కొత్త చిక్కులు!

13 Mar, 2019 12:51 IST|Sakshi

శైలజనాథ్‌కు శింగనమల సీటు ఆఫరిచ్చిన సీఎం

ఓడిపోయే స్థానం తనకు అక్కరలేదన్న మాజీ మంత్రి

కాంగ్రెస్‌ అభ్యర్థిగానే బరిలోకి దిగాలని నిర్ణయం

బండారు శ్రావణిని వ్యతిరేకిస్తున్న స్థానిక నేతలు

ఆమెకే టిక్కెట్టు ఇవ్వాలని ఎంపీ జేసీ పట్టు

ప్రభాకర్‌చౌదరిని కూడా మార్చాల్సిందేనని బెట్టు

బాలకృష్ణ పనితీరుపై అధిష్టానాన్ని నిలదీసిన చౌదరి, గౌడ్, యామిని

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సిట్టింగ్‌లను మార్చకపోతే.. ఓటమి తప్పదు. మారిస్తే సహాయ నిరాకరణతోనూ భంగ పాటు తప్పదు.. ఏం చేయాలో తెలియక టీడీపీ అధిష్టానం అయోమయంలో పడిపోయింది. తీవ్ర కసరత్తు అనంతరం 11 స్థానాల అభ్యర్థిత్వాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో ఉంచారు. సిట్టింగ్‌లను మార్చి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించారు. శింగనమలకు బండారు శ్రావణి, గుంతకల్లుకు మధుసూదన్‌గుప్తా, కళ్యాణదుర్గం టిక్కెట్‌ అమిలినేని సురేంద్రకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి సిఫార్సుతో శింగనమలకు మొదట శ్రావణి పేరు ఖరారు చేశారు.

అయితే చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలలో శ్రావణి అయితే... భారీ తేడా ఓడిపోతుందనే తేలింది. దీంతో శ్రావణిని పక్కనపెట్టి మాజీ మంత్రి శైలజానాథ్‌ను టీడీపీలోకి ఆహ్వానించి, టిక్కెట్‌ ఇవ్వాలని భావించారు. ఈ విషయంపై జేసీ దివాకర్‌రెడ్డితో చర్చించారు. అయితే శైలజానాథ్, రఘువీరారెడ్డి తనకు తీరని ద్రోహం చేశారని, శైలజనాథ్‌కు టిక్కెట్‌ వద్దని జేసీ అడ్డుకున్నారు. జేసీ మాటలను ఖాతరు చేయని చంద్రబాబు శైలజానాథ్‌తో జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో సంప్రదింపులు జరిపించారు. అయితే టీడీపీలో చేరేందుకు శైలజనాథ్‌ నిరాకరించారు. కాంగ్రెస్‌ పార్టీని వీడదలుచుకోలేదని, అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తాను ఈ ఎన్నికల్లో ఓడిపోతానని తెలుసనీ, అయినప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగాలనే నిర్ణయంతో ఉన్నానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు టీడీపీ ఈ దఫా అధికారంలోకి రావడం లేదని, జగన్‌గాలి బలంగా వీస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. శైలజనాథ్‌ టీడీపీలోకి చేరేందుకు నిరాకరిచండంతో శింగనమల స్థానంపై చంద్రబాబు పురాలోచనలో పడ్డారు.

శ్రావణిని వ్యతిరేకిస్తోన్న టీడీపీ కీలక నేతలు
శింగనమల నియోజకవర్గంలోని కీలక నేతలు ముంటిమడుగు కేశవ్‌రెడ్డి, ఆలం నర్సానాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు పలువురు నేతలు శ్రావణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా శ్రావణితో పోలిస్తే యామినీబాలకు టిక్కెట్‌ ఇవ్వడమే ఉత్తమమని అధిష్టానం వద్ద తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టీడీపీ కేడర్‌ శమంతకమణితోనే ఉందని, శ్రావణికి సహకరించరని చెప్పారు. ఈ విషయాలను జేసీ దివాకర్‌రెడ్డి కూడా వివరించారు. అయితే జేసీ మాత్రం యామినీకి కాకుండా తాను సిఫార్సు చేసిన శ్రావణికే టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబును పట్టుబడుతున్నారు. దీంతో చివరకు శ్రావణికే టిక్కెట్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అనంతపురంపై మళ్లీ పేచీ
అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి అభ్యర్థిత్వంపై జేసీ పట్టువదల్లేదని తెలుస్తోంది. చౌదరిని మార్చి తీరాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. ‘చౌదరి మినహా మరో ఆప్షన్‌ చెప్పండి’ అని చంద్రబాబు జేసీని అడిగితే...‘ నేను ఏ పేరూ సిఫార్సు చేయను. చౌదరి మాత్రం వద్దు. అతడికి ఇస్తే అతను ఓడిపోవడంతో పాటు ఎంపీగా నాకుమారుడి విజయావకాశాలు కూడా దెబ్బతింటాయి’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అనంతపురం అభ్యర్థిత్వంపై మళ్లీ చంద్రబాబు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అమిలినేని సురేంద్రబాబు అనంతపురం, లేదా కళ్యాణదుర్గం సీటును ఆశిస్తున్నారు. అనంతపురం సీటుకోసం ఇప్పటికీ ప్రయత్నాలు ఆపలేదు. అయితే కళ్యాణదుర్గానికి ఇతని పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనంతపురంపై జేసీ డిమాండ్‌ పట్ల చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. అలాగే గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా మధుసూదన్‌గుప్తా పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే గత ఐదేళ్లలో ఒక్క జన్మభూమి సభలో కూడా పాల్గొనని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఎలా సమర్థిస్తారని ఎమ్మెల్యేలు హనుమంతరాయ చౌదరి, జితేందర్‌గౌడ్, యామినిబాల అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. పనితీరు ఆధారంగానే టిక్కెట్లు కేటాయించాలనుకుంటే జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ పనితీరు అట్టడుగున ఉంటుందని, మరి ఆయనను ఎలా సమర్థిస్తారని ఈ ముగ్గురూ తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

అభ్యర్థుల ప్రకటన తర్వాత సిట్టింగ్‌ల కీలక నిర్ణయం
టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. గుంతకల్లు, కళ్యాణదుర్గం నుంచి తమ పేరు జాబితాలో లేకపోతే కీలక నిర్ణయం తీసుకోవాలని జితేంద్రగౌడ్, హనుమంతరాయచౌదరి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్ల దక్కకపోతే తమ కుటుంబాలు పూర్తిగా రాజకీయాలను వదిలేయాల్సి వస్తుందని, కచ్చితంగా ఈ ఎన్నికల్లో టిక్కెట్‌ తమకే కావాలనే పట్టదలతో ఉన్నారు. టిక్కెట్‌ దక్కకపోతే అదే నియోజకవర్గాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని జితేంద్రగౌడ్‌ తన అస్మదీయులతో చెప్పారు. గుప్తాను ఓడించడమే తన కర్తవ్యంగా పనిచేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి ఏకంగా పార్టీ వీడాలని చౌదరిపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తమకు ఇంతకంటే అవమానం ఏముంటుందని, మరోపార్టీలోకి వెళదామని యోచిస్తున్నారు. ఇప్పటికే జనసేన టిక్కెట్‌ ఇస్తామని మారుతికి ఆపార్టీ నేత నాదేండ్ల మనోహర్‌ కబురు పంపినట్లు తెలుస్తోంది. అయితే మారుతి టీడీపీకి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు