25 సీట్లిస్తే..250 కోట్లిస్తా!

9 Sep, 2018 01:45 IST|Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌కు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌

ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కింద ‘సాయం’

25 అసెంబ్లీ, 5 లోక్‌సభ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన

ఓటుకు కోట్లు కేసు ‘శాశ్వత సమాధి’ చేయడమే లక్ష్యం

అంతర్గత భేటీలో టీటీడీపీ నేతలకు ‘బ్రెయిన్‌ వాష్‌’

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ‘అనివార్య హస్తం’అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు భారీ స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. తమకు 25 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని, అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్‌ అభ్యర్థులకు అవసరమయ్యే ఎన్నికల ఖర్చు కింద రూ. 250 కోట్లు ఇస్తామని ఆయన బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలియవచ్చింది. దీని వెనుక చంద్రబాబు భారీ ప్రయోజనాలనే ఆశిస్తున్నారనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే తనకు భవిష్యత్తులో ఇబ్బందిగా పరిణమించే అవకాశమున్న ‘ఓటుకు కోట్లు’కేసును శాశ్వతంగా సమాధి చేసుకోవడంతోపాటు తెలంగాణలో తన, తన అనుకూల వ్యక్తుల ఆస్తులు, ప్రయోజనాలు కాపాడుకోవచ్చనే ఆయన తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. 

అధికారం కోసమే ‘సాయం’... 
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే ఓట్లు కొనుగోలు చేసేందుఉ డబ్బు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు... ఈసారి ‘ఎన్నికల’మార్గంలో సొమ్ము పంచేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా కొన్ని సీట్లు సాధించుకోవడం ద్వారా ప్రభుత్వంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలను అడ్డం పెట్టుకొని తెలంగాణలో పబ్బం గడుపుకోవాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో తనపై ఉన్న ‘ఓటుకు కోట్లు’కేసును శాశ్వతంగా సమాధి చేయించుకోవాలనే లక్ష్యంతోనే ఆయన పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. దీనికితోడు చంద్రబాబు అండ్‌కోకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు, భూములు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకు తెలంగాణలో కూడా అధికారం అవసరమని, ఇప్పుడు కాంగ్రెస్‌తో అవసరమున్నందున ఆ పార్టీకి వీలైనంత సాయం చేసి తాను గట్టెక్కాలనే ఆలోచనతో బాబు ముందుకెళ్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు జేడీఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో కొందరికి బాబు ‘సాయం’చేశారనే ఆరోపణలు రావడం తెలిసిందే. 

కాంగ్రెస్‌తో వెళ్లాల్సిందే...! 
హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా తెలంగాణలోని పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులకు కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో చంద్రబాబు ‘బ్రెయిన్‌ వాష్‌’చేశారు! బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలసి వెళ్తున్నాయని, ఆ పార్టీలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని దిశానిర్దేశం చేశారని తెలియవచ్చింది. కానీ పైకిమాత్రం పొత్తుల విషయంలో తానేమీ తలదూర్చనని, తెలంగాణ టీడీపీ నేతలే తుది నిర్ణయం తీసుకోవాలని బాబు కలరింగ్‌ ఇచ్చారు. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశానికి హాజరైన నాయకులనుద్దేశించి మాట్లాడిన చంద్రబాబు పొత్తులెవరితో పెట్టుకోవాలో తెలంగాణ నేతలే ఫైనల్‌ చేస్తారని, వారు తీసుకున్న నిర్ణయానికి తాను సహకరిస్తానని చెప్పుకొచ్చారు. అయితే పోటీ చేయాలని అందరికీ ఉంటుంది కానీ, పార్టీ బలపడాలంటే అందరికీ అవకాశమివ్వలేమని చెప్పడం ద్వారా ఆయన కాంగ్రెస్‌తో పొత్తుపై పరోక్ష సంకేతాలివ్వడం గమనార్హం. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కచ్చితంగా వెళ్లాల్సి వస్తుందని, ఆ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి లాంటి పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవాలని ఆయన సూచించారు. ‘ఆ పని నేను చేస్తా. కాంగ్రెస్‌తో పొత్తు అనివార్యతను మీరు కార్యకర్తలకు, ప్రజలకు వివరించి చెప్పాల్సి ఉంటుంది’అని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

మీ బాధ్యత నాది... 
తెలంగాణలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఫండింగ్‌ కింద రూ. 250 కోట్లు ఇస్తానని చెప్పినట్లుగానే తెలుగుదేశం నేతలకూ చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ తానే భరోసాగా ఉంటానని, వారికి ఆర్థిక సాయం చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘మీరేమీ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ముందు పొత్తులు కుదుర్చుకోవడంలో సఫలం కండి. ఆ తర్వాత అన్నీ నేను చూసుకుంటా’అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే స్థానిక నేతలు ఎక్కడ ఆశపడి ఎక్కువ సీట్లు అడుగుతారో అనే ఉద్దేశంతో బాబు హితబోధ చేశారు. ‘మీరు పోటీ చేయడమే ముఖ్యం అనుకోకండి. పోటీ ప్రధానం కాదు. మనం గెలవాల్సి ఉంటుంది. అందుకే ఇతర పార్టీలతో సంప్రదింపుల సందర్భంగా ఎక్కువ, తక్కువ సీట్లు అడగకండి. కచ్చితంగా గెలిచే స్థానాల మీదే పట్టుపట్టి తీసుకోండి’అని చంద్రబాబు సూచించినట్లు తెలంగాణ టీడీపీ నేత ఒకరు వెల్లడించారు. 

ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌పై ఒత్తిడి! 
స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే విషయంలో చంద్రబాబు ఢిల్లీ నుంచే చక్రం తిప్పినట్లు తెలియవచ్చింది. ముందుగానే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై ఒత్తిడి చేయించారని, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీతో కలసి వెళ్లాల్సిందేనని ఇక్కడి నేతలను గైడ్‌ చేయించారని సమాచారం. దీంతో మానసికంగా సిద్ధం కాకపోయినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబు ‘డీల్‌’ను అంగీకరించాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. అయితే బాబు ఆఫర్‌ ఎలా ఉన్నా ఆయన కోరినట్లుగా 25 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం కుదరదని స్థానిక కాంగ్రెస్‌ నేతలు తేల్చిచెప్పారు. 15కి మించి అసెంబ్లీ స్థానాలు ఇవ్వలేమని, ఒకటి లేదా రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే సర్దుబాటు చేయగలుగుతామని టీడీపీకి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే చర్చల్లో సీట్ల సంఖ్యపై స్పష్టత రానుంది.

>
మరిన్ని వార్తలు