వంచన దీక్ష!

2 Jun, 2018 11:27 IST|Sakshi
ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచే దారి మూసివేత

నవ నిర్మాణం.. నవ్వులపాలు

ఒక్క అడుగూ ముందుకు పడని అభివృద్ధి

నీటిపారుదల.. మౌలిక వసతుల్లో వైఫల్యం

హామీలే తప్ప పురోగతి కరువు

ప్రజలను మెప్పించని నాలుగేళ్ల పాలన

సాక్షి ప్రతినిధి, అనంతపురం : నవ నిర్మాణదీక్ష పేరుతో జిల్లా కేంద్రంలోని టవర్‌క్లాక్‌ వద్ద శనివారం హడావుడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా ఇలా ప్రచార ఆర్భాటం చేస్తోంది. అధికారం చేపట్టిన కొత్తలో ‘నవనిర్మాణదీక్ష’ చేస్తే కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, రాష్ట్రాభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు మరింత బాధ్యత గుర్తు చేసేలా, ఉత్సాహం నింపేందుకు చేస్తున్నారని అంతా భావించారు. కానీ పాలకులు మాత్రం ఏటా ఈ దీక్ష చేస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు చేయబోయే దీక్ష ఐదేళ్ల ప్రభుత్వానికి ఆఖరిది కానుంది. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా చేసిన దీక్షల సారాంశం ఏమిటి..? వీటి వల్ల జిల్లా అభివృద్ధిలో పురోగతి కన్పించిందా..? ప్రజాప్రతినిధుల్లో బాధ్యత పెరిగిందా..? ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారా..? జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాయా..? అన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. 

రాష్ట్రంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతం అనంతపురం జిల్లా. ఇదే క్రమంలో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాల్లో ఇదీ ఒకటి. రెండు ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే స్థానాలు, పది మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులకే ప్రజలు పట్టంకట్టారు. ఇలాంటి జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపాలి..? ప్రజాప్రతినిధులు మరెంత  బాధ్యతాయుతంగా మెలగాలి..? కానీ నాలుగేళ్ల ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తే జిల్లాకు తీరని ద్రోహం చేశారనేది స్పష్టమవుతోంది.

ఎకరాకు నీళ్లివ్వలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు
చంద్రబాబు గొప్పతనంపై ఏటా నవనిర్మాణదీక్షల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొడుతున్నారు. కానీ నాలుగేళ్లల్లో జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేని అసమర్థమంత్రులుగా పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, గతంలో మంత్రిగా చేసిన పల్లె రఘునాథరెడ్డి మిగిలిపోయారని జిల్లా వాసుల తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2012 నుంచి జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నా..ఫేజ్‌–1 80 శాతం, ఫేజ్‌–2లో 75 శాతం పనులే పూర్తయ్యాయి. ఏటా 25–30 టీఎంసీల జలాలు వస్తున్నా.. నాలుగేళ్లలో ఎకరా పొలం తడపలేదు. డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని 2015లో ప్రభుత్వం జీఓ 22 జారీ చేయడంతో పనులు నిలిచిపోయాయి. కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలనే లక్ష్యం మినహా ‘అనంత’ రైతుల వేదన ప్రభుత్వానికి పట్టలేదు. హంద్రీ–నీవా ద్వారా జిల్లాలోని చెరువులకు నీళ్లిచ్చామని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పులు చెప్పుకుంటూ గంగపూజలు చేస్తున్నారు. కనీసం ఆ చెరువుల కింద ఆయకట్టుకైనా సాగునీరు ఇచ్చారా..? వారి గుండెమీద చేయివేసుకుని ప్రశ్నించుకుంటే సమాధానం లేని పరిస్థితి. రైతులకు సాగునీరివ్వాలని ఎమ్మెల్యేలంతా సీఎం వద్దకు వెళ్లి కనీసం ప్రతిపాదన కూడా చేయలేని దౌర్భాగ్యపరిస్థితి.

దీనస్థితిలో మున్సిపాలిటీలు
‘అనంత’ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పది మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నాలుగేళ్లలో ఒక్క ఇళ్లూ నిర్మించలేదు. హిందూపురం, తాడిపత్రి, గుత్తితో పాటు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ తాగేందుకు నీళ్లు సరఫరా చేయలేదు. సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  పట్టణ ప్రాంతాల్లో 90 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ హామీ నీటిమీద రాతే అయ్యింది. అలాగే డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చిన్నపాటి  వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. అనంతపురం కార్పొరేషన్‌లో పరిస్థితి మరో ఘోరంగా ఉంది. నాలుగేళ్లలో రూ.85 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో నగరంలో డివైడర్లు, కొన్నివార్డుల్లో బాగున్న డ్రైనేజీ కాలవల స్థానంలో కొత్త కాలవల నిర్మాణం చేపట్టడం మినహాయిస్తే తక్కిన నిధులతో ఎలాంటి అభివృద్ధి జరిగిందో పాలకవర్గమే చెప్పాలి. పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి. కనీస మౌలిక సదుపాయాలు లేక జనం అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్లు కూడా మంజూరు చేయకపోవడంతో ఏటా జన్మభూమి సభల్లో అర్జీలిచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతేడాది జిల్లాకు కొన్ని ఇళ్లు మంజూరైన బిల్లుల పెండింగ్‌తో క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి.

ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి
రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధికి తనదీ భరోసా అంటూ అసెంబ్లీ సాక్షిగా కొన్ని హామీలు గుప్పించారు. ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం నిర్మిస్తామన్నారు. ఇది ఏర్పాటై ఉంటే సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా దక్కేది. దీన్ని రాజధాని ప్రాంతానికి తరలించారు. ‘అనంత’ను స్మార్ట్‌సిటీ చేస్తానన్నారు. ఎలా ఉందో అందరికీ తెలుసు..! టెక్స్‌టైల్‌పార్క్, ఫుడ్‌పార్కు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ క్లస్టర్, నూతన పారిశ్రామిక నగరం, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల తయారీ పరిశ్రమ నిర్మిస్తామన్నారు. వీటితో పాటు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఎక్కడా వీటి అమలుకు ఉపక్రమించలేదు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇక పదినెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చనపుడు, జిల్లా ప్రజల బాగోగులు పట్టనప్పుడు... ఏటా ‘నవనిర్మాణదీక్ష’ పేరుతో సత్యదూరమైన ప్రసంగాలు చేయడం, ప్రజలను మోసం చేయడం భావ్యమా..? అని రాజకీయపార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వేదికపై ప్రజాప్రతినిధులు ప్రసంగించి ఇంటికెళ్లిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్నా.. నాలుగేళ్లలో జిల్లాను ప్రభుత్వం ఎలా విస్మరించిందో స్పష్టమవుతోందని పరిశీకులు చెబుతున్నారు. నవనిర్మాణ దీక్షను ‘వంచన దీక్ష’గా వైఎస్సార్‌సీపీతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీ లు, బీజేపీ విమర్శిస్తున్నాయి.  

నేటి నుంచి ‘నవనిర్మాణ దీక్ష’
అనంతపురం అర్బన్‌: జిల్లాలో శనివారం నుంచి ఈ నెల 8 వరకు ‘నవనిర్మాణ దీక్ష’ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ జిల్లా యంత్రాగం సిద్ధం చేసింది. నవ నిర్మాణ దీక్ష నిర్వహణకు సంబంధించి 14 నియోజవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఉత్తర్వులను శుక్రవారం జారీ చేశారు.

ప్రత్యేక అధికారులు వీరే :అనంతపురం నియోజకవర్గానికి ఆర్డీఓ మలోల, రాప్తాడుకు ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, గుంతకల్‌కు ఎఫ్‌ఎస్‌ఓ గాయత్రిదేవి, తాడిపత్రికి సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, రాయదుర్గానికి హౌసింగ్‌ పీడీ సెల్వరాజ్, ధర్మవరానికి ఆర్డీఓ విశ్వనాథ్‌£Š , శింగనమలకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటనారాయణమ్మ, కళ్యాణదుర్గానికి ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, హిందూపురానికి సెరికల్చర్‌ జేడీ సుబ్బరామయ్య, కదిరికి ఆర్డీఓ రామమోహన్, మడకశిరకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, పెనుకొండకు ఆర్డీఓ రామమూర్తి, పుట్టపర్తికి డీఎఫ్‌ఓ చంద్రశేఖర్‌ను నియమించారు.

మరిన్ని వార్తలు