ప్రజాగ్రహానికి తలొగ్గిన చంద్రబాబు..

27 Feb, 2020 20:13 IST|Sakshi

ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబుకు నిరసన సెగ

బాబును వెనక్కి పంపిన విశాఖ వాసులు

ప్రజాగ్రహానికి తలొగ్గి.. హైదరాబాద్‌కు పయనం

సాక్షి, అమరావతి : రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవంగా గొప్పలు చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  ప్రజల ఆగ్రహానికి తలవంచక తప్పలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర పర్యటన చేపట్టిన టీడీపీ అధినేతకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కుల చూపించారు. చైతన్య యాత్రల పేరుతో అసత్య ప్రచారాలు చేస్తూ గురువారం విశాఖపట్నం చేరుకున్న పచ్చపార్టీ నేతకు స్థానిక ప్రజలు నిరసనలతో స్వాగతం పలికారు. వెనుకబడిన ఉత్తారంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబును సుమారు ఐదుగంటల పాటు ప్రజలు రోడ్డుపై అడ్డుకున్నారు. కనీసం కారు కూడా దిగనీయకుండా విశాఖ నుంచి వెనక్కి పంపి... వికేంద్రీకరణకు మద్దతు ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వేలాది మంది ప్రజలు అండగా నిలిచారు. (పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే)


ఐదుగంటల హైడ్రామా..
చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ఉదయం నుంచే విశాఖలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన పర్యటనను నిరసిస్తూ స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నేతలు పార్టీలకు అతీతంగా రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ఈ ప్రాంతంలో పర్యటించేది లేదంటూ మహిళలతో సహా రోడ్డుపై భీష్మించారు. ఎగ్జిక్యూటీవ్‌ క్యాపిటల్‌గా విశాఖను ఇక్కడి ప్రజలే స్వాగతిస్తుంటే టీడీపీ నేతలకు నొప్పెందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే స్థానికులు ఆందోళన విరమించపోవడంతో.. చంద్రబాబును పర్యటన వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. తనకే సూచనలు ఇస్తారా అంటూ పరుష పదజాలంతో ఖాకీలపైకి ఎగిరిగంతులేశారు. అయితే శాంతిభద్రతల్లో భాగంగా ఐదుగంటల హైడ్రామా అనంతరం చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాండ్‌లోకి పోలీసులు తరలించారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు. (తమాషా చేస్తున్నారా.. చంద్రబాబు బెదిరింపులు)

ఉత్తరాంధ్ర ప్రజల విజయం..
అయితే ఉత్తరాంధ్ర ప్రజల తిరుగుబాటు చంద్రబాబుకు ఓ గుణపాఠంగా రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తున్నారు. పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతు తెలుపుతుంటే.. టీడీపీ నేతల అక్రమాల ఊబీలో చిక్కుకున్న అమరావతి కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీస్తున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఆక్రమించిన భూములను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారని సగటు ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే  ఉత్తరాంధ్ర ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం.. ఆయనకు వాస్తవాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మొత్తానికి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపించి విజయం సాధించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా