వాయిదా వేయాలని మేమే కోరాం

16 Mar, 2020 03:45 IST|Sakshi

కరోనా ఉంటే ఓట్లు ఎలా అడుగుతాం?  

అందుకే వాయిదా వేయాలని కోరాం.. ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉంది 

పంచాయతీరాజ్‌ మంత్రి చెత్త మంత్రి

స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి 

ప్రతిపక్ష నేత చంద్రబాబు

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలు ప్రారంభమైనప్పుడే కరోనా వైరస్‌ ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంటే సీఎం జగన్‌కు పట్టడం లేదని, రాష్ట్రంలో అది లేదని చెప్పడం సరికాదన్నారు. సీఎం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, చాలా లైట్‌ తీసుకుంటున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుందని, దాని అధికారాలను ఎలా ప్రశ్నిస్తారన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఇంకా ఏమన్నారంటే.. 
- ఎన్నికల కమిషన్‌పై సీఎం అక్కసు వెళ్లగక్కాడు. కరోనా ఉంటే ఓట్లు ఎలా అడుగుతాం. పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు పెడుతున్నారు. ఎవరైనా ఒకరికి ఉంటే అది విస్తరిస్తుంది.

ఈసీని బెదిరిస్తారా మీరు. కోడ్‌ అమల్లోకి వచ్చాక అన్ని పార్టీలు సమానమే. పోలీసులు బాగా చేశారంటాడా ఈ సీఎం. ఇష్టానుసారం చేశారు. దౌర్జన్యాలు చేశారు. ఇష్టం వచ్చినట్లు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ఒక ఎలక్షనా. దీన్ని నేను గౌరవించాలా?

- ఈ ఎన్నికల కమిషనర్‌ను నేను పెట్టలేదు. నేను ఆ రోజు సీఆర్‌ బిశ్వాల్‌ను పెట్టాలని ప్రపోజ్‌ చేశాను. కానీ అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ ఇప్పుడున్నాయన తన దగ్గర ఏడు సంవత్సరాలు బాగా పనిచేశాడని, అతనికివ్వాలన్నారు. ఒప్పుకుని గౌరవించాను.

- చిత్తూరు నా సొంత జిల్లా. అక్కడ పంచాయతీరాజ్‌ మంత్రి చెత్త మంత్రి. వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో 14 సీట్లూ గెలుస్తున్నాం.

- నా జీవితంలో చాలామంది సీఎంలను చూశాను. అసమర్థ, అవినీతి, నాలెడ్జ్‌ లేని సీఎంలను చూశా. ఇవన్నీ ఉన్న అహంకార సీఎం ఈ సీఎం.

- స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం కాదు. ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేసి నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలి. ఈ పోలీసులపై మాకు నమ్మకం లేదు. పారా మిలటరీ, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను రప్పించాలి. 

మరిన్ని వార్తలు