ఉదయగిరిని వరదలతో ముంచెత్తుతా!

4 Apr, 2019 12:05 IST|Sakshi
ఆత్మకూరు సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో అవాక్కయిన ప్రజలు

ఆకట్టుకోని అధినేత ప్రసంగాలు

టీడీపీ నేతలకు నిద్ర తెప్పించిన సీఎం మాటలు 

ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో చంద్రబాబు అసహనం

సాక్షి, నెల్లూరు:  ‘కరువు కోరల్లో ఉన్న ఉదయగిరి ప్రాంతానికి నీరు తెప్పించి వరదలతో ముంచెత్తుతా’ అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేయడంపై ఈ ప్రాంత ప్రజలు అవాక్కవుతున్నారు. ఒక వైపు గుక్కెడు నీరు దొరక్క నానా కష్టాలు పడుతున్న మెట్ట వాసులకు ఐదేళ్ల పాటు నీరివ్వలేని చంద్రబాబు రెండో సారి సీఎంను చేస్తే నీరు వరదలా పారిస్తానంటూ కథలు చెప్పడంపై సభకు వచ్చిన వారు విస్తుపోయారు. జిల్లాలో బుధవారం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఆకట్టుకోలేక పోయింది. క్యాడర్‌లో ఉత్సాహం నింపలేకపోయింది.

మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన పర్యటన రెండు గంటల ఆలస్యంగా జరగడంతో సభకు హాజరైన ప్రజలు చంద్రబాబు ప్రసంగానికి ముందుగానే సభాస్థలి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఆత్మకూరులో చంద్రబాబు ప్రసంగం చప్పగా సాగింది. టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి బీద మస్తాన్‌రావు, అసెంబ్లీ  అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య సభావేదికపై నిద్రపోవడం కనిపించింది. ఓటర్లను ఆకట్టుకునేలా అధినేత ప్రసంగం సాగకపోవడంతో టీడీపీ నేతలు నిరుత్సాహంగా కనిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు జనసమీకరణ కోసం ఆ పార్టీ అభ్యర్థులు భారీగానే ఖర్చు చేశారు. ఒక్కో మహిళకు రూ.500 వంతున నగదు ఇచ్చి సమావేశానికి తరలించారు. పురుషులకు నగదుతో పాటు మద్యం బాటిల్‌ కూడా సమకూర్చి సభకు తరలించారు.

పాత హామీలే కొత్తగా.. 
గతంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు ఐదేళ్లలో అమలు చేయలేకపోయారు. దుత్తలూరులో బుధవారం జరిగిన సభలో అవే హామీలను తిరిగి వినిపించారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను మూడేళ్లలో పూర్తిచేస్తానని చంద్రబాబు 2016 జూన్‌ 3వ తేదీన కనిగిరి మండలంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. మరో ఐదేళ్లల్లో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేస్తానని చెప్పడం గమనార్హం. గత ఎన్నికల ప్రచారంలో ఉదయగిరిని పర్యాటక పరంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన సంగతి మరిచి మరో అవకాశమిస్తే పర్యాటక పరంగా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పడం విశేషం.

స్పందన కరువు 
 చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత మహిళలు సభావేదిక నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఉపన్యాసం ముగింపు సమయానికి దాదాపు సగం మంది మహిళలు బయటకు వెళ్లిపోయారు. ఎక్కువ మంది ఉపాధి కూలీలు, డ్వాక్రా సంఘాల మహిళలకు కొంత నగదు ఇచ్చి సమావేశానికి తరలించారు. ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ మీ స్పందన తెలపాలని చంద్రబాబు పదే పదే సభికులను కోరినప్పటికీ పెద్దగా వారి నుంచి స్పందన రాలేదు. దీంతో చంద్రబాబు కొంత అసహనానికి గురయ్యారు. మొత్తమ్మీద సీఎం సభ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అటు పార్టీ నేతల్లోను, ఇటు కేడర్‌లోనూ కొంత నిరాశ, నిస్పృహలు కనిపించాయి.

మరిన్ని వార్తలు