మోదీతో చంద్రబాబు ఏం మాట్లాడారంటే..!

8 Mar, 2018 21:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలిచినా ఢిల్లీకి వెళ్లలేమని, తమ పార్టీ నేతల రాజీనామాలను వెనక్కు తీసుకోలేమని స్పష్టం చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన అనంతరం తనకు అందుబాటులో ఉన్న ఏపీ మంత్రులతో చంద్రబాబు ఇక్కడ భేటీ అయ్యారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను, ప్రజల ఆవేదనను ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఇప్పటికైనా ఇవ్వొచ్చని మోదీకి చెప్పినట్లు మంత్రులతో అత్యవసర భేటీలో చంద్రబాబు తెలిపారు. 

అన్ని విషయాలు మాట్లాడుకుందాం.. ఢిల్లీకి రమ్మని ప్రధాని తనను ఆహ్వానించినట్లు ఏపీ సీఎం చెబుతున్నారు. అయితే  ఏం జరిగినా సరే తాము ఢిల్లీ వెళ్లేదిలేదని, తన పార్టీ మంత్రుల రాజీనామాలను వెనక్కు తీసుకోలేమని ప్రధాని మోదీకి ఫోన్‌ సంభాషణలో స్పష్టం చేసినట్లు మంత్రులకు చంద్రబాబు వివరించారు. మరోవైపు నేటి ఉదయం ఏపీ బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులు సమర్పించిన రాజీనామా లేఖలు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేసినా.. ప్రత్యేక హోదాపై పోరాడతామని ఒక్కమాట కూడా చెప్పకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు