అలిగిన నేతలకు తాయిలాలు

25 Mar, 2019 09:48 IST|Sakshi
రాయచోటి సభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

సాక్షి కడప : జిల్లాలో టీడీపీ రోజురోజుకు బలహీన పడుతుండడం.. పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్‌ నేతలు పార్టీని వీడుతుండడంతో బాబు ఎలాగోలాగా నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు రాక అగ్గిలం మీద గుగ్గిలమైన నేతలను పార్టీ వైపు తిప్పుకునేందుకు ఆచరణ సాధ్యం కాని హామిలను ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లాలో రెండుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తొలుత బద్వేలు సభలో పాల్గొన్న ఆయన మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు సముచిత స్థానం కల్పిస్తామని.. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించారు.

రాయచోటి సభలోనూ మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు ప్రసాద్‌బాబుకు అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తానన్నారు. అంతటితో ఆగని బాబు ప్రొద్దుటూరు సీటును కొన్ని సమీకరణల వల్ల లింగారెడ్డికి అప్పజెప్పామని, అధికార పగ్గాలు చేపట్టగానే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఎమ్మెల్సీ సీటును అప్పగించి గౌరవిస్తామన్నారు. ఇలా ఒకేరోజు జిల్లాకు చెందిన ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇస్తామని ప్రకటించడంపై పార్టీలోని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ఒక్క జిల్లాకే మూడు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించడం సాధ్యమా? లేక ఎన్నికల్లో గట్టేక్కేందుకు ఏదో ఒక రకంగా చెప్పేస్తే పోతుందిలే అని చెప్పారా? అంటూ శ్రేణులు చర్చించుకోవడం కనిపించింది. గత ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరు టిక్కెట్‌ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఇచ్చిన సందర్బంగా అలిగిన లింగారెడ్డికి అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తానన్న పార్టీ పెద్దలు తర్వాత విస్మరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఎమ్మెల్సీ తాయిలాలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాల్సిందే!

చెప్పిన హామీనే చెబుతూ..
రాయచోటి : రాయచోటిలో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభ నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభబైంది. సాయంత్రం 4.10 గంటలకు చేరుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్, మజ్లీస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. చెప్పిన మాటలు, హామీలు, పథకాలనే ముఖ్యమంత్రి పదేపదే చెబుతూ కొంత బోర్‌ కొట్టించారు. హంద్రీ–నీవా ద్వారా నీరివ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఒక్క మారు కూడా అడగలేదని.. అయినా నీరిస్తానని చెప్పారు. హంద్రీ నీవా నీటి కోసం పలుమార్లు అసెంబ్లీలో చర్చించినా సీఎం ఇలా మాట్లాడడంపై సభలో విమర్శలు వినిపించాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డిలు మాట్లాడిన ఆడియో, వీడియో టేపులో మా అందరి దగ్గర ఉన్నాయంటూ చెప్పుకోవడం వినిపించింది.

రాయచోటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నాలుగు ఎకరాల స్థలాన్ని వక్ఫ్‌బోర్డుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశానని చెప్పారు. సభలో మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, ఎంపీ సిఎం రమేష్, మాజీ ఎమ్మెల్యేలు పాలకొండ్రాయుడు, వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ, రాజంపేట పార్లమెంటు అభ్యర్థి సత్యప్రభ, రాయచోటి, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థులు ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి, బత్యాల చెంగల్రాయులు, టీటీడీ పాలకవర్గం సభ్యులు ప్రసాద్‌బాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సొంత డబ్బా వాయించిన బాబు
బద్వేలు అర్బన్‌ : రెండు పర్యాయాలు కార్యక్రమాలు వాయిదా పడ్డాక అయిదేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ఆదివారం బద్వేలు వచ్చారు. నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం యాల్సిందిపోయి సొంత డబ్బా వాయించుకున్నారు. రాష్ట్రం లోటుబడ్టెట్‌లో ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. మహిళలందరికి పసుపు – కుంకుమ చెక్కులు ఇచ్చామా లేదా అంటూ కార్యకర్తలతో చెప్పించుకునే ప్రయత్నం చేయగా కొంత మంది తమకు ఇంకా చెక్కులు అందలేదని చేతులు ఊపారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది,

హైటెక్‌ సిటీ, సైబరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. 45 నిమిషాల పాటు జరిగిన చంద్రబాబు ప్రసంగంలో తమ కార్యక్రమాల గురించి వివరించి తర్వాత మోదీ, జగన్, కెసీఆర్, సాక్షిపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్‌ రాజశేఖర్, లింగారెడ్డి, పుట్టాసుధాకర్‌యాదవ్, టీడీపీ యువ నాయకులు రితీష్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్‌ రెడ్యంవెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బాబు నోట.. హబ్బుల మాట
జిల్లాకు సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 35 సార్లు వరకు వచ్చారు. ఒక్కచోట కాదు.. అనేక ప్రాంతాల్లో బహిరంగసభల్లో మాట్లాడిన బాబు ఎన్నో హామిలు ఇచ్చారు. ప్ర«ధానంగా బాబు నోట వచ్చేమాట.. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్బుగా మారుస్తానని పదేపదే చెబుతారు.. చెబుతున్నారు. అంతేకాదు పరిశ్రమలకు అడ్డాగా మార్చి ఇండస్ట్రియల్‌ హబ్బుగా మారుస్తా.. పరిశ్రమలన్నీ ఇక్కడికే తెస్తానని బాబు వచ్చిన ప్రతిసారి చెబుతున్న తీరు చూసి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఎప్పుడొచ్చినా చెబుతూనే ఉన్నారు గానీ.. హామిగానే మిగిలిపోయాయి తప్ప ఇంతవరకు బాలరిష్టాలు దాటి ముందుకు అడుగు పట్టడం లేదు. ఇలా ఒకటేమిటి జిల్లాలో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ వచ్చిన ప్రతిసారి హార్టికల్చర్‌ హబ్బు, ఇండస్ట్రీయల్‌ క్యారిడార్‌ అంటున్నా ఇంతవరకు రూపానికి పునాది పడలేదు. 

>
మరిన్ని వార్తలు