కాపు రిజర్వేషన్‌ హామీ ఏమైంది?

7 Feb, 2019 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. కాపులు ఈబీసీల్లో సగం అంటూ మరోసారి చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన  కాపు రిజర్వేషన్‌ హామీ ఏమైందని, మంజునాథ కమిషన్ పేరుతో కాలయాపన చేశారంటూ మండిపడ్డారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. 

కాపు సోదరులకు విజ్ఞప్తి
చంద్రబాబు కాపులను ఏకాకిని చేసే కుట్రలు చేస్తున్నారని, ఈ కుయుక్తులను కాపు సోదరులంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే అసెంబ్లీలో చట్టం చేశామన్నారన్నారు. కాపులందరూ బీసీలు అయిపోతారని హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు తగాదా పెడుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి పోరాడింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హోదా కోసం పోరాటాలు చేస్తే జైలులో పెడతామని చంద్రబాబు బెదిరించారని, ఇప్పుడు హోదాపై యూటర్న్ తీసుకుని ధర్మపోరాట డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు.

సంబరాలు చేసి మోసం చేశారు..
చంద్రబాబు చేసే మోసాన్ని కూడా ఆకాశాన్ని ఎత్తే మీడియాను చూస్తుంటే భయం వేస్తోంది. 2014లో తన అధికారం కోసం కాపుల్ని బీసీలలో చేరుస్తానని వాగ్దానం చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రోడ్డేక్కేవరకు కూడా కాపులను మరిచిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుకు కాపు రిజర్వేషన్లు గుర్తుకువచ్చాయి. మంజునాధ కమిషన్ను వేసి ముగిద్దామని చూశారు. జస్టిస్ మంజనాధ నివేదిక ఇవ్వకుండానే వారి సభ్యులతో రిపోర్ట్ తీసుకుని కాపులను బీసీలలో చేరుస్తన్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు. 13 జిల్లాల్లోని కాపు సోదరులు అందరి నోట్లలో స్వీట్లు తినిపించి మీరు బీసీలయ్యారంటూ సంబరాలు చేసి మోసం చేశారు.
అప్పటినుంచి ఈరోజు వరకు కాపులు బీసీ సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితి ఉందా?. ఎమ్మార్వో కార్యాలయాల్లో బీసీ ఎఫ్ సర్టిఫికేట్  అడిగితే ఎమ్మార్వోలు కాపులను ఎగతాళి చేసే పరిస్థితి.

కాపులను ఎన్నిసార్లు బీసీలను చేస్తారు?
అసలు కాపులను ఎన్నిసార్లు బీసీలను చేస్తారు. గతంలో అసెంబ్లీలో చేసింది ఏంటి?. గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నారంట ఓ పెద్దాయన. అదే రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికంగా వెనకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదుశాతం ఇస్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇది మోసపూరితం. ఈబీసీలలో కాపులకు సగం అంటూ మరోమోసానికి పాల్పడ్డారు. బీసీ వర్గాలందరితో కాపులకు తగాదా పెట్టారు. ఈరోజు ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణపేదలతో కూడా తగాదాలు పెట్టేపరిస్దితి చంద్రబాబు తెచ్చారు. కాపులను ఏకాకి చేసే కుట్ర చేస్తున్నారు. కాపులను మొన్న బీసీలను చేశామని చెప్పారు. నేడు ఈబీసీలను చేశామని అంటున్నారు. కాపులు బీసీలా? ఈబీసీలా మీరు ఏ కేటగిరిలో చేర్చారు చంద్రబాబు సమాధానం చెప్పండి. దళిత క్రైస్తవులందరిని ఎస్సీలను చేసేశామని నిన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాపులకు లాగా వారికి కూడా స్వీట్లు తినిపిస్తారేమో.

గతంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీలలో చిచ్చురేపి ఆ వేడిలో చలి కాసుకున్న వ్యక్తి చంద్రబాబు. దళిత క్ర్లైస్తవుల గురించి కేంద్రంతో కనీసం ఒక్కమాటైనా మాట్లాడారా?. తునిలో రైలు తగులబెట్టారని, రాజధానిలో తోటలు తగులపెట్టారు. పోలవరం ను అడ్డుకుంటున్నారు. విశాఖలో సమిట్లు పెడితే క్యాండిల్ ర్యాలీలు పెట్టి పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేశారని వైఎస్ జగన్‌పై చంద్రబాబు అసెంబ్లీలో నిందలు వేశారు. మీ నిందారోపణలు దగాకోరు కుట్రలు విషయంలో మీ ఆధీనంలో ఉండే పోలీసులు వారు చేసిన దర్యాప్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైగాని, జగన్‌పై గాని ఎందుకు వాటిని నిరూపించలేకపోయారు. ప్రత్యేక హోదా అంటే జైలులో వేస్తామని మీరంటే అయినప్పటికి హోదా కోసం పోరాటం చేసింది ఎవరు వైఎస్ జగన్ కాదా?’  అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు