శాసన మండలిపై టీడీపీ దొంగాట!

27 Jan, 2020 15:46 IST|Sakshi

మండలి వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం

ఆర్థిక భారం.. ఆలస్యం

పరిమిత అధికారాలు తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు

2004లో శాసన సభలో చంద్రబాబు వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ‘‘నేను అధికారంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ఏదేమైనా నాకు అనుకూలంగా ఉన్నంతవరకే.. నా వరకు రానంతవరకే.. నా పార్టీ గనుక మునిగిపోయే పరిస్థితి వస్తే.. ఎందాకైనా వెళ్లడానికి నేను రెడీ అన్నట్లుగా ఉంది’’ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు... ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన తీరుపై విమర్శలు గుప్పిస్తారు. ఇక తాజాగా శాసన మండలి రద్దు విషయంలోనూ ఆయన అనుసరిస్తున్న విధానంపై అదే రీతిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు కీలక బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష  తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్న విషయం విదితమే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని మరచి.. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మండలిని వాడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం)

ఈ నేపథ్యంలో శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సభకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మండలి అంశంలో గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2004లో శాసన సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై 8, 2004లో అసెంబ్లీలో మండలి ఏర్పాటుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. పదవులు అధికారం కోసం కాంగ్రెస్‌ వాళ్లు ఆత్రంగా ఉన్నారంటూ ఆనాడు ఆయన వ్యాఖ్యలు చేశారు.(అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన)

ఆనాడు చంద్రబాబు ఏమన్నారంటే..
‘‘అధికారపక్షం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. కేవలం పదవుల కోసమే మండలిని పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మండలి వల్ల ఎలాంటి లాభం లేదు. ఒకప్పుడు అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండేది. కాబట్టి పెద్దలు అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంచి క్వాలిటీ ఉంది. అనుభవం ఉంది. మండలి వస్తే, శాసనాలు పాస్‌ కావడంలో ఆలస్యం అవుతుంది. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని మన్స్‌ఫర్డ్‌ కమిటీ కూడా చెప్పింది. 1930 రౌండ్‌ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌పార్టీ కూడా మండలిని వ్యతిరేకించింది. అక్టోబరు 26, 1934న అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో కూడా బాబు రాజేంద్రప్రసాద్‌ మండలిని వ్యతిరేకించారు. మండలి వల్ల లాభం ఉండదని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. 1950 నుంచి కేవలం 8 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఏర్పాటైంది. వాటిలో 3 చోట్ల రద్దయింది మండలి వల్ల ఏటా రూ. 20 కోట్ల ఆర్థిక భారం. ఒక బిల్లు మండలికి వెళ్లి అక్కడ పాస్‌ అయినా లేదా తిప్పి పంపితే మళ్లీ కాలాయాపన. ఏ బిల్లునైనా ఆపే అధికారం మండలికి కేవలం 4 నెలలే ఉంటుంది. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు కూడా మండలి సభ్యులకు లేదు.(‘చంద్రబాబు కోరుకున్నదే.. మేము అమలు చేస్తున్నాం’)

ఇక ఆర్థికేతర విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలంటూ ఏమీ లేవు. ఆర్థిక బిల్లులన్నీ శాసన సభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగ సవరణలు వచ్చినా శాసన సభకు తప్ప మండలికి ప్రమేయం ఉండదు. పరిమిత అధికారాలు తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. మేధావులు కూడా మండలికి వస్తారనుకోవడం లేదు. 1958లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో మండలి ఏర్పాటేతే అది ఒక పునరావాస కేంద్రంగా మారింది. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలను కలుపుకోవడానికి మండలిని వాడుకున్నారు. ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్‌ రద్దు చేశారు. జనవరి 23, 1990న మండలి కావాలని చెన్నారెడ్డి తీర్మానం చేస్తే నాటి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తిరస్కరించింది. మండలి పెట్టాలంటే రెఫరెండం పెట్టాలి. చాలా రాష్ట్రాలు మండలి కావాలని అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. అనేక కారణాల వల్ల మండలి కావాలన్న బిల్లు లోక్‌సభలో లేదా రాజ్యసభలో తిరస్కరిస్తున్నారు’’ అని చంద్రబాబు మండలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే కారణంతో శాసన సభ.. మండలిని రద్దు చేసే తీర్మానంలో చర్చపై కనీసం పాల్గొనలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు