మునుగుతామనే బీజేపీతో తెగతెంపులు..

8 Jun, 2018 03:56 IST|Sakshi

మదనపల్లి నవనిర్మాణ దీక్షలో సీఎం

చిత్తూరు, సాక్షి: ఎన్టీఏలో ఇంకా ఉంటే మునిగిపోతామనే ఉద్దే్దశంతోనే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదో బడ్జెట్‌లో కూడా రాష్ట్రాన్ని మోసం చేయడంతోనే ప్రయోజనం లేదని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా తెలుగు ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మోదీ ఎందుకు నెరవేర్చరని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోకుంటే టీడీపీకి 15–20 సీట్లు ఎక్కువ వచ్చేవని సీఎం చెప్పారు. కేంద్రం వద్దన్నా రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు రాష్ట్రానికి రావాల్సిన రూ.7 వేల కోట్లను ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.  
   
ఎయిర్‌ ఏషియా ఎక్కడుంది..?
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి బీజేపీ తనను విమర్శిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 40 ఏళ్లు నిప్పులా బతికిన తనపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసలు ఎయిర్‌ ఏషియా ఎక్కడుంది? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు పిచ్చాపాటిగా నా గురించి మాట్లాడుకుంటే దాంతో తనకు సంబంధమేంటో బీజేపీ నాయకులే  చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

టీటీడీపై కేంద్రం కుట్ర..
కేంద్ర ప్రభుత్వం టీటీడీపై కూడా కుట్ర చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీటీడీ రాష్ట్ర ప్రజల సొత్తని, దీన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రమణదీక్షితులతో కలిసి తనపై, ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే రమణ దీక్షితులు జగన్‌ను కలసి చర్చించారన్నారు.

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సీఎం
నవనిర్మాణ దీక్ష అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక జామియా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వక్ఫ్‌ బోర్డు భూముల పరిరక్షణ కోసం రూ.2 కోట్లు, మసీదులో ప్రార్థనా గదుల కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అనంతరం ఎన్వీయార్‌ కల్యాణ మండపంలో జరిగిన ఇఫ్తార్‌ విందులో చంద్రబాబు పాల్గొన్నారు.  

సమాజానికి..ఇవ్వడం నేర్చుకోవాలి:సీఎం
సాక్షి, అమరావతి: సమాజం నుంచి తీసుకోవడమే కాదు..ఇవ్వడం కూడా నేర్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. నవ నిర్మాణ దీక్షలు జరిగిన తీరు తెన్నులపై సీఎం గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం చేశామని, భవిష్యత్‌లో ఇంకెంతో చేస్తామనే భరోసా ఇవ్వాలన్నారు.

ఇంటి నిర్మాణ పనుల శంకుస్థాపన రోజే అధికారులు వెళ్లి అభినందించాలని ఆయన సూచించారు.  గృహప్రవేశం రోజు ప్రజాప్రతినిధులు వెళ్లి పేద దంపతులకు నూతన వస్త్రాలను అందించాలన్నారు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో ఊరూరా జలకళ ఉట్టిపడుతోందని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని చెప్పారు. ప్రజల్లో మరింత సంతృప్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు