దళిత నేతకు గెలవని సీటు

11 Mar, 2020 04:44 IST|Sakshi

రాజ్యసభ టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య పేరు ప్రకటించిన చంద్రబాబు 

2018లో గెలిచే అవకాశం ఉన్నా ఆయనకు మొండిచేయి 

సుజనా, సీఎం రమేష్, కనకమేడల వంటి వారికి అందలం 

ఆరేళ్లలో మూడుసార్లు అవకాశం వచ్చినా ఎస్సీ, బీసీలకు ఇవ్వని వైనం 

పుష్పరాజ్, పరసా రత్నం వంటి వారికి హామీ ఇచ్చి మరీ అవమానం

సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్యను టీడీపీ తరఫున పోటీకి దింపుతుండటం చర్చనీయాంశమైంది. ఈసారి రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యాబలం అధికంగా ఉన్న వైఎస్సార్‌ సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపడం ఆ వర్గాన్ని మోసం చేయడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆరేళ్లలో ఒక్క దళిత, బీసీ నేతనైనా రాజ్యసభకు పంపకపోగా.. మాట ఇచ్చి వారిని మోసం చేసిన ఉదంతాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  

2002 నుంచీ మాటిచ్చి మోసగించడమే 
- 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా.. తన కోటరీలో సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు.  
- ఆ సమయంలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటివ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు.  
2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉండగా ఎన్డీఏ కోటాలో సురేష్‌ ప్రభుకి అవకాశం ఇచ్చి, టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు ఇచ్చారు.  
- మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కోటరీ వ్యక్తి, సన్నిహితుడు సుజనా చౌదరికి కేటాయించారు.  
అదే సమయంలో టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్‌ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. 
2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు.  
- 2002 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు రాజ్యసభకు టీడీపీ నాయకుల్ని పంపే అవకాశం వచ్చినా ఎప్పుడూ దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు.  
- గతంలో రాజ్యసభ సీటివ్వాలని కోరిన పరసా రత్నం, సత్యవేడుకు చెందిన హేమలత, బల్లి దుర్గాప్రసాద్‌ (అప్పట్లో టీడీపీ నేత) వంటి వారికి మొండిచేయి చూపారు. 
- ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు గవర్నర్‌గా పంపిస్తానని నమ్మించి మోసం చేశారని మోత్కుపల్లి నరసింహులు పలు సందర్భాల్లో వాపోయారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా