ట్వీటు చెప్పిన లోగుట్టు!

27 Nov, 2019 12:46 IST|Sakshi

చంద్రబాబు, లోకేశ్, పవన్‌ ఇక్కడే ఉండగా.. 

 విదేశీ కాలమానం ప్రకారం నిమిషాల వ్యవధిలో ట్వీట్లు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా ముగ్గురి పాట్లు

కొత్త ట్వీట్లతో దిద్దుబాటుకు టీడీపీ, జనసేన తిప్పలు

ముగ్గురి తరఫున విదేశాల నుంచి ఓ సంస్థ ఈ ఖాతాలు నిర్వహిస్తోందంటున్నఐటీ నిపుణులు

సాక్షి, అమరావతి: కొన్ని షెల్‌ (డొల్ల) కంపెనీలు ఒకే అడ్రస్‌తో పలు సంస్థలను నిర్వహిస్తూ బురిడీ కొట్టిస్తుంటాయి. షెల్‌ కంపెనీల సంస్కృతిని రాజకీయాలకు వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? అచ్చం టీడీపీ, జనసేన పార్టీల మాదిరిగా ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు పార్టీల వ్యవహారాలు ఒకే గూటి పక్షుల్లా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకు తార్కాణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం చేసిన ట్వీట్లను ఉదహరిస్తున్నారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ రెండు పార్టీలు మొదట చేసిన టీట్ల స్థానంలో కొత్తవి పోస్ట్‌  చేయడం కొసమెరుపు. ఆ ట్వీట్ల వరుస క్రమం చూడండి మరి...

పట్టిచ్చిన ‘టైం’బాంబ్‌! 
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ మంగళవారం వరుసగా ఒకరి తరువాత ఒకరు చేసిన ట్వీట్లను నెటిజన్లు ఇట్టే పట్టేశారు. మొదట ఉదయం 10 గంటలకు చంద్రబాబు ట్విటర్‌ ఖాతాలో శుభాకాంక్షలు కనిపించాయి. అయితే అందులోని ఓ అంశం అశ్చర్యానికి గురి చేసింది. ఆ ట్వీట్‌లో అప్పుడు సమయం మధ్యాహ్నం 2.05 గంటలుగా చూపిస్తోంది. అదేంటీ...! ఇప్పుడు ఉదయం 10 గంటలు అయితే చంద్రబాబు ట్వీట్‌లో మధ్యాహ్నం 2.05 గంటలు చూపిస్తోంది? బహుశా ఆయన మన దేశ కాలమానం కంటే నాలుగు గంటలు ముందుండే తూర్పు ఆసియా దేశాల్లోని ఏ న్యూజిలాండో ఆస్ట్రేలియానో వెళ్లారని భావించారు. కానీ చంద్రబాబు మంగళవారం వైఎస్సార్‌ జిల్లా కడపలో పర్యటిస్తున్నారు కదా... మరి ఆయన ట్విట్టర్‌ ఖాతా అలా చూపించడం ఏమిటి?


రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు, లోకేశ్, పవన్‌ మొదట చేసిన ట్వీట్లు 

నంబర్‌ 2....
ట్విటర్‌ ఫాలోయర్లు ఈ కన్ఫ్యూజన్‌లో ఉండగానే... ఐదు నిముషాల్లో నారా లోకేశ్‌ ట్విట్టర్‌ ఖాతాలో కొత్త పోస్టు కనిపించింది. ఆయన కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. అందులో సమయం మధ్యాహ్నం 2.11 గంటలుగా ఉంది. కానీ అప్పుడు సమయం ఉదయం 10.05 గంటలే అవుతోంది. ఆయనేమీ తూర్పు ఆసియా దేశాలు వెళ్లలేదు కదా? దీంతో కన్ఫ్యూజన్‌ మరింత పెరిగింది...! 


టీడీపీ, జనసేన లోగుట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చంద్రబాబు, లోకేశ్, పవన్‌  పేరుతో చేసిన కొత్త  ట్వీట్లు 

మూడో ట్వీట్‌..
ఇంతలో రెండు నిముషాల్లో మరో ట్వీటు... ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వంతు. ఆయన కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో చూపిస్తున్న సమయం మధ్యాహ్నం 2.13 గంటలు. కానీ అప్పుడు భారత్‌లో సమయం 10.07 గంటలే. ఏమిటిదంతా అనుకుంటున్నారా? అసలు లోగుట్టు ఏమిటంటే...
    
విదేశాల నుంచి సోషల్‌ మీడియా ఖాతాలు!
ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దేశం నుంచి సోషల్‌ మీడియా ఖాతాలు నిర్వహిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకావచ్చు. అందుకే విదేశాల నుంచి తమ ట్విట్టర్, సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారన్నది రాజకీయ పరిశీలకులేకాదు పోలీసు, న్యాయ అధికారులు కూడా చెబుతున్న మాట. అందుకే చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌  ట్విట్టర్‌ ఖాతాల్లో పోస్టులతోపాటు టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాల పోస్టులు ఒకే రీతిలో ఉంటాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసే విమర్శలు, దుష్ప్రచారాన్ని ఒకే గొంతుకగా వినిపిస్తాయి.

 

తూర్పు ఆసియా నుంచి ఒకే సంస్థ పోస్టింగ్‌?
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను కూడా చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ల తరపున ఓ సంస్థ తూర్పు ఆసియా దేశం నుంచి వెంట వెంటనే ముగ్గురి ట్విట్టర్‌ ఖాతాల్లో పోస్టు చేసినట్లు ఐటీ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. రాజకీయ క్షేత్రంలోనే కాదు సోషల్‌ మీడియా వేదికగా కూడా టీడీపీ, జనసేన ఏక తాళం వినిపిస్తున్నాయన్నది తాజా ట్వీట్ల బంధంతో మరోసారి రూఢీ అయింది. 

కొత్త ట్వీట్లతో దిద్దుబాటు పాట్లు
చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ రాజకీయ అనుబంధాన్ని ట్విట్టర్‌ వేదికగా సోషల్‌ మీడియా బట్టబయలు చేసింది. ఈ అంశం వైరల్‌గా మారడంతో టీడీపీ, జనసేన దిద్దుబాటు చర్యలకు దిగాయి. అంతవరకు ఉన్న ట్వీట్లను తొలగించి చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ ఖాతాల్లో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలతో తాజాగా పోస్టు చేశారు. ఈసారి చంద్రబాబు ట్వీట్‌లో సమయం 8.35 గంటలుగా ఉంది. మరో ఆరు నిముషాలకు లోకేశ్‌ పేరుతో ట్వీట్‌ కనిపించింది. అందులో సమయం 8.41 గంటలుగా ఉంది. ఇక మరో రెండు నిముషాల్లోనే పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ దర్శనమిచ్చింది. అందులో సమయం 8.43 గంటలుగా ఉంది. టీడీపీ, జనసేన ట్విట్టర్‌ పాట్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొద్ది నిముషాల తేడాతో వరుసగా ముగ్గురి పోస్టులు రావడం, వాటి స్థానంలో చేసిన ట్వీట్లు కూడా నిమిషాల వ్యవధితో ఉండటం ఆ రెండు పార్టీల లోగుట్టును బట్టబయలు చేసిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

రాజకీయ షెల్‌ కంపెనీలే!
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కాపాడేందుకే టీడీపీ అనుబంధ కేంద్రంగా జనసేన ఆవిర్భవించిందని 2014, 2019 ఎన్నికలు నిరూపించాయి. ఆ తరువాత కూడా ఆ రెండు పార్టీల వ్యవహారాలు అదే రీతిలో సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శ చేయగానే ఆ వెంటనే పవన్‌ కల్యాణ్‌ వంత పాడటం పరిపాటిగా మారింది. అందుకోసం అన్ని అంశాలపై ఒకే రీతిలో స్పందించేందుకు టీడీపీ, జనసేన కొన్ని ఉమ్మడి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైంది ఆ రెండు పార్టీల సోషల్‌ మీడియా వేదిక. వీటి తరపున సోషల్‌ మీడియా బాధ్యతలను ఒకరికే అప్పగించినట్టు సమాచారం. వేర్వేరు సంస్థలకు అప్పగిస్తే ఒకే వాదనను వినిపించడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చని జాగ్రత్త పడ్డారు.  

మరిన్ని వార్తలు