చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన రద్దు

25 Dec, 2019 20:11 IST|Sakshi
చంద్రబాబు నాయుడు (పాత ఫొటో)

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 2, 3 తేదీల్లో విజయనగరం జిల్లాలో పర్యటించాలని తొలుత చంద్రబాబు నిర్ణయించారు. జీఎన్‌ రావు కమిటీ మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో టీడీపీ అవలంభిస్తున్న వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ తీరుపై సొంత పార్టీ నేతలతో పాటు మేధావులు, ప్రజలు మండిపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని పార్టీ నాయకులు స్వయంగా ఆయనతో చెప్పారు. ఈ సమయంలో పర్యటనకు  రావడం మంచిది కాదని చంద్రబాబుకి చెప్పడంతో ఆయన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఉత్తరాంధ్ర నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. (విశాఖకే తమ్ముళ్ల ఓటు)

కాగా, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలన్న ప్రతిపాదనకు మద్దతుగా విశాఖ జిల్లా టీడీపీ నాయకులు తీర్మానించడం రాష్ట్ర నాయకత్వానికి ముందరి కాళ్ల బంధంలా మారింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌, కొండ్రు మురళి సహా ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలన్న ప్రతిపాదనను గట్టిగా సమర్థించారు. దీంతో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. అధికార వికేంద్రీకరణకు ఆయనను ఒప్పించేందుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకోకపోతే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడబోమని కొంత మంది సీనియర్లు సూచనప్రాయంగా వెల్లడించడం గమనార్హం. (ఆ విషయం చంద్రబాబుకూ తెలుసు)

మరిన్ని వార్తలు