ప్రచారానికీ దిగుమతి నేతలే

28 Mar, 2019 09:33 IST|Sakshi

అన్నిటికీ తానే బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ మొన్నటివరకు ప్రచారం

ప్రజలు తనను నమ్మట్లేదని తెలిసి పంథా మార్చిన చంద్రబాబు

ఉత్తర భారత నేతలతో ఏపీలో ప్రచారం

ఫరూక్‌ అబ్దుల్లా సభలకూ నామమాత్రపు స్పందన

లోకేష్‌ను ప్రచారానికి పంపొద్దని నేతల వినతి

‘అభివృద్ధికి నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌. ఐటీ రంగానికీ ఆద్యుడు నేనే. తెలంగాణ అంత అభివృద్ధి సాధించిందంటే అది నా ఘనతే. పెట్టుబడులు వచ్చాయన్నా.. పారిశ్రామిక వేత్తలు వేలాదిగా తరలి వస్తున్నారన్నా అది నన్ను చూసే’ అంటూ ఉదయం లేచిన దగ్గర్నుంచీ భజంత్రీలు వాయించుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రచారం చేయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి నేతలను దిగుమతి చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ఇప్పటివరకూ పలు ప్రచార సభలు నిర్వహించారు. వాటికి జనం సరిగా రావడం లేదు. ఆ వచ్చిన కొద్దిపాటి జనం నుంచీ ఆయన ప్రసంగాలకు స్పందన కనిపించడం లేదు. పైగా ఆయన చేపట్టిన అభివృద్ధి పనులేంటో చెప్పకుండా ఎంతసేపూ ఇతరులను విమర్శిస్తూనే ప్రచారం సాగిస్తూ వచ్చారు.

మరోవైపు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలకు అశేష జనవాహిని రావడం, ప్రతి ప్రచార సభ ఓ జనకెరటంలా మారడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు లేవు, ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూంటే జనం నుంచి సరైన స్పందన లేదు. పోనీ.. సినిమా తారలను తెచ్చుకుందామంటే..  సినిమా ఇండస్ట్రీ టీడీపీకి అంత సానుకూలత చూపించడం లేదు. సినిమా నటులు ఎవరూ తనను నమ్మడం లేదనే అంచనాకు వచ్చిన చంద్రబాబు.. ఇలా కాదులే అనుకుని ఇతర రాష్ట్రాల నేతలకు ఫోన్లు చేసి, ప్రచారం చేసిపెట్టాలని కోరుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశ నాయకులతో పాటు ఇరుగు, పొరుగు రాష్ట్రాల నేతలతో కనీసం రెండు మూడు సభలైనా పెట్టిస్తే, జనం నమ్మే పరిస్థితి ఉంటుందని ఆశ పడుతున్నారు.

ఎట్టకేలకు కొందరు ఒప్పుకున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలు కావడంతో కొంతమంది ఉత్తరాది నేతలు చంద్రబాబుకు ప్రచారం చేసిపెట్టడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా మంగళవారం కడప, ఆళ్లగడ్డ వంటి కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఉత్తరాది నేతలను కూడా కులాలు, వర్గాల వారీగా విడగొట్టి ఆయా ప్రాంతాల్లో తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పంథాలోనే ఫరూక్‌ అబ్దుల్లాను మైనార్టీలు ఉన్న ప్రాంతంలో తిప్పినా.. స్పందన నామమాత్రంగానే కనిపించింది. రానున్న ప్రచార సభలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ తదితరులను ఏపీలో ప్రచారానికి తెప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులపై గానీ.. సంస్కృతీ సంప్రదాయాలపై గానీ ఏ మాత్రం అవగాహన లేని ఉత్తరాది నేతలు ఇక్కడ ప్రభావం చూపించగలరా అంటూ సగటు ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. ‘మనం చేసింది మనమే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నేతలొచ్చి ఏం చెబుతారు’ అన్న విమర్శలూ వస్తున్నాయి. ఏ ఒక్క సభలోనూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని, ఫరూక్‌ అబ్దుల్లా వచ్చి దీనిపై ఏం మాట్లాడతారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఆరు మాసాలున్నాయనగా బీజేపీతో విభేదించి అక్కడ్నుంచీ దేశవ్యాప్తంగా విభిన్న రాజకీయ పార్టీలతో జట్టుకట్టి, తనకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలను విమర్శించడమే అజెండాగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. వచ్చే పది రోజుల ప్రచారంలో దిగుమతి నేతల ప్రభావం ఏమాత్రం ఉంటుంది అన్న భయంలో చంద్రబాబు ఉన్నారు.

లోకేష్‌ వద్దు
ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ ఎన్నికల ప్రచారానికి వెళుతూంటే ముఖ్యమంత్రే బెంబేలెత్తుతున్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి నష్టం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ తప్పుల తడక ప్రసంగాలు, తడబాట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతుండటంతో వీలైనంత వరకూ లోకేష్‌తో ప్రచార కార్యక్రమాలు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో పప్పులో కాలేస్తే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లోకేష్‌ను ప్రచారానికి రావాలని కోరుకుంటున్న నేతలే లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్‌ను తాను పోటీచేస్తున్న మంగళగిరికి మాత్రమే పరిమితం చేస్తే బావుంటుందని పలువురు సీనియర్లు చంద్రబాబుకు సూచిస్తున్నట్టు తెలియవచ్చింది.- గుండం రామచంద్రారెడ్డి సాక్షి, అమరావతి

మరిన్ని వార్తలు