్భం అన్నారు. మోదీకి వ్యతిరేకంగా అందరం కలసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు.  బాబును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌సిబల్‌  ఏపీ భవన్‌లో కలిశారు. 

చంద్రబాబును కలసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు  
సాక్షి, న్యూఢిల్లీ: ‘మళ్లీ మీరు రావాలి సార్‌’ అంటూ చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును విష్ణుకుమార్‌ రాజు ఆదివారం ఏపీ భవన్‌లో కలిశారు.  ఆయన చంద్రబాబుతో మాట్లాడుతూ.. మళ్లీ మీరు రావాలి సార్‌ అని ఆకాంక్షించారు. విష్ణుకుమార్‌ రాజును మీడియాప్రశ్నించగా..మర్యాదపూర్వకంగానే బాబును కలసినట్టు చెప్పారు. ఎన్నికల ముందు కలిశానని, మళ్లీ ఇప్పుడు కలిశానని చెప్పారు.   

మరిన్ని వార్తలు