బుజ్జగించేందుకు బాబొస్తున్నారు! 

6 Nov, 2019 08:04 IST|Sakshi

టీడీపీ అధినేత తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి 

జిల్లాకు ఏం చేశారంటూ మండిపాటు 

కులాల కుంపటి పెట్టి.. కొన్ని వర్గాలను దూరం పెట్టలేదా? 

నేడు చంద్రగిరికి చంద్రబాబు రాక  

అసంతృప్తులను చల్లార్చేందుకు మూడు రోజులు మకాం 

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో మూడు రోజులు మకాం వేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవడంతో జిల్లాలో అనేకమంది పార్టీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధినేత నిర్ణయాలతో అన్ని విధాలుగా నష్టపోయామంటూ తీవ్ర అసంతృప్తితో ఐదు నెలలుగా దూరంగా ఉంటున్నారు. పారీ్టలో ఓ వర్గం నాయకుల పెత్తనమే అధికంగా ఉండడంతో కొందరు పార్టీ మారిపోయారు. మరి కొందరు ఇప్పుడా? అప్పుడా? అంటూ సమయం కోసం వేచిచూస్తున్నారు. వారిని బుజ్జగించి స్థానిక ఎన్నికల్లో పనిచేయాలని చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం జిల్లాకు వస్తున్నారు.  

సాక్షి, తిరుపతి: చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు మకాం వేస్తున్నారు. నియోజక వర్గాలవారీగా సమీక్షించి పార్టీ నేతల మధ్య ఉన్నవిభేదాలు, అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఒప్పించడమే పర్యటన ముఖ్య ఉద్దేశంగా పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు ఇస్తామని ఆశ చూపించారు.

టీటీడీ పాలకమండలిలో చోటు కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న వారికి మొండిచేయి ఇచ్చారు. అందరి ఆశలపై నీళ్లు చల్లారు. వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచి పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించారు. కులాల కుంపట్లు పెట్టి పార్టీని చీలికలు పేలికలు చేసి ఘోర పరాజయానికి కారణమయ్యారు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
అందుకే దూరం.. దూరం 
రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా తాను పోటీచేసి గెలవలేనని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసే పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, ఆయనపై పోటీచేసి ఎవరూ గెలిచే అవకాశమే లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయినా సత్యప్రభను బలవంతంగా రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిపి ఓటమికి కారణమయ్యారని ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు ఓ వర్గాన్ని మాత్రం చేరదీయడం, మరో వర్గాన్ని విస్మరించడంతో పార్టీలలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.

మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ కోసం పార్టీలో వర్గాలుగా విడిపోయారు. దీంతో రాందాస్‌ చౌదరి ఎన్నికలకు ముందే పార్టీ వీడారు. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత పార్టీలో తనకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, మరో వర్గాన్ని ప్రోత్సహిస్తుండడంతో ఆమె పార్టీ మారిపోయారు. పీలేరులో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎన్నికల బరిలో నిలపడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుదీర్ఘ కాలంగా మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గానికి ఏమీ చెయ్యకపోవడంతో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది.

జిల్లాకు ఏం చేశారు? 
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా.. జిల్లాకు ప్రత్యేకం చేసింది ఏమిటని చంద్రబాబును ఆ పార్టీ నాయకులే ప్రశి్నస్తున్నారు. జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా... ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

మూడు రోజుల కార్యక్రమాలు ఇలా.. 
బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 1.30 గంటలకు మామండూరు వద్ద శ్రీదేవి అతిథిగృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం. సాయంత్రం 4 గంటల తరువాత తంబళపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం, 5 గంటలకు మదనపల్లె నియోజకవర్గం, 6 నుంచి 7 వరకు పీలేరు సమావేశం జరుగుతుంది.

రెండో రోజు
గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాడులకు గురైన బాధితులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు పుంగనూరు, 2–3  గంటల మధ్య పలమనేరు, 3–4 గంటల మధ్య నగరి, సాయంత్రం 4 – 5 మధ్య చిత్తూరు, 5 – 6 శ్రీకాళహస్తి, 6 – 7 మధ్య సత్యవేడు నియోజకవర్గాల సమీక్షలు జరుగుతాయి. 

మూడో రోజు  
8వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. 10 నుంచి 11 వరకు చంద్రగిరి, మధ్యాహ్నం 1 – 12 మధ్య కుప్పం, 12 – 1 పూతలపట్టు, 2 – 3 గంగాధర నెల్లూరు, 3 – 4 మధ్య తిరుపతి సమావేశాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 . 30 గంటలకు విలేకర్ల సమావేశం, 5:00 గంటలకు విజయవాడకు పయనమవుతారు.

మరిన్ని వార్తలు