చంద్రబాబుకు అరెస్టు వారెంట్‌ జారీ

14 Sep, 2018 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సాగునీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులకు అరెస్టు వారెంట్‌ జారీచేసింది. 2010లో అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన కేసులో చంద్రబాబు సహా మరో 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు శుక్రవారం అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వీరిలో తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వులపై కౌంటర్‌ దాఖలు చేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.

కాగా మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌(అవిభక్త) రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేతలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి విచారణలో ఉంది.

మరిన్ని వార్తలు