లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంపై చంద్రబాబు ఉలిక్కిపాటు..

21 Feb, 2019 09:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు... ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ గురించి సీఎం చంద్రబాబు ఏకంగా పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ప్రస్తావించడం విశేషం. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్’  చిత్రంపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని, అందుకే ‘మహా నాయకుడు, కథానాయకుడు’ సినిమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ముక్తాయించారు.

కాగా ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏదంటూ దర్శకుడు వర్మ నిర్వహించిన ట్విటర్‌ పోల్‌కు భారీ స్పందనతో పాటు, నెటిజన్లు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కే జై కొట్టారు. 

>
మరిన్ని వార్తలు