కోడెలపై కేసు.. అరెస్ట్‌కు వెనుకంజ

18 Apr, 2019 04:22 IST|Sakshi
పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి వేలు చూపిస్తూ పోలింగ్‌ ఏజెంట్లు, అధికారులను బెదిరిస్తున్న కోడెల

ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌లో కోడెల అరాచకాల వీడియో వెలుగులోకి 

ఆయన దౌర్జన్యం వల్లే జనం తిరగబడ్డారనేది బహిర్గతం

వెంటనే సీఎంను ఆశ్రయించిన కోడెల

కేసును తప్పుదారి పట్టించేందుకు ఎత్తులు

తప్పు చేశామని తలపట్టుకున్న పోలీసులు 

సాక్షి, గుంటూరు: పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు ఆ తప్పును జనంపైకి నెట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన కోడెల బుధవారం హడావుడిగా సీఎంతో సమావేశం కావడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌ ఏజెంట్లు, అధికారులపై కోడెల బెదిరింపులకు పాల్పడ్డ వీడియోలు వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో తప్పును గ్రామస్తులపై మోపి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించి ఎదురుదాడికి దిగుతూ వస్తున్న టీడీపీ నేతలు, వీడియోలు వెలుగులోకి రావడంతో తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు కోడెలపై దాడికి పాల్పడడం వల్లే ఆయన పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని కట్టు కథలు చెబుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కేసును ఎలా తిప్పాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కోడెల తప్పేమీ లేదంటూ వెనకేసుకు వచ్చిన పోలీసులు గ్రామస్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోడెలపై కేసు నమోదు చేయకుండా వదిలేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ నేతలు దీనిపై ఎన్నికల కమిషన్‌తోపాటు గవర్నర్‌కు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో మంగళవారం కోడెలతోపాటు, మరో 21 మందిపై పోలీసులు ఇక తప్పదన్నట్లు కేసు నమోదు చేశారు. కోడెలను, ఆయన అనుచరులను అరెస్ట్‌ చేయొచ్చన్న భయం టీడీపీ నేతల్లో నెలకొంది.
పోలింగ్‌ బూత్‌కు గడియపెడుతున్న దృశ్యం  

పోలీసులపై ఒత్తిడి...
కోడెల దౌర్జన్యం బట్టబయలవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌కు వెనుకంజ వేస్తున్నారు. వారిపై ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి పోటీలో ఉన్న అభ్యర్థే పోలింగ్‌ అధికారులు, ఏజెంట్లపై బెదిరింపులకు దిగుతూ పోలింగ్‌ బూత్‌ తలుపులు మూసివేసి సుమారు రెండు గంటలపాటు ఎన్నిక నిలిచిపోవడానికి కారణమైన అంశం పెద్ద నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పోలింగ్‌ బూత్‌లో రెండు గంటలపాటు కోడెల హల్‌చల్‌ చేస్తుండటంతో లోపల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఆగ్రహించిన ఓటర్లు ఆయనపై తిరగబడ్డ విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం అసలు నేరాన్ని తప్పించి, కోడెలపై దాడి జరిగిందనిచెప్పి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గ్రామంలో దొరికినవారిని దొరికినట్లు పోలిస్‌ స్టేషన్‌లకు ఈడ్చుకెళ్లారు. గొడవకు కారణం కావడంతోపాటు, పోలింగ్‌ నిలిపివేసిన కోడెల, ఆయన అనుచరులను వదిలేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం మండలం ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌లో ఈ నెల 11వ తేదీన కోడెల పోలింగ్‌ను నిలిపివేసి చేసిన అరాచకం, దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు మంగళవారం రాత్రి వెలుగులోకి రావడంతో అటు టీడీపీ నేతలు, ఇటు పోలీసులు కంగుతిన్నారు. వీడియోల ద్వారా కోడెల అరాచక పర్వం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ఆయనతోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి వదిలేశారు. బూత్‌లో హింసకు పాల్పడితే అరెస్టు కూడా చేయలేదంటే వారిపై అధికార పార్టీనుంచి ఏమేరకు ఒత్తిడి వచ్చిందో అవగతమవుతోంది.  

చంద్రబాబును కలిసిన కోడెల... ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు 
తన అరాచకానికి చెందిన వీడియోలు వెలుగులోకి రావడంతో కంగుతిన్న కోడెల మంగళవారం రాత్రే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా ఎన్నికల కమిషన్‌ చేసిన తప్పు అంటూ గగ్గోలు పెట్టారు. అరెస్ట్‌ భయంతో బుధవారం ఉదయం హడావుడిగా సీఎం చంద్రబాబును కలిశారు. ఆ తరువాతే వీడియో పుటేజీలు బయటకు తీయండంటూ కొత్తపల్లవి అందుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లు, అధికారులపై బెదిరింపులకు దిగిన కోడెల తాజాగా కేంద్రం, ఎలక్షన్‌ కమిషన్‌ ఆంధ్రాలో గొడవలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర బలగాలు పంపలేదంటూ ఆరోపణలు ఎత్తుకున్నారు. వీడియోల ద్వారా కోడెల బండారం బట్టబయలైందని, పోలీసులు సైతం వీడియోలు చూసిన తరువాత తాము తప్పుచేశామనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కోడెల, ఆయన అనుచరులను అరెస్టు చేసి చట్టం అందరికీ సమానమే అనే విషయాన్ని పోలీసులు రుజువు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ విశ్లేషకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు