దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు

10 Mar, 2020 20:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితులను మరోసారి అవమానించారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి  నిలపడం ద్వారా మరోసారి వారిని మోసం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడం వల్లే వర్ల రామయ్యను చంద్రబాబు బరిలో నిలిపినట్టుగా తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్నప్పుడు దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. తన సామాజికవర్గం, అగ్రవర్ణాలకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్‌రావు, సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, టీజీ వెంకటేశ్‌లను రాజ్యసభకు పంపించారు.

గతంలో వర్ల రామయ్య కన్నీరు పెట్టుకున్నా రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు అతన్ని బరిలో నిలపడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని దళిత సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే.. వర్ల రామయ్యకు అప్పుడు ఎందుకు అవకాశం కల్పించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దళితులను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా, 2002 నుంచి ఇప్పటివరకు ఒక్క దళిత నేతను కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపలేదు. 2016లో జేఆర్‌ పుష్పరాజ్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని తిప్పించుకున్న చంద్రబాబు.. చివరి నిమిషంలో దానిని అగ్రవర్ణాలకు కేటాయించారు.

చదవండి : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం

మరిన్ని వార్తలు