అధికారం పోయినా.... అబద్ధాలు వదల్లేదు 

22 Oct, 2019 07:45 IST|Sakshi
టీడీపీ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు

అభివృద్ధిని చూసి ఓర్వలేకే సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు  

చేసింది చెప్పుకోలేకే వల్లె వేసిన అసత్యాలు  

సుదీర్ఘ ప్రసంగం... కార్యకర్తల అసహనం

అధికారంలోకి మళ్లీ ఆయనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారట... నాయకులు వెళ్లినంతమాత్రాన టీడీపీకీ నష్టం లేదట... ఆయనది అభివృద్ధి రాజకీయమట... జగన్‌ది చిల్లర రాజకీయమట... ఆయనేమీ తప్పు చేయలేదట... ఎవరికీ భయపడరట... కార్యకర్తల త్యాగాలు మరిచిపోలేనివట... తన ప్రాణాలను వారికి పణంగా పెడతారట... మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కేవలం లక్ష రూపాయల ఫర్నిచర్‌ మాత్రమే తన వద్ద పెట్టుకున్నారట... ఇవీ టీడీపీ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారం పోయినా ఇంకా అబద్ధాలనే ఆశ్రయించారు. సుదీర్ఘ ప్రసంగం సాగించి, ఎన్నికలకు ముందు మాదిరిగానే విసుగెత్తించారు. చెప్పాలంటే కార్యకర్తల సహనాన్ని చంద్రబాబు పరీక్షించారు. అసలు అధికారంలో ఉన్నంతసేపూ ఏం చేశామన్నది చెప్పుకోలేక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కార్యక్రమాలపై దు్రష్పచారంతోనే ప్రసంగమంతా కానిచ్చారు. అవాస్తవాలు వల్లించి లబ్ధి పొందే ఎత్తుగడ వేసినట్టుగా సోమవారం జరిగిన సమావేశం చూస్తే అర్థమవుతుంది. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన... నాలుగు లక్షల ఉద్యోగాలు, రైతులకు బతుకులపై ధీమా కల్పిస్తూ రైతు భరోసాకింద రూ.12,500, ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన బియ్యం, ఆటోవాలాలకు ఏడాదికి రూ.10 వేలు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల పెంపు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ల రెట్టింపు తదితర పనులను దేశమంతా మెచ్చుకుంటుంటే అవేమీ కనబడనట్టు చంద్రబాబు ఆద్యంతం అవాస్తవాలు మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా పులివెందుల రాజకీయాలు చేస్తారా? అంటూ ఆ ప్రాంతాన్ని ఎత్తి చూపిస్తూ మాట్లాడారు. ఆయనొక రాయలసీమ వ్యక్తి అన్న విషయాన్ని మరిచిపోయి తన నోటిదురుసును మరోసారి వెల్లడించారు.
  
ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజల రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలైతే మరింత బాధాకరం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం పోలీస్‌స్టేషన్లలో మరే ఇతర పారీ్టల వ్యక్తులకు న్యాయం జరిగేది కాదని ఓ ముద్ర ఉండకనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి చేపట్టిన నాలుగు నెలల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం నీతివంతమైన పాలన కోసం అహర్నిశలు కష్టపడుతుంటే.. ఏదో ఒక పేరుతో బురద జల్లే పనికి ఒడిగట్టినట్టుగా స్పష్టంగా కనిపించింది.  
  
ఓటమిపై సమీక్ష 
విస్తృత స్థాయి సమావేశం అనంతరం పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఓడిపోవడానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసుకున్న కొందరు కార్యకర్తలతో మాట్లాడారు. ఎందుకు ఓడిపోయాం, లోపమేంటి, ఎవరు పనిచేయలేదు... అనే కోణంలో సమీక్ష చేశారు. పలాస నియోజకవర్గ సమీక్ష జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీకి పలాస నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చిందని... ఎమ్మెల్యేకు మాత్రం భారీ స్థాయిలో తేడా ఎందుకు వచ్చిందో తనకు అర్థం కాలేదని చంద్రబాబు వద్ద వాపోయారు. కారణం మీరే చెప్పాలని... పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని శివాజీ ఛలోక్తి విసిరినట్టు చంద్రబాబు వద్ద మాట్లాడారు. టెక్కలి నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు టెక్కలి మండలంలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ రావడానికి కారణమేంటని నాయకులను ప్రశ్నించారు. పార్టీ వైఫల్యంపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమీక్షల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వలేదని చాలామంది ఎత్తిచూపడంతో రానున్న రోజుల్లో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యత కలి్పస్తానని చంద్రబాబు ప్రకటించారు.  
 

మరిన్ని వార్తలు