కాంగ్రెస్‌తో కలిసి బాబు కొత్త సినిమా

23 Dec, 2018 03:18 IST|Sakshi
శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

టెక్కలి సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో జత కట్టారు 

చంద్రబాబు అవినీతిపరుడన్న కాంగ్రెస్‌ ఇప్పుడెలా కలుస్తోందో?

కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వీళ్లెవరినీ నమ్మొద్దు 

చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేననూ నమ్మొద్దు 

25 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపించుకుంటే మనమే శాసిస్తాం 

ఆర్టీజీఎస్‌లో ప్రజల బాధలు కనిపించడం లేదా బాబూ?

ఐఎండీ, ఇస్రోకన్నా కచ్చితమైన సమాచారం రప్పించడానికి శాటిలైట్‌ పంపావా?

సముద్రాన్ని మేనేజ్‌ చేశాడట.. తుపాన్‌ను ఓడించాడట.. 

దేవుడు, సృష్టిని జయించానని, నవగ్రహాలను కంట్రోల్‌ చేస్తున్నాననీ చెప్పగలరు

తిత్లీ బాధితులను గాలికొదిలేసి.. గ్రామాల్లో లేని వారికి పరిహారం చెక్కులు 

మంత్రి అచ్చెన్నాయుడి అరాచకాలకు అంతేలేదు

చంద్రబాబును నేనివాళ ఒక్కటే అడుగుతున్నా. రాష్ట్రాన్ని విడగొట్టింది ఇదే కాంగ్రెస్‌ పార్టీ కాదా? విభజన చట్టంలో విభజన హామీలన్నీ అమలు చేస్తామని పొందుపర్చకుండా, ప్రతి హామీని.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరి నుంచి, ఆయిల్‌ రిఫైనరీ, విశాఖపట్టణం రైల్వే జోన్, ప్రత్యేక హోదా అన్నీ కూడా చూస్తాం.. పరిశీలిస్తాం.. అని చెప్పడం కాంగ్రెస్‌ చేసిన అన్యాయం కాదా?  

నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు.. ఆ తర్వాత రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ అయిపోతాయని రైతులకు సినిమా చూపించారు.   మోదీ ప్రధాని కాగానే మన రాష్ట్రానికి పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వస్తుందని సినిమా చూపించాడు చంద్రబాబు. ఆ సినిమా అయిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి   అయ్యాక నాలుగేళ్లు ఆయన ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినంత సేపు దాని గురించే మాట్లాడలేదు. ఆ నాలుగేళ్లు చిలుకా గోరింకలే అసూయపడేలా వీరి కాపురం సాగింది. నాలుగేళ్ల తరువాత బీజేపీకి విడాకులు ఇచ్చేసి, ఇక బీజేపీ చెడ్డది అని చంద్రబాబు ప్రచారం చేస్తూ కొత్త సినిమా మొదలెట్టాడు.

ఈ పెద్దమనిషికి ఆయనపై విచారణ జరుగుతుందని భయం పట్టుకుంది. ఎందుకా భయం అంటే.. సంపాదించిన అవినీతి సొమ్ముతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాలేదు. తిన్నది అరగలేదు. అప్పుడు మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఇచ్చి కొన్నాడు. అదీ సరిపోక తెలంగాణకు వెళ్లి అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కోట్ల రూపాయల డబ్బును సూట్‌కేసులో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు. ఆ కేసులు బయటకు వస్తాయేమోనని, వాటిపై విచారణ జరుగుతుందేమోనని, విచారణ జరిగినప్పుడు ఆయనకు మద్దతుగా పార్లమెంటులో గొడవ చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీని నిస్సిగ్గుగా మద్దతు అడిగాడు. 

అన్నీ ఆర్టీజీఎస్‌ ద్వారా తెలుస్తాయని చెబుతున్న చంద్రబాబుకు ప్రజలు పడుతున్న బాధలు, అవస్థలు అందులో కనిపించడం లేదా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? సముద్రాన్ని కంట్రోల్‌ చేశానని, తుపానులను జయించానని చెబుతున్న చంద్రబాబు.. ఒకస్థాయి దాటిపోయి దేముడిని, సృష్టిని జయించానని, నవగ్రహాలనూ కంట్రోల్‌ చేస్తానని చెప్పినా చెబుతాడని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ప్రజలు చెబుతున్నారు. 

చంద్రబాబు పోకడ సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది. తుపాను ఎలా వస్తుందో, ఎంత వేగంగా వస్తుందో ఐఎండీ, ఇస్రోలు రిపోర్టులు ఇస్తే వాటినే ఆర్టీజీఎస్‌లో అటు ఇటుగా మార్చి ఇదేదో తానే కనిపెట్టానని చెప్పుకుంటున్న ఈ మనిషి అసలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్‌ తానే కనిపెట్టానంటాడు. కంప్యూటర్లు కూడా తానే తెచ్చాడట. హైదరాబాద్‌ను కట్టానంటారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధుకు తానే బ్యాడ్మింటన్‌  నేర్పానంటాడు. తెలుగువాడైన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్లకు కంప్యూటర్‌ కొట్టడం కూడా నేర్పించానంటాడు.  

ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్రంలోని యువతకు కాస్తో కూస్తో ఉద్యోగాలు వస్తాయనే విషయం తెలిసి కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చక పోవడం రాష్ట్రానికి
అన్యాయం చేయడం కాదా? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి కాంగ్రెస్‌ పార్టీతో కలిసి
చంద్రబాబు ఇవాళ రెండో సినిమా తీస్తున్నాడు.

– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన వ్యక్తిగా చంద్రబాబునాయుడిపై పుస్తకాన్ని విడుదల చేసిన కాంగ్రెస్, నాలుగు నెలలైనా తిరక్క ముందే టీడీపీతో పొత్తుకు సిద్ధపడటం దారుణమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టు కట్టి కొత్త సినిమా చూపిస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబునాయుడు అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ములో కాస్త వాటాను ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆయనతో జత కట్టడానికి సిద్ధపడిందని నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 328వ రోజు శనివారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి అంబేద్కర్‌ సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి పోతున్నాయో.. కాంగ్రెస్‌–టీడీపీ మధ్య అనైతిక పొత్తు ఎలా సాగుతోందో రాష్ట్ర ప్రజలంతా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు మోదీతో కలిసి సినిమా చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు రాహుల్‌తో కలిసి మరో కొత్త సినిమాను ప్రజల ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

కాంగ్రెస్‌ పార్టీని నాడు చంద్రబాబు ఏమన్నాడు? 
‘‘రాష్ట్రంలో ఇంత అన్యాయమైన రీతిలో పాలన జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మభ్య పెట్టేందుకు ఈ మధ్య కాలంలో ఓ కొత్త సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరేంటో తెలుసా? ‘చంద్రబాబు – కాంగ్రెస్‌ దోస్తీ’. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేంది ఏమిటంటే... రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్‌ పార్టీయే కదా! మరి ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ అసలు మన రాష్ట్రానికి రాగలుతుందా? ఆ పార్టీకి ఓటేయగలుతామా? అన్నాడు. ఇవాళ పొత్తుకు సిద్ధమయ్యాడు. కాంగ్రెస్‌ ఇంకా ఎంత అన్యాయమైన పార్టీయో ఇక్కడ చెప్పాలి. ఇదే కాంగ్రెస్‌ పార్టీ 2018 జూన్‌ 8న చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. చంద్రబాబునాయుడు అంతటి అవినీతిపరుడు, అన్యాయమైన వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేడని చెప్పి ఏకంగా రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇది జరిగి నాలుగు నెలలైనా తిరక్క ముందే ఇదే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుతో జత కట్టడానికి ముందుకెళ్లింది. చంద్రబాబు సంపాదించిన అవినీతి సొమ్ములో కాస్త వాటా ఇచ్చేటప్పటికి కాంగ్రెస్‌ పార్టీ ఇందుకు సిద్ధపడింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి అనైతిక రాజకీయాలు, పొత్తులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి.  

యాక్షన్‌ అదే.. యాక్టర్లు మారారు.. 
నిన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మనందరికి ఒక సినిమా చూపించాడు. బీజేపీని, నరేంద్ర మోదీని అందులో నటులుగా చూపించాడు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టి దారుణంగా అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రెండో సినిమా చూపిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇది వరకు మనకు చూపించిన పాత సినిమానే. కాకపోతే యాక్టర్లు మారారు. ఇంతకు ముందు మోదీ ఉన్నాడు. ఇపుడు ఆ స్థానంలోకి రాహుల్‌ గాంధీ వచ్చాడు. అదే యాక్షన్‌.. సినిమాను ప్లే చేస్తే అవే డైలాగులు వస్తాయి. అధికారంలోకి వస్తూనే రుణాలు మాఫీ చేస్తామని ఈయన ఒక డైలాగ్‌ చెబుతున్నాడు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని రెండో డైలాగును రాహుల్‌ చెబుతున్నాడు.  

వీళ్లందరినీ మళ్లీ నమ్మి మోసపోవద్దు 
వీళ్లందరినీ మనం నమ్మి, నమ్మి సాలై పోయింది. ఇక మోసపోవడం మానేద్దాం. ఎవర్నీ నమ్మొద్దు. కాంగ్రెస్‌ను నమ్మొద్దు. కాంగ్రెస్‌ పార్టీ వల్లనే రాష్ట్రం విడిపోయి మనకు ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చాయి. బీజేపీని కూడా నమ్మొద్దండి. ఇదే బీజేపీ చేయదగ్గ స్థానంలో ఉండి కూడా మనకు ఏమీ చేయకుండా మోసం చేసిన పరిస్థితి. చంద్రబాబును అసలు నమ్మొద్దు. ఈ మోసానికంతకూ కారణం ఎవరైనా ఉన్నారూ అంటే అది చంద్రబాబే. ఇంకొక నాలుగో వ్యక్తి ఉన్నాడు. చంద్రబాబు గారి పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌.. ఆయన్నూ నమ్మొద్దండి. ఆ పెద్దమనిషి (పవన్‌) గత ఎన్నికల్లో సభలు పెట్టి.. మోదీతోను, చంద్రబాబుతోను నేను చేయిస్తాను అని ప్రజలతో ఓట్లేయించాడు. వీళ్లందరూ మనల్ని దారుణంగా మోసం చేసిన వారే. వీళ్లందరూ కలిసికట్టుగా నిలబడి గత ఎన్నికల్లో మనకు మాటిచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక హోదాను ఎలా పొడిచారో ఒక్క సారి రాష్ట్ర ప్రజలందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రత్యేక హోదాను హత్య చేసే పథకంలో ఒకరు కత్తి ఇస్తే.. ఇద్దరు కాళ్లూ చేతులు పట్టుకున్నారు. ఇంకొకరు పొడిచారు. ఇలా వీరందరూ కలిసి మనలను పొడిచారు. అందుకే మిమ్మల్ని నేను కోరేదొక్కటే. రేపు 25కు 25 ఎంపీ స్థానాలను మన పార్టీ తరుఫునే గెలిపించుకుందాం. తర్వాత దేశానికి ప్రధాని ఎవరవుతారనేది మనమే శాసిస్తాం. ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికి కాదు.. ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన తర్వాతే మద్దతు ఇస్తాం. ఈ అవకాశం మన చేతుల్లోకే తీసుకుందాం. వీళ్లందరినీ మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు. 

బాబును పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిందేనంటున్నారు 
చంద్రబాబు అహంకారం ఒక స్థాయి దాటిపోయి మాట్లాడుతున్నారు. ఈ పెద్దమనిషి ఇటీవలి కాలంలో అంటున్న మాటలు ఏమిటో తెలుసా? సముద్రాన్ని కంట్రోల్‌ చేశాడంట. పెథాయ్‌ తుపానును ఓడించాడట. సముద్రాన్ని కంట్రోల్‌ చేయడమేమిటి? తుపానును ఓడించడమేమిటి? ఈ పెద్దమనిషి చేయడమేమిటి? మైకుల్లో చెప్పడమేమిటి? దానిని ఆ ఎల్లో మీడియా వాళ్లు రాయడమేమిటి? టీవీల్లో చూపించడమేమిటి? ఇటీవల ఒక పెద్దమనిషి నాదగ్గరకు వచ్చి చంద్రబాబు మనస్తత్వమెలా ఉంటుందో తెలుసా? అని అడిగితే చెప్పన్నా అన్నాను. ఒక బస్సుకు ప్రమాదం జరిగి పది మంది మరణిస్తే మనమంతా ఏమనుకుంటాం. అయ్యో పదిమంది ప్రాణాలు పోయాయే.. పాపం చనిపోయారే.. అనుకుంటాం. కానీ చంద్రబాబునాయుడు ఆ బస్సు ప్రమాదంలో 40 మంది బతకడం తన విజయమని చెప్పుకోగలుతాడు. అలాంటి వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు ఒకస్థాయి దాటిపోయి దేవుడి మీద విజయం సాధించానని, సృష్టి మీద విజయం సాధించానని, నవగ్రహాలను కంట్రోల్‌ చేస్తున్నానని చెబుతాడని,  ఈ పెద్దమనిషిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమోనని నాతో అన్నారు. ఇంతకూ పెథాయ్‌ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా అని ఆ పెద్దమనిషి అడిగాడు. చెప్పన్నా అన్నాను. తుపాను వస్తుందని ఐఎండీ, ఇస్రో వాళ్లు చెప్పారు. అందరికీ తెలిసినప్పుడు సీఎం హోదాలో ఉండి చేయాల్సింది ఏమిటి? తుపానును, ప్రజలను గాలికి వదిలేసి ప్రత్యేక విమానం ఎక్కి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ సీఎంలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడికి వెళ్లారు. ఈ పెద్దమనిషికి అక్కడ పనేమిటి? పెథాయ్‌ తుపాను వల్ల ఆరేడు లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే తన వల్లే పంటనష్టం తగ్గిందని చెబుతున్నారు. ఇంత నీచమైన వ్యక్తిని ఏమనాలి? పంట నష్టాన్ని తగ్గించి చూపిస్తూ రైతుల గొంతు కోస్తున్న ఈపెద్దమనిషిని ఏమనాలన్నా అని ప్రజలు అడుతుగున్నారు. తుపాను వచ్చినప్పుడు సీఎం.. రైతులు, పేదలకు తోడుగా ఉండాలి. వారికి పరిహారం డబ్బు ఇప్పించాలని ఆలోచన చేయాలి. ఆరు జిల్లాల్లో ఏర్పడిన నష్టాన్ని అధికారులు ఒక్కరోజులో లెక్క కట్టాలని హుకుం జారీ చేసిన ఇతను అసలు మనిషేనా? పొలాల్లో కోసిన పంట నీళ్లలో మునిగిపోతే దాన్ని పరిగణనలోకి తీసుకోడట. 33 శాతం కన్నా ఎక్కువ పంట నేలమట్టమైతే కానీ స్పష్టంగా చూపించరట. కౌలు రైతులకు పరిహారం ఇవ్వరట. ఈ రకంగా 90 శాతానికి పైగా నష్టాíన్ని తగ్గించి బాధితులకు పరిహారం ఎగ్టొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం సీఎంయేనా అని అడుగుతున్నారు.  

కొత్తగా ఏమైనా కనిపెట్టావా బాబూ? 
వాతావరణ విభాగం కన్నా తన ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌) తుపానుపై కచ్చితమైన సమాచారం ఇచ్చిందని డబ్బాలు కొట్టుకొంటూ పంట నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్న ఈ పెద్దమనిషిని ఏమనాలన్నా అని రైతులు అడుగుతున్నారు. ఇదే చంద్రబాబును కొన్ని  ప్రశ్నలు అడుగుతున్నా.. ఈ మధ్యకాలంలో ఆర్టీజీఎస్‌ ద్వారా ఐఎండీ కన్నా ఇస్రో కన్నా గొప్పగా సమాచారం రప్పించానంటున్నావు. ఈ సమాచారం ఆధారంగానే రైతులందరినీ కాపాడగలిగానని చెబుతున్నావు. ఐఎండీ కన్నా, ఇస్రో కన్నా కచ్చితమైన తుపాను సమాచారం తెలుసుకోవడానికి నీవేమైనా కొత్తగా ఏదైనా కనిపెట్టావా? ఈ సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి అయినా నిధులు ఖర్చు చేశావా? కచ్చితమైన సమాచారం రాబట్టడానికి ప్రత్యేకంగా శాటిలైట్‌ పంపించావా? ఇస్రోతో ఎంఓయూ చేసుకున్నట్లు చెబుతున్నావు.. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2006లోనే ఎంఓయూలు చేసుకోలేదా? ఇస్రోతో ఎంఓయూలు తెలంగాణ, అనేక రాష్ట్రాలు చేసుకోలేదా? ఆసేవలన్నీ ఇస్రో ఉచితంగా ఇస్తున్నవే కదా? ఉచితంగా ఇచ్చే ఆ సేవలను సమాచారాన్ని వారి నుంచే తీసుకొని ఆర్టీజీఎస్‌ ద్వారా తెప్పించానని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతారా? ఆర్టీజీఎస్‌ కొత్త పదమని చాలా మందికి తెలియదని, ప్రజలు నమ్ముతారని చెవిలో పువ్వులు పెట్టవచ్చని ఆరాట పడుతున్నాడు. అద్భుతాలు చేశానంటున్నారు. ఆర్టీజీఎస్‌ పెద్దబోగస్‌ అని కేబినెట్‌ మంత్రి మీకు లేఖ రాయలేదా? 

ఇలాంటి నాయకుడు అవసరమా? 
తిత్లీ తుపాను వల్ల నష్టపోయిన వారు పరిహారం అడిగితే తోకలు కత్తిరిస్తా.. బుల్డోజర్లతో తొక్కిస్తానని బెదిరించిన ఈపెద్దమనిషి నీచమైన రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలుసా? పచ్చ చొక్కాల వాళ్లు ప్రజా ధనాన్ని లూఠీ చేస్తున్నారు. తిల్లీ తుపాను పేరు చెప్పి ఇక్కడ లేని వారు కూడా పంటనçష్టం తీసుకొనే పరిస్థితి ఉందని ప్రజలు ఈ చెక్కులు (చెక్కులను చూపిస్తూ) ఇచ్చారు. ఈ చెక్కుల్లోని పేర్లున్న మనుషులు గ్రామాల్లో ఎవరూ లేరని చెబుతున్నారు. నందిగాం మండలం కల్లాడలో కవిత నరేష్‌కు రూ.23 వేలు ఇచ్చారు. వీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. గుంటా మురళీధరరావుకు రూ.22,267 చెక్కు. నందిగాం మండలం కల్లాడ గ్రామం. మెండా జగన్మోహన్‌రావుకు రూ.9,716కు చెక్కు. నందిగా>ం మండలం సావరసోమందుపురం గ్రామం. ఎర్ర సోమేశ్వరరావుకు రూ.5 వేలు. కల్లాడ గ్రామం. ఆబోతుల మిన్నారావుకు రూ.2,670 చెక్కు. వీరంతా ఎక్కడ ఉన్నారో తెలియదు. వీరిపేర్లతో అకౌంట్లను ఓపెన్‌ చేసి లూటీ చేస్తున్నారు. తిత్లీ తుపాను వల్ల రూ.3,435 కోట్లు నష్టం వచ్చిందని చంద్రబాబు కేంద్ర హోమ్‌ మంత్రికి లేఖ రాశారు. కానీ చంద్రబాబు మాత్రం ముష్టి వేసినట్లు రూ.500 కోట్లు అంటే 15 శాతం కూడా ఇవ్వలేదు. కానీ బస్సులపై, ఫ్లెక్సీలు వేసి భారీగా ప్రచారం చేసుకుంటున్నారు. బాబు తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్లుంది. పెథాయ్‌ తుపాన్‌ విషయంలోనూ అంతే. తుపాన్లను కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవాలనుకుంటాడు. ఇలాంటి వ్యక్తి నాయకుడిగా అవసరమా? ఆలోచించండి. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. ఇది జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలు అమలు చేస్తామని ప్రకటించాం. ఇందులో భాగంగా మీ పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ ఏ విద్య చదివిస్తారో చదివించండి. ప్రతి ఒక్కరినీ నేను దగ్గరుండి చదివిస్తా. ఎంత ఖర్చయినా భరిస్తానని మీకు హామీ ఇస్తున్నా. హాస్టల్‌ ఖర్చుల కోసం రూ.20 వేలు ఇస్తాం. చిట్టి పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం. చంద్రబాబు మూసేయించిన ప్రభుత్వ స్కూళ్లన్నీ తెరిపిస్తాను. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచరు ఉద్యోగాలన్నింటినీ మెగా డీఎస్సీ పెట్టి మొత్తం భర్తీ చేస్తాం. అవసరమైనన్ని ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

ఆర్టీజీఎస్‌లో ఇవి కనిపించవా బాబూ? 
- రూ.87,612 కోట్ల రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ మాఫీ కింద మీరు ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదు. రైతుల రుణాలు 1.26 లక్షల కోట్లకు ఎగబాకాయి. వడ్డీ భారం రూ.12 వేల కోట్లు రైతులు కడుతున్నారు. ఈ విషయాలు కనిపించవా? 
అక్కచెల్లెమ్మలకు డ్వాక్రా రుణామాలు మాఫీ అని ఎగ్గొట్టారు. వారికి బ్యాంకులు నోటీసులు ఇస్తూ ఇళ్లకు తాళాలు వేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల అవస్థలు కనిపించవా? 
ఎన్నికల వేళ బాబు వస్తే జాబు వస్తుందన్నారు. లేకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని చెప్పి ఇవ్వలేదు. కొడుకును మంత్రివర్గంలో చేర్చుకొని ఉద్యోగం ఇచ్చావు. ఒక్క చదువుకున్న పిల్లాడికీ ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు అని రూ.1000కి తగ్గించారు. అయిదేళ్లపాటు ఇవ్వాల్సింది పోయి ఎన్నికలకు 3 నెలల ముందు ఇస్తానంటున్నారు. 1.7 కోట్ల ఇళ్ల కుటుంబాలను 3 లక్షలకు కుదించారు. ఇవన్నీ కనిపించడం లేదా?  
మోడల్‌ స్కూల్‌ టీచర్లకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించలేదని కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో పిల్లలు పడుతున్న అవస్థలు కనిపించవా? 
మీ హయాంలో కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు, కాలేజీ, స్కూలు ఫీజులు బాదుడే బాదుడు. ఆరోగ్యశ్రీ కింద రూ.550 కోట్ల బకాయిలు ఇవ్వనందున సేవలను ఆపేస్తున్నట్లు ఆసుపత్రులు నోటిసులు ఇచ్చిన సంగతి కనిపించడం లేదా?   
బిల్లులు ఇవ్వక మొండిగోడలతో ఇళ్లు నిలిచిపోయిన పరిస్థితి తెలియడం లేదా?  
జన్మభూమి కమిటీల పేరుతో అన్నీ లంచాలమయం అయిపోయిన సంగతి తెలియదా? 
పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతువుల గోడు వినిపించడం లేదా? 
రేషన్‌షాపులో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని కనిపించడం లేదా? 
సీఎంగా ప్రమాణం చేయగానే బెల్టుషాపులు వద్దన్నావు. ఇప్పుడవి ఊరు ఊరుకి నాలుగైదు కనిపిస్తాయి. తాగడానికి నీళ్లుండవు కానీ ఫోన్‌కొడితే మందు సరఫరా చేస్తారు. ఇవన్నీ కనిపించవా? 
ఎన్నికల్లో మీరిచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ఎన్నికల ప్రణాళికలో చేర్చి అమలు చేయకపోతే సెక్షన్‌ 420 పెట్టి బొక్కలో పెట్టాల్సిన పని లేదా? రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మోసం, అబద్ధాలు, అన్యాయం. ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధాని భూములు, విశాఖ భూములు, గుడి, దళితుల భూములు.. ఇలా అన్నింటా దోపిడే. ఎక్కడ పడితే అక్కడ దోచేస్తున్న పరిస్థితి.   

తాటి చెట్టంత మంత్రి ఈత కాయంత మేలు కూడా చేయలేదు..
మంత్రి అచ్చెన్నాయుడు తాటి చెట్టంత ఎదిగినా, ప్రజలకు ఈత గింజంత మేలు కూడా చేయలేదని ప్రజలు చెబుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి పనికీ లంచం గుంజుతున్నారని ప్రజలు తనకు దారిపొడవునా చెబుతూ వచ్చారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 328వ రోజు శనివారం ఆయన టెక్కలి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

‘టెక్కలి గత చరిత్రను చూద్దాం. ఇదే నియోజకవర్గం నుంచి 1994లో ఎన్టీ రామారావును ఇక్కడి ప్రజలు గెలిపించారు. అదే సంవత్సరంలోనే జరిగిందేమిటో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోగానే సొంత కూతురిని ఇచ్చిన మామకు వెనుక నుంచి పొడిచిన వ్యక్తి ఇదే చంద్రబాబునాయుడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా పొడుస్తూనే... ఉన్నాడు. అదే చంద్రబాబునాయుడి కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడిన మంత్రి అవినీతి విశ్వస్వరూపం. ఆయనకు ఈపేరు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చెబుతుంటారు. మా మంత్రి తాటి చెట్టంత ఎత్తయితే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈత కాయంత మేలైనా చేయలేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మంత్రి అచ్చెన్నాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. ఆముదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాలన్నింటికీ మా మంత్రి అచ్చెన్నాయుడే బిగ్‌బాస్‌ అని అంటున్నారు. ఇక్కడి నుంచి లంచాలు చినబాబు, పెదబాబుకు చేరవేస్తుంటాడన్నా అని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు పని జరిగినా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు అచ్చెన్నాయుడి తమ్ముడు హరిప్రసాద్‌ మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. నీరు–చెట్టు అవినీతి గురించి చెబుతూ సీతా సాగరం, దిమిలాడ చెరువులు దీనికి ఉదాహరణ అని చెబుతున్నారు. ఇక్కడే ఎకరా రూ.5 కోట్లు విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా తన బినామీలకు మంత్రి తక్కువ ధరకు ఇప్పించారన్నా అంటున్నారు.

వివిధ కార్పొరేషన్‌ల ద్వారా వచ్చే డబ్బులకు కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడే మంత్రి ఎవరైనా ఉంటారా.. అంటే అది మా మంత్రే అని చెప్పుకొస్తున్నారు. చివరకు మరుగుదొడ్ల మంజూరుకు కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లంచాలు ఇచ్చుకోవలసిన అధ్వాన పరిస్థితి. అంగన్వాడీ సహా చిన్నా చితకా పోస్టులు అమ్ముకొనే దుర్గతి ఇక్కడే కనిపిస్తోందన్నా అంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి సహా ఏకంగా 1,500 మంది పెన్షన్లు కట్‌చేస్తే వారు కోర్టులకు వెళ్లి న్యాయం పొందిన పరిస్థితి ఇక్కడే కనిపిస్తోంది. 26 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచుల చెక్‌పవర్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అచ్చెన్న రద్దు చేశారు. ఈ పెద్దమనిషి మంత్రి అవుతూనే చాకిపల్లిలో దళిత మíహిళ చిన్న కిరాణాకొట్టు నడుపుకొంటూ బతుకుతుంటే ఆమెపై కూడా కక్ష కట్టి బుల్డోజరుతో కొట్టును తొలగించారన్నా అని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఏకంగా 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేశాడన్నా ఈ సిగ్గుమాలిన మంత్రి అని చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గొడౌన్లు కట్టుకున్నారని, అందులో తరుగు పేరిట బస్తాకు రెండు కేజీలు చొప్పున ఏడాదికి రూ.3 కోట్ల విలువైన బియ్యం స్వాహా చేస్తున్నారని చెబుతున్నారు.  

పాలిషింగ్‌ యూనిట్లు మూత పడుతున్నాయి.. 
టెక్కలి నియోజకవర్గంలో 65 క్వారీలు, 75 పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక కొత్త క్వారీయింగ్‌ లైసెన్స్‌ కావాలన్నా, ఎన్‌ఓసీ ఇవ్వాలంటే ఏకంగా రూ.25 లక్షలు లంచం ముట్టచెబితేనే కానీ పని జరగడం లేదంటున్నారు. మంత్రికి భవానీ గ్రానైట్స్‌ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి రోజుకు 3 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ రాయి ప్రతి పాలిషింగ్‌ యూనిట్‌ నుంచి పంపించకపోతే ఈ పెద్దమనిషి ఊరుకోవడం లేదన్నా అని చెబుతున్నారు. గతంలో సీనరేజి ఫీజు క్యూబిక్‌ మీటర్‌కు రూ.1,200 ఉంటే సీఎంగా చంద్రబాబు వచ్చాక రూ.2,950కి పెంచాడని చెబుతున్నారు. ఉద్యోగాలు రావాలంటే గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్ల వంటివి అన్నీ ముందడుగు వేయాలి. అవేవీ లేకపోతే ఏరకంగా బతుకుతామంటున్నారు. ఈయన సీఎం అయ్యాక సింగపూర్, జపాన్‌ అంటూ ఆయా దేశాలకు వెళ్తాడు. ఉద్యోగాలు తీసుకువస్తున్నానంటారు. ఇక్కడ ఉన్న పాలిషింగ్‌ యూనిట్లు మూతపడుతున్న పరిస్థితి. ఇదే పాలిషింగ్‌ యూనిట్లకు గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరెంటు యూనిట్‌కు రూ.3.15 ఉంటే చంద్రబాబు రూ.8 చేశాడంటున్నారు.

ఇలాంటి స్థితిలో పరిశ్రమలు మూతపడక మిగులుతాయా అని అంటున్నారు. ఇక్కడే మెట్‌కోర్‌ పెర్రో అల్లాయీస్‌ సంస్థ కార్మికులు ధర్నా చేస్తూ కనిపించారు. ఈ సంస్థ అచ్చెన్నాయుడు కార్మిక మంత్రి అయ్యాక 2017లో పూర్తిగా మూత పడింది. 2015 నుంచే ఈ ఫ్యాక్టరీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని మొర పెట్టుకుంటే, న్యాయం చేయాల్సిన ఈయన అ యాజమాన్యంతో కుమ్మక్కై ఏకంగా ఆఫ్యాక్టరీలోని మెటీరియల్‌ను పూర్తిగా అమ్ముకొనేలా చేశారని చెబుతున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.3 లక్షల చొప్పున బకాయిపడి ఈరోజు ధర్నాలు చేస్తున్నా పట్టించుకొనే నాథుడు లేడు. టెక్కలి, నందిగామ, పలాస, మెళియాపుట్టి మండలాల్లో 108 గ్రామాల్లో 24,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడానికి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.127 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు ప్రారంభించారు. ఆయన బతికుండగానే దాదాపుగా 30 నుంచి 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు లంచాలు ఎలా తినాలో వెతుక్కుంటూ ఆ ప్రాజెక్టులో మిగిలిన పనులకు ఏకంగా రూ.427 కోట్లకు అంచనాలు పెంచి దోచేశారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల లేదంటున్నారు. 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుçన్న కాకరాపల్లి పవర్‌ ప్లాంటును రద్దు చేస్తానని చెప్పిన బాబు ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. భావనపాడు పోర్టు ప్రాజెక్టు కోసం రైతుల అంగీకారం లేకున్నా చంద్రబాబు ఏకంగా 5 వేల ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విలువ ఉండగా రూ.12 లక్షలు ఇచ్చేలా నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇది ధర్మమేనా?’ అని జగన్‌ అన్నారు. 

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 
పొలాకి(శ్రీకాకుళం జిల్లా):  ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన అనుచరులు, నాయకులతో కలిసి శనివారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నేత కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలుసుకుని, ఆయన తన అభిమతాన్ని వెల్లడించారు. జగన్‌.. రాంబాబుతో పాటు ముఖ్య నాయకులకు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్‌ వారికి సూచించారు. చంద్రబాబు అరాచక పాలన నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు రాంబాబు తెలిపారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోలగట్ల మాట్లాడుతూ రాంబాబు రాకతో వైఎస్సార్‌సీపీకి వాణిజ్య విభాగ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందని చెప్పారు. వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు, రాజకీయ ప్రాధాన్యతలు కల్పిస్తామన్న జగన్‌ ప్రకటనతో వైశ్యులు వైస్సార్‌సీపీకి తమ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో వచ్చేది జగన్‌ సమక్షంలోని ప్రజాప్రభుత్వమే అని చెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిన వారిని జగన్‌కు పరిచయం చేశారు. బేస్తవారిపేట మండల టీడీపీ అధ్యక్షుడు పి.భూపాల్‌రెడ్డి, కంభం ఏఎంసీ చైర్మన్‌ నెమలిదిన్నె చిన్నారావు, వైస్‌ చెర్మన్‌ రమేష్‌బాబు, కంభం ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యుడు జకీర్‌ హుస్సేన్, మాజీ ఎంపీపీలు గడ్డం ఓబయ్య, చౌదరి, నాయుడు, గిద్దలూరు  ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోటా నర్సింహులు, పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు