అందుకే ‘బాబుకో నమస్కారం’ 

16 Feb, 2019 11:18 IST|Sakshi

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక‍్కొక్కరు దూరం కావడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవాలను అంగీకరించలేని ఆయన... తప్పు తనది కాదంటూ మళ్లీ ఎదురు దాడికి దిగుతున్నారు. అంతేకాకుండా తన నియంతృత్వ పోకడలు బయటపెడుతున్న నేతలను డబ్బు కోసమే పార్టీలు మారుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వలసలు వెల్లువెత్తుడటంతో చంద్రబాబు తీవ్ర నిరాశా నిస్పృహలతో సభ్యత, సంస్కారాన్ని మరిచిపోయారేమో అనిపిస్తోంది. చంద‍్రబాబుపై విశ్వాసం కోల్పోయి ‘బాబుకో నమస్కారం’ అంటూ  టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరేందుకు వస్తుండటంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. 

స్వార్థం కోసం పార్టీలు మారినవారిని ప్రజలు ఆదరించరంటూ నీతి సూత్రాలు వల్లిస్తున్న చంద్రబాబుకు... గతం గుర్తుకు రావడం లేదా, లేక నిజంగానే ఆయన అల్జీమర్స్‌తో బాధపడుతున్నా అనే అనుమానం కలుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి... ఆ తర్వాత ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు భారీ తాయిలాలు ఇవ్వడమే కాకుండా వారిలో ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేయకుండానే... టీడీపీ కండువా కప్పుకున్నారు. మరి అప్పుడు నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు మాత్రం ...అయ్యో మా నేతలను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ ప‍్రతిపక్షంపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

అప్పట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలే స్వయంగా తమకు భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు స్వయంగా ఒప్పుకున్న విషయం తెలిసిందే. డబ్బు సంచులతో రాజకీయాలను వ్యాపారంగా మార్చిన చంద్రబాబు మాత్రం తన అభివృద్ధిని చూసే వాళ్లంతా టీడీపీలోకి వచ్చారని చెప్పుకోవడం హాస్యాస్పదమే. టీడీపీలోకి వచ్చేవాళ్లంతా తన విజన్ చూసి వస్తారంటూ... అదే పార్టీని వీడితే మాత్రం...స్వార్థం, అమ్ముడు పోయారంటూ విమర్శలు చేయడం దిగజారుడు తనమే. 

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌పై పదేళ్లు అధికారం ఉన్నప్పటికీ ‘ఓటుకు కోట్లు’  కేసులో ‘బ్రీఫ్‌డ్‌ మీ’  అంటూ అడ్డంగా దొరికిపోయి ఆ తర్వాత అమరావతికి మర్చిన చంద్రబాబు నేను ఏపీలోనే ఉంటున‍్నానని  మీడియా సాక్షిగా డప్పుకొట్టుకోవడం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లాంటిదే. నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుందనే దానికి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీని వీడుతున్న నేతలు... ఆ పార్టీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉంటుందనే చెప్పే మాటలు కూడా అక్షర సత్యమే. చంద్రబాబు నాయుడే స్వయంగా ’దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అంటూ తన మనసులో మాటను గతంలోనే బయటపెట్టేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తాను ఏది చెప్పినా, ఏం చేసినా పిచ్చి జనం నమ్మేస్తారనే భ్రమలో నుంచి ఎప్పుడు బయటపడతారో మరి.  

మరిన్ని వార్తలు