మోదీది ఎంత తప్పో.. చంద్రబాబుది అంతే తప్పు

5 Jul, 2018 16:57 IST|Sakshi
ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (పాత ఫొటో)

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజి నిధుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఈ పెద్దమనిషి కాదా? అని నిలదీశారు.

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి పిటిషన్‌కు కౌంటర్‌ అఫిడవిట్‌ వేసిన కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అన్నీ నెరవేర్చామని, ప్రత్యేక హోదాను ఇవ్వలేమని అందులో పేర్కొంది.

దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడిన రాంబాబు.. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వెన్నుపోటు పొడుస్తుంటే, దగ్గరుండి పొడిపించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. అఫిడవిట్‌లో ఇప్పటికిప్పుడు కేంద్రం కొత్తగా చెప్పిందేమీ లేదని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో, చంద్రబాబుతో మంతనాలు చేసిన తర్వాతే అఫిడవిట్‌ను దాఖలు చేసిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పినప్పుడు శాలువాలు కప్పి సన్మానించారు కదా అప్పుడు తెలీదా? అని మండిపడ్డారు.

హోదా కంటే ప్యాకేజీ ఉపయోగం అని ఊరువాడ చెప్పిన విషయం గుర్తులేదా? అని చివాట్లు పెట్టారు. బీజేపీ నంగనాచి కబుర్లు చెబుతుంటే అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అని నిలదీశారు. అఫిడవిట్‌పై టీడీపీ ఇప్పడు గావుకేకలు దేనికని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి వైఎస్సార్‌ సీపీ పోరాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హోదాను పాత వేయడానికి ప్రయత్నించింది సీఎం చంద్రబాబేనని అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీది ఎంత తప్పు ఉందో, సీఎం చంద్రబాబుది అంతే తప్పు ఉందని అన్నారు. ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో చంద్రబాబు విజయవాడలోని దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మించలేకపోయారని, ఇక రాజధాని ఏం నిర్మిస్తారని గాడి తప్పిన ప్రభుత్వ పాలనను ఎండగట్టారు.

>
మరిన్ని వార్తలు