సాక్షాత్తూ ఏపీ ఆవిర్భావ దినోత్సవం నాడే..

1 Nov, 2018 16:56 IST|Sakshi

దేశ రాజధాని సాక్షిగా మరో స్వార్థ రాజకీయం

తల్లి కాంగ్రెస్‌, పిల్ల టీడీపీ చెట్టపట్టాల్‌..

చంద్రబాబు...అవకాశవాద రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాష్ట్రాన్ని నిలువునా విభజించిన కాంగ్రెస్‌ను.. తరిమికొట్టాలని పిలుపునిచ్చిన మనిషే... ఇప్పుడు అదే పార్టీతో దోస్తీ కడుతున్నారు. ఢిల్లీ నడివీధిలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. గాయపడిన తెలుగు ప్రజల గుండెకు కారం రాస్తున్నారు.

ఒకవైపు సోనియాగాంధీపై, మరోవైపు రాహుల్‌ గాంధీపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు....ఇప్పుడు హస్తిన సాక్షిగా మరో కొత్త నాటకానికి తెరదీశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీతో చెట్టపట్టాలు వేసుకోవడానికి తెగ ముచ్చటపడుతున్నారు. ఆ మధ్య.. ఏ ముఖం పెట్టుకుని రాహుల్‌ గాంధీ మా రాష్ట్రానికి వస్తారు? ఎవరైనా కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేటు మార్చేశారు. ఇప్పుడు తన ముఖంతోనే మరోసారి ఢిల్లీకి వెళ్లి.. రాహుల్‌ గాంధీతో మంతనాలు జరిపారు.

దుష్ట రాజకీయాలు బట్టబయలు..
వాస్తవానికి నవంబర్‌ 1.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం.. కానీ కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమాని అయిదేళ్లుగా ఏపీకీ ఆ వేడుక లేకుండా పోయింది. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు దోస్తీ అవుతున్నారు. ప్రధాని మోదీ నిరంకుశ పోకడలనుంచి దేశాన్ని కాపాడేందుకు ఆయన ఈ పోరాటాన్ని చేపట్టినట్టు టీడీపీ వర్గాలు డబ్బా కొట్టుకుంటున్నా.. ఢిల్లీ సాక్షిగా జరుగుతున్న తాజా పరిణామాలు.. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పకనే చెప్తున్నాయి. చంద్రబాబు.. దుష్ట రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి.

స్వార్థ రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీకాదు. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇది. ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలు ముగిసిన తర్వాత నిందలు వేసి ఆ పార్టీలను దూరం పెట్టడం.. మరో పార్టీతో అంటకాగడం.. తాను చేసిన నిర్వాకాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రతిపక్షంపై బురదజల్లడం.. కొన్నేళ్లుగా చంద్రబాబు చేస్తున్నవే.. అందరూ చూస్తున్నవే. అయినా చంద్రబాబుకు విశ్వసనీయమైన రాజకీయాలు నెరిపిన చరిత్ర ఏనాడూ లేదు. ఆదినుంచి ఆయనవి విశ్వాసఘాతుక రాజకీయాలే అన్నది జగమెరిగిన సత్యం. నాలుగున్నరేళ్లు కేంద్రంలో అధికారంలో కొనసాగి ఇప్పుడు మళ్లీ బీజేపీకి, ఎన్డీయేకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటం అంటూ ఇతర పార్టీలను ఏకం చేసే పేరిట చేస్తున్న హంగామా వెనుక చంద్రబాబు స్వలాభం మినహా మరేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


తాజాగా ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం, దానివెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేనని, సూత్రధారులు వారేనని తేటతెల్లం అవుతుండడంతో టీడీపీపై, ముఖ్యమంత్రిపై, మంత్రులపై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతోపాటు ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. వీటినుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్లీ ఢిల్లీ యాత్ర, జాతీయస్థాయి పోరాటమంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. అందుకు అనుగుణంగా తన పచ్చమీడియా ద్వారా వార్తలు వండి వార్పిస్తున్నారు.  గతంలో తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీపైనే ఇప్పుడు దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలు.. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.


వివిధ సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీపై, సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో క్లిప్ల్స్‌

 


 


 

మరిన్ని వార్తలు