మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?

19 Feb, 2019 14:09 IST|Sakshi

ముష్కరుల దాడిలో అమరులైన 40 మంది జవాన్లను స్మరించుకుంటూ యావత్‌ భారతదేశం విషాదంలో మునిగిపోతే.. కొంత మంది మాత్రం ఇందులో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో, ప్రధాని నరేంద్ర మోదీతో జట్టు కట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పుల్వామా ఘటనపై స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం.

అనుమానాలు ఉన్నాయి...
ఎన్నికలకు ముందు జరిగిన ఉగ్రదాడిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్లుగా పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోని మోదీ ప్రభుత్వం... ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ప్రస్తుతం ఏదో చేస్తామంటూ ఊదరగొడుతోందని ఆమె విమర్శించారు. అంతేకాదు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని బీజేపీ, ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తామే నిజమైన దేశ భక్తులం అన్నట్లుగా ప్రధాని మోదీ, అమిత్‌ షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మమత విరుచుకుపడ్డారు. అయితే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే మమత.. తన అభిప్రాయాలకు అనుగుణంగానే పుల్వామా దాడిపై ఈ విధంగా స్పందించారు. నిజానికి భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందనేది మెజారిటీ వర్గాల వాదన. ఇదంతా నాణేనికి ఒకవైపు.

ఏ అరాచకానికైనా మోదీ సమర్థుడే!
నాలుగున్నరేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. స్వప్రయోజనాల కోసం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతి నాటి నుంచి ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... పుల్వామా దాడికి ప్రధాని మోదీయే కారణమనే అర్థం వచ్చేలా విమర్శల దాడికి దిగారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం దేశాన్ని తాకట్టు పెడితే సహించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. దేశభక్తి, భద్రతలో టీడీపీ రాజీపడదు అని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా, భారతదేశ పౌరుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పనిలేదు.

అయితే... ‘ప్రధాని నరేంద్ర మోదీ ఏ అరాచకానికైనా సమర్థుడే. గోద్రాలో రెండు వేల మందిని బలితీసుకున్న నరమేధాన్ని మరువలేము. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆయనను అనుమతించలేదు. విదేశాలు కూడా మోదీని బాయ్‌కాట్‌ చేశాయి. బీజేపీ రాజకీయాలతోనే జమ్ము కశ్మీర్‌లో సంక్షోభం ఏర్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరం. సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది చూడరాదు’ అంటూ బాబు మాట్లాడటం చూస్తుంటే... ఆయన మాటల్లో దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నం కంటే కూడా.. మోదీపై బురద జల్లే ప్రయత్నానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోంది.

అప్పుడు తెలియలేదా బాబూ!
మోదీతో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకున్న నాడు గోద్రా విషయం బాబుకు గుర్తురాక పోవడం గమనార్హం. అదే విధంగా సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది చూడరాదని ఆయనే చెప్పారు. అంటే మిగతా రాష్ట్రాల్లో తన లాగే రాజకీయ లబ్ది కోసం ఏమైనా చేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారా అనేది అర్థం కాని విషయం. ఎన్డీయేలో ఉన్నంతవరకు ఆయనకు మోదీ విజన్‌ ఉన్న నాయకుడిలా కనిపించారు.. విభేదాలు వచ్చిన నాటి నుంచే మోదీ తనకంటే జూనియర్‌ అనే విషయం ఆయనకు గుర్తుకు వచ్చింది. అయితే అది ఏ ‘విషయం’లోనో మనకు స్పష్టంగా తెలియదు.

అయినా తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు... ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషిని చూసి బెంబేలెత్తి పోయిన బాబు... ప్రతిపక్ష పార్టీ ప్రకటించిన పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టే ఈ పెద్దనాయుడు గారు... ప్రస్తుతం ఏకంగా ఉగ్రదాడిపై సంచలన ఆరోపణలు చేయడంలో ఆశ్చర్యం ఏముందిలెండి. అమర జవాన్ల త్యాగం గురించి కూడా రాజకీయం చేయడం ఆయనకే చెల్లింది.

మరిన్ని వార్తలు