ముందు మీ కొడుకు సంగతి తేల్చండి: చంద్రబాబు

25 Mar, 2018 13:56 IST|Sakshi

బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు ఏపీ సీఎం ఝలక్‌

సాక్షి, అమరావతి: నోట్ల రద్దు నుంచి నోబెల్‌ దాకా అన్నీ తన ఐడియాలేనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టుకున్నారు. మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రధాని మోదీని వేనోళ్లా పొగిడిన ఏపీ సీఎం.. ఇప్పుడు తీవ్రస్వరంతో ఎదురుదాడికి దిగారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. తనను నిందించేముందు బీజేపీ నేతలు తమ అవినీతి చరిత్రను చదువుకోవాలని సూచించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమిత్‌ షా కొడుకు సంగతేంటి?: ఏపీలో అవినీతి పాలన నడుస్తున్నదని, రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందని అమిత్ షా రాసిన లేఖపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ ఎన్డీఏ నుంచి బయటికొస్తే నాపై ఆరోపణలు చేస్తారా? మరి అమిత్‌ షా కుమారుడు జై షా అక్రమాల మాటేమిటి? కొడుకుపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పరా? ఇంతలా నీతులు వల్లించే బీజేపీ నిన్న రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకంత దిగజారిపోయింది? యూపీలో, గుజరాత్‌లో బలంలేకున్నా అదనపు రాజ్యసభ సీటు కోసం కుయుక్తులు పన్నడం దేశమంతా చూసిందికదా’’ అని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.

విలువలకు కట్టుబడే పోటీ పెట్టలేదు: జీవితం మొత్తం తాను విలువలకు కట్టుబడిన మనిషినని చంద్రబాబు తన పార్టీ నేతలతో చెప్పారు. నిన్నటి రాజ్యసభ ఎన్నికలను గుర్తుచేస్తూ.. ‘‘టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువ ఉన్నా మేం మూడో స్థానానికి పోటీ పడలేదు. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఆ పని చేయలేదు’’ అని వ్యాఖ్యానించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

కొస మెరుపు: వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొనుగోలుచేసి, వారిలో కొందరికి మంత్రి పదువులు కూడా ఇచ్చిన చంద్రబాబే ‘విలువల కోసం పోటీపెట్టలేద’ని చెప్పుకోవడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యపరిచినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు