చంద్రబాబూ.. ప్యాకప్‌!

11 Dec, 2018 13:49 IST|Sakshi

బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహాలు

కుటిల రాజకీయ నీతిని తిప్పికొట్టిన తెలంగాణ ప్రజలు

సాక్షి వెబ్, హైదరాబాద్ : మహాకూటమి పేరిట తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టి... జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ​కూటమిలో కీలక పాత్ర పోషించాలని తహతహలాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. కూటమి పేరిట, పొత్తుల పేరిట చంద్రబాబు తెలంగాణలో ప్రదర్శించిన కుటిల రాజకీయ నీతిని ప్రజలు గట్టిగా తిప్పికొట్టారు. ఏ ఎండకా గొడుగు పట్టడంలో, అవకాశవాద రాజకీయాలను ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు తన వ్యూహం బెడిసికొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. బీజేపీ, పవన్‌ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకొని గత ఎన్నికల్లో ఏపీలో విజయం సాధించిన చంద్రబాబు.. నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీ సర్కారులో కొనసాగిన విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించిన తర్వాత రాజకీయంగా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ మూల సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ తో జత కట్టడమే కాకుండా తద్వారా జాతీయస్థాయిలో చక్రం తిప్పొచ్చని భావించారు. అందులో భాగంగా చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రజలిచ్చిన షాక్‌తో చంద్రబాబు ఎటూ పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ  ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఏర్పడుతుందని చంద్రబాబు భావించారు. పనిలోపనిగా కాంగ్రెస్‌ను అడ్డంపెట్టుకొని జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని భావించారు. ఇప్పటికే ఉన్న యూపీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీల నేతలతో సమావేశమవుతూ ఏదో ఒక హడావిడి సృష్టించాలని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి దగ్గర కావడం ద్వారా ఇటు తెలంగాణ, అటు ఏపీలో తన పెత్తనం కొనసాగించవచ్చన్న ఆలోచనతో ముందుకెళ్లారు. అలాగే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూపీఏ పక్షంలోని పార్టీల నేతలతో సమావేశమై వారికి దగ్గర కావాలని ప్రయత్నించారు. అలా చేయడంలో తానే ముందుండి అన్నీ నడిపిస్తున్నట్టుగా ప్రచారం పొందడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో  మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో చంద్రబాబు సమన్వయ పాత్ర పోషిస్తున్నారని పచ్చ మీడియా కూడా హడావిడి చేసింది. అయితే, సోమవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన ఎస్పీ, బీఎస్పీ నేతలు హాజరు కాకుండా గట్టి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలోనే తెలంగాణ ఫలితాలు కూడా చంద్రబాబు పొలిటికల్‌ గేమ్‌కు గట్టి బ్రేకులు వేశాయి.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు అనేక ఎత్తులు వేశారు. మహాకూటమి ఏర్పాటులో, సీట్ల పంపకాల్లో, ప్రచారంలో చంద్రబాబే కీలకంగా వ్యవహరించినట్టు ఆయన అనుకూల మీడియా కలరింగ్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం ఆ పార్టీ అధిష్టాన దూతలు అమరావతి వెళ్లి  చంద్రబాబును కలువడం ప్రతికూల ప్రభావం చూపింది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక అవసరాలను సమకూర్చుతూ తద్వారా తన పెత్తనం చెలాయించాలని వ్యూహరచన చేశారు. తెలంగాణలో తన పట్టు నిరూపించుకోవడానికి చంద్రబాబు ఏకంగా ఎన్టీఆర్‌ కుటుంబాన్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా కూకట్‌పల్లిలో దివంగత నేత, ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ కూతురు సుహాసినికి టికెట్‌ ఇచ్చి.. ప్రచారం పేరిట హడావిడి చేశారు. సుహాసినికి టికెట్‌ ఇవ్వడంతో ఎన్టీఆర్‌ కుటుంబం తనకు అనుకూలంగా కలిసి వస్తుందని, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రాం వంటి నందమూరి హీరోలను ప్రచారానికి వాడుకోవచ్చునని తలపోశారు. ఇది ఏపీ ఎన్నికలకూ ఉపకరిస్తుందని ముందస్తు వ్యూహాలు రచించారు. చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ, ఏపీ మంత్రులు కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు. సెటిలర్‌ ఓట్లు తమకు కలిసివస్తాయని భావించారు. కానీ, ప్రజలు చంద్రబాబుకు గట్టి షాకిచ్చారు. 

ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో వేదిక పంచుకొని చంద్రబాబు ప్రచారం చేయడం తెలంగాణ అంతటా కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. కూటమి ఏర్పాటు ద్వారా టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవచ్చని చంద్రబాబు చెప్పిన వ్యూహం బెడిసికొట్టడమే కాకుండా ఏకంగా కాంగ్రెస్ కోలుకోలేని దారుణ పరిస్థితుల్లోకి పడిపోయింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, విశ్వసనీయత లేని కారణంగా చంద్రబాబు నాయుడు అతిపెద్ద ప్రతికూల అంశంగా మారడంతో కాంగ్రెస్ నేతలే కాకుండా ఇప్పుడు ఏపీలోని టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి కూడా చక్రం తిప్పుబోతున్నామని చంద్రబాబు నాయుడు తరఫున ఆ పార్టీ నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. కానీ, ఆయన అనుకున్నది ఒక్కటైతే.. తెలంగాణ ప్రజలు మాత్రం రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. చంద్రబాబు కుటిల రాజకీయనీతిని తిప్పికొట్టారు. మొత్తంమీద తాజా ఫలితాలు చంద్రబాబు ఎత్తుగడను ప్రజలు తిప్పికొట్టినట్టు స్పష్టం కాగా, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు.

మరిన్ని వార్తలు