పాపం ఏం చేస్తాం.. కాపీలు అలా అలవాటైపోయాయి!

18 Mar, 2019 07:38 IST|Sakshi

‘‘కాపీలు కొట్టడం బాగా అలవాటైపోయిన చంద్రబాబు ఒకచోట సక్సెస్‌ అయిన కాన్సెప్టు ప్రతిచోటా అలాగే అవుతుందనీ, అది తనకూ అచ్చం అలాగే ఉపయోగపడుతుందని భ్రమపడుతుంటాడు’’
‘‘సార్‌... చంద్రబాబు కాపీలు కొడతాడా? ఎవరి కాన్సెప్టూ? ఎప్పుడు?’’

‘‘ఒకటీ రెండుసార్లు కాదు. అనేక మార్లు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం అప్పట్లో తెలంగాణ వాళ్ల సైటేదో చేస్తే మక్కీకి మక్కీ కాపీ కొట్టే కదా వాళ్లకు దొరికిపోయింది. అలాగే మొన్న జగన్‌ పెంచుతానన్న పింఛన్‌ అంకెనూ కాపీ కొట్టేశాడు. దీనికి తోడు ఇక నవరత్నాల్లోని సారాన్ని సంగ్రహించి... అవెక్కడ్నుంచి లేపేశాడో తెలియకుండా మసిపూసి మారేడు చేయాలనుకుంటున్నాడు కదా. అన్నిటికంటే కీలకమైన కాపీకొట్టడం ఏమిటో తెలుసా?... మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు అక్కడికి పోయి కెలికితే... అతడినే ఓ బూచీలాగా చూపించి, తమ పాలనంతా మళ్లీ అమరావతి నుంచి ఆపరేట్‌ అవుతుందంటూ కేసీఆర్‌ ప్రచారం చేశాడు కదా. అదెంతగా వర్కవుట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఫార్ములా సక్సెస్‌ అయ్యింది కాబట్టే... ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే ఫార్ములాను అమలు చేయదలచుకున్నాడు. అందుకే జగన్‌కు కావాల్సిన కరెంట్‌ ఢిల్లీలో ఉందనీ, స్విచ్చు హైదరాబాద్‌లో కేసీఆర్‌ దగ్గర ఉందనీ, దాంతోనే ఆంధ్రప్రదేశ్‌ ఫ్యాన్‌ తిరుగుతుందనీ అంటూ... కేసీఆర్‌ కాన్సెప్ట్‌ను మళ్లీ అచ్చంగా స్వచ్ఛంగా కాపీ కొట్టేస్తున్నాడు’’

‘‘మరి ఆంధ్రా ప్రజలు నమ్ముతారంటారా?’’
‘‘దీనిలోని నిజానిజాలు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం వదిలేసి, సొంతపార్టీ పెట్టుకోగానే సీబీఐని ఉసిగొలిపి జగన్‌ను జైల్లో ఉంచారు. బందీగా ఉంచి అన్ని దిక్కులనుంచీ పవర్‌ అందకుండా చేసినప్పుడే, ఉప–ఎన్నికల్లో18 స్థానాలకు 15 స్థానాలు గెలుచుకున్నాడు. అదీ తన సొంత పవర్‌. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు తనక్కావల్సిన కరెంటును మోడీ నుంచి తెచ్చుకొని, స్విచ్చును ఆన్‌ చేయాల్సిందిగా పవన్‌ను అడిగితే... అతడు కాదన్నాడని బతిమాలి బతిమాలి స్విచాన్‌  చేయించుకున్నాడు. అప్పటిగ్గానీ అతడికి పవర్‌ దక్కలేదు. అప్పుడు కూడా జగన్‌ సొంతంగానే పోటీ చేసి కేవలం చాలా తక్కువ తేడాతో అధికారానికి దూరమయ్యాడు. ఇది కూడ జగన్‌ స్వయంప్రకాశాన్ని తెలియజెప్పే అంశమే. తెలంగాణలో చంద్రబాబును బూచీగా చూపించడం కేసీఆర్‌కు కలిసొచ్చింది కదా. అందుకే మళ్లీ అదే కాన్సెప్టును నమ్ముకొని ఆంధ్రలో కేసీఆర్‌ను బూచీగా చూపించి జగన్‌ను దెబ్బకొట్టాలని మళ్లీ అదే పాచి కాన్సెప్టును కాపీ చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నాడు’’

‘‘దొరకిపోతున్నాడంటారా?’’
‘‘మామూలుగా కాదు... అప్పట్లో వాజ్‌పేయ్‌ కార్గిల్‌ గెలిచినప్పుడు... తన పవర్‌ను ఆయన దగ్గర్నుంచి తెచ్చుకున్నాడు. మొన్న తెలంగాణలో పప్పులుడకవని తెలిశాక... సాక్షాత్తూ హరికృష్ణ భౌతికకాయం పక్కనే కూర్చొని, తనకు పవర్‌ ఇవ్వాల్సిందిగా  కేటీఆర్‌ను దేబిరించాడు. ఈ ముక్క కేటీఆర్‌రే స్వయంగా బయటపెట్టాడు కదా. ఇక ఇప్పుడు అధికారం కోసం ఎవడి దగ్గర్నుంచి పవర్‌ అప్పు తీసుకోవాలో చంద్రబాబుకు తెలియడం లేదు. కాంగ్రెస్‌ను అడిగాడుగానీ... వాళ్లదగ్గరే పవర్‌ లేదు పాపం. కుర్చీ కోసమే బతికే తనకు పవర్‌ దక్కకపోతే ఎలా అంటూ... ఇప్పుడు ఫ్యాన్‌ స్విచ్‌ కేసీఆర్‌ చేతిలో ఉందంటూ మళ్లీ ఆ కాపీ కబుర్లనే వల్లెవేస్తున్నాడు’’

‘‘మరి ఈ మాట కరెక్ట్‌ కాదని ప్రజలకు తెలియజెప్పేదెలా?’’
‘‘నీరు పల్లమెరుగు అనే ఓ సామెత ఉంది. అంటే... ఎక్కడో ఎత్తయిన ప్రదేశంలో ఓ నది పుట్టి... పల్లానికి ప్రవహిస్తూ ఇక్కడికి వస్తుంది. కానీ చంద్రబాబు ఏమనుకుంటాడు తెలుసా. అక్కడ్నుంచి ఇక్కడికి రావడానికి నదికి దారి ఉన్నప్పుడు... ఇక్కడ్నుంచి అక్కడికి కూడా అది ప్రవహించవచ్చు కదా అని భ్రమపడుతుంటాడు.’’

‘‘సార్‌ నాకొకటి అనిపిస్తోంది. ‘నీరు పల్లమెరుగు’ తర్వాతి పదం ‘నిజం దేవుడెరుగు’. ప్రజలంటే ఎవరు సార్‌. సాక్షాత్తూ ఓటరు దేవుళ్లు కదా. తెలంగాణ చంద్రుడి కాంతిని తనమీద ప్రసరింపజేసుకొని ఆంధ్రా చంద్రుడు మెరవాలనుకుంటున్నాడనీ... కానీ స్వయం ప్రకాశం పవర్‌ జగన్‌లోనే, తన పవర్‌ను ఎక్కణ్నుంచో తెచ్చుకోడనీ, తన స్విచ్‌లను ఎవరి దగ్గరా ఉంచడన్న విషయం... దేవుళ్లకు తెలుసనీ... నీరు పల్లమెరుగుననీ– నిజాన్ని  ఓటరు దేవుళ్లు ఎరుగుదురనీ చంద్రబాబు భక్తులకు తప్ప... రాజకీయాలు తెలిసినవారందరికీ ఎరుకే’’    – యాసీన్‌

మరిన్ని వార్తలు