మరోసారి కోడ్‌ ఉల్లంఘించిన చంద్రబాబు 

5 Apr, 2019 11:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పదేపదే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఉండవల్లిలోని తన అధికార నివాసం పక్కనే నిర్మించిన ప్రజా వేదికను పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా వినియోగించుకుంటున్నారు. గురువారం ప్రజావేదికలో ఆయన క్రైస్తవ మతగురువులు, జమాయతే ఉలేమా హింద్‌ నేతలతో సమావేశమై ఎన్నికల ప్రసంగం చేశారు. తనకు ఓటు వేయాలని చంద్రబాబు ఈ సమావేశంలో వారిని కోరారు. శ్రీశైలం భువనేశ్వరి పీఠాధిపతి కైలాసగిరి స్వామిని చంద్రబాబు కలిశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నిధులతో కట్టిన భవనాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఉండవల్లిలోని ప్రజావేదిక సీఆర్‌డీఏ నిర్మించింది.

పార్టీ కార్యకర్తల సమావేశాలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకునే కార్యక్రమాలు, అభ్యర్థులతో సమావేశాలు వంటి అన్నింటికీ ప్రజావేదికనే వాడుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లకు సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలీ కమ్యూనికేషన్‌ వ్యవస్థను వినియోగించుకుంటున్నారు.కాగా,శుక్రవారంఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబు అర్చకులతో నిర్వహించే సమావేశానికి రావాలంటూ ఆలయాల్లో పనిచేసే అర్చకులను దేవదాయశాఖ ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారు. దీనికి కచ్చితంగా హాజరవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అర్చకులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. సమావేశానికి హాజరు కాని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారు. సమావేశానికి వెళితే తాము ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టు అవుతుందేమోనని, వెళ్లకపోతే అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు