వినేవాడు అమాయకుడైతే.. చెప్పేవాడు చంద్రబాబు : వైఎస్‌ జగన్‌

7 Jul, 2018 18:07 IST|Sakshi
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, రామచంద్రాపురం (తూర్పు గోదావరి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో ఉన్నాయనగా అయ్యయ్యో తెలుగుతల్లికి అన్యాయం జరిగిందా?. అయ్యయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అని చంద్రబాబు మాట్లాడతారని దుయ్యబట్టారు. 

‘బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేస్తాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇద్దరు విడాకులు తీసుకుంటారు. తర్వాత ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు ఎలా పెట్టాలని చంద్రబాబు చూస్తారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మళ్లీ విగ్రహానికి తానే దండ వేస్తాడు. ఏపీకి న్యాయం చేయాలంటే మరో ఐదేళ్లు చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలి అంటాడు. 

ఇలాంటి మోసాలు, దారుణాలకు పాల్పడే వ్యక్తులను ఏమనాలి?. రుణమాఫీ బేషరతుగా చేస్తామని అన్నారు. బ్యాంకుల్లో బంగారాన్ని ఇంటికి తెప్పిస్తా అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎన్నికల ముందు బెల్టు షాపుల రద్దు అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడపడితే బెల్టు షాపులు వచ్చాయి. ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు, కాంట్రాక్టర్లను, రాజధాని భూములను, గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు దోచేస్తున్నారు.’ అని రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనపై రామచంద్రాపురం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ విరుచుకుపడ్డారు.

‘2014 ఎన్నికలప్పుడు కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా చదువు చెప్పిస్తానని అన్నారు. కానీ ప్రస్తుతం ఆస్తులను అమ్ముకుంటే తప్ప చదవించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు హయాంలో రేషన్‌, పెన్షన్‌ కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులను ఎడాపెడా పెంచేశారు. ప్రత్యేక హోదాను నీరుగార్చారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రాకుండా చంద్రబాబు నాలుగేళ్లుగా అడ్డుకున్నాడు.

ఇవాళ అదే స్టీల్‌ ప్లాంటుపై మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గవర్నమెంట్‌ ఉద్యోగులకు మూడు డీఏలు ఇవ్వలేదు. పదో పీఆర్సీని అమలు చేయలేదు. ఇలాంటి వ్యక్తి ఎన్నికలకు ఆ‍ర్నెల్లు ఉన్నాయనగా ఉద్యోగులకు తానేదో చేసేసినట్లు పలువురితో సన్మానాలు చేయించుకుంటాడు. వినేవాడు అమాయకుడైతే తాను ఎన్నైనా చెప్తాడు చంద్రబాబు. పాము విషం కోరల్లో ఉంటుంది. తేలుకు విషం తోకలో ఉంటుంది. కానీ దుష్టుడికి విషం నిలువెల్లా ఉంటుంది అని సుమతీ శతకంలో బద్దెన పేర్కొన్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అచ్చూ ఇలానే ఉంది.

తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలను గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకే కట్టబెట్టారు. అది చాలదు అన్నట్లుగా బాబు ఈ జిల్లా నుంచి వైఎస్సార్‌ సీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నాడు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు తూర్పు గోదావరికి ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారు. వారి బాధలను పాదయాత్రలో నాతో పంచుకుంటున్నారు. 

వెటర్నరీ, హార్టికల్చర్‌ యూనివర్శిటీలను వైఎస్సార్‌ ఈ జిల్లాలో ఏర్పాటు చేశారు. గోదావరి ఏటిగట్లను బలోపేతం చేశారు. డ్రైయినేజిల్లో పూడికలను తీయించారు. ఇదే నియోజకవర్గంలో గన్నవరం మండలంలో 21 కిలోమీటర్ల పాటు ఏటిగట్లను అభివృద్ధి చేశారు. రామచంద్రాపురంలో దాదాపు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇక్కడి ఏరియా ఆసుపత్రిలో 16 మంది డాక్టర్లు ఉండాలి. కానీ 8 మంది కూడా లేరు. గైనకాలజిస్టు, జనరల్‌ ఫిజిషియన్‌ ఏరియా ఆసుపత్రిలో లేకపోవడం దారుణం.

సీఎం కాక ముందు రూ. 2కి 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తానన్నారు. ఇవాళ రామచంద్రాపురం మున్సిపాలిటీలో దాహార్తిని తీర్చేందుకు నీళ్లు ఇవ్వాలని వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కే గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో కుళాయిల నీళ్లను ప్రజలు వాడటం మానేశారు. చంద్రబాబు గారు ఇది చెరుకురసం కాదు. మా కుళాయిల్లో వస్తున్న నీళ్లు అని చెప్పాలని, బహిరంగ సభలో నీటిని చూపాలని ప్రజలు నన్ను కోరారు.

పేదవాళ్లకు ఇళ్లకు కట్టించేందుకు వైఎస్సార్‌ హయాంలో 32 ఏకరాలను రామచంద్రపురంలో సేకరించారు. ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంది. అక్కడ ఫ్లాట్లు కట్టిస్తామని చెబుతున్నారు. పేదవాడి డబ్బు తీసుకుని ఇళ్లు కట్టిస్తారట. ఉచితంగా ఇళ్లు కట్టించాలని వైఎస్సార్‌​ అనుకుంటే.. వారి డబ్బు తీసుకుని ఫ్లాట్లు కడతామనడం దారుణం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు కొన్ని ఫ్లాట్లు ఇస్తాడు. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి కోసం చెల్లించాల్సిన డబ్బును మాఫీ చేస్తాం.

ఈ పెద్దమనిషి సీఎం అయిన తర్వాత ద్రాక్షరామం వచ్చాడు. జన్మభూమి సభలో ద్రాక్షరామంలో రింగ్‌రోడ్డు నిర్మిస్తానని చెప్పాడు. ఆ తర్వాత దానికి అతీగతీ లేదు. ఇదే రామచంద్రాపురంలో డంపింగ్‌ యార్డు తరలించాలని చెప్పి నాలుగేళ్లుగా డిమాండ్‌ ఉన్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతటి దారుణమైన పాలన ఇవాళ చూస్తూ ఉన్నాం. మీకు ఎలాంటి నాయకుడు కావాలో నిర్ణయించుకోండి. అబద్దాలు చెప్పేవారు, మోసాలు చేసేవాళ్లు మీకు కావాలా?. 

ఎన్నికల ప్రచారం కోసం రేపొద్దున చంద్రబాబు ఇక్కడికి వస్తాడు. మైకు పట్టుకుని గత ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను 98 శాతం పూర్తి చేశానని చెబుతాడు. ఇక మీరు చిన్నచిన్న అబద్దాలకు, మోసాలను నమ్మరని ఆయనకు తెలుసు. నాకు ఓటేయండి అధికారంలోకి రాగానే కేజీ బంగారం ఇస్తానంటాడు. బోనస్‌గా ప్రతి ఇంటికి ఒక బెంజి కారు ఇస్తానంటాడు. అయినా నమ్మరని ఆయనకు తెలుసు.

అందుకే ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపుతాడు. మహిళా సాధికార మిత్రల పేరుతో వారు మీ వద్దకు వస్తారు. ప్రతి చేతిలోనూ 3 వేల డబ్బు పెడతారు. డబ్బును వద్దు అని మాత్రం అనొద్దండి. మూడు వేలు అంటే ఐదు వేలు కావాలని అడగండి. ఆ డబ్బంతా మనదే మన జేబుల్లో నుంచి దోచేసిందే ఆ సొమ్మంతా. కానీ ఓటు వేసేప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. అబద్దాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలపండి.’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు