అంత తప్పు నేనేం చేశా: చంద్రబాబు

4 Jul, 2019 09:03 IST|Sakshi

ప్రజాతీర్పు బాధ కలిగిస్తోంది....

కుప్పం : ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే బాధగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తున్నా అసలు కారణాలను మాత్రం గుర్తించలేకపోతున్నామన్నారు. ప్రజలను సంక్షేమ పథకాలతో మెప్పించలేకనే ఓటమి పాలైనట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశానే తప్ప తానెన్నడూ తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గుడుపల్లె, కుప్పంలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ‘నేను చేసిన పనులు బహిరంగంగా కనిపిస్తున్నా ఎన్నికల్లో ప్రజలు ఎందుకిలా తీర్పు ఇచ్చారు..? నేను చేయరాని తప్పు ఏం చేశా..?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.  రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను నివారించేందుకు అమరావతిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నించానన్నారు. రాజధానిలో ల్యాండ్‌ పూలింగ్‌ కింద రైతులిచ్చిన భూములను కొన్ని సంస్థలకు అప్పగిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చని భావించినట్లు చెప్పారు. ప్రభుత్వ డబ్బు పైసా లేకుండా రాజధానిని నిర్మించాలని ప్రయత్నం చేశానని, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల అంతా విఫలమైందని వ్యాఖ్యానించారు.

కుప్పానికి నీళ్లివ్వండి...: శ్రీశైలం నుంచి నీళ్లు కుప్పం తరలించేందుకు చేసిన ప్రయత్నం చిన్న చిన్న పనుల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. కరువు జిల్లా అనంతపురంలో కియా కార్ల తయారీ కంపెనీని ఏర్పాటు చేయిస్తే చివరకు ఆ అసెంబ్లీ స్థానం కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, 20 ఏళ్లు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు ఇలాంటి ఫలితాలు ఎదురవటాన్ని కార్యకర్తలు, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని, ఓటమికి కుంగిపోయి వారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు