సింగపూర్‌ బాబు.. వెన్నుపోటు గేమ్స్‌

31 Mar, 2019 09:38 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆయన పేరు సింగపూర్‌ బాబేశ్వర్‌రావు. అసలు పేరు వేరే ఏదో ఉందిగానీ.. ఆయనకు సింగపూర్‌ అంటే చాలా ఇష్టం. ఏదైనా అంటే చాలు.. అస్తమానం సింగపూర్‌ పేరెత్తుతూ ఉంటాడు. ‘అసలు సింగపూర్‌లో ఇళ్లు ఎలా కడతారో తెలుసా? మనవాళ్లకు కనీసం మెట్లు కట్టడం కూడా రాదు. మన ఇంజినీర్లు వాళ్ల దగ్గర కూలీలుగా పనిచేయడానికి కూడా పనికిరారు’ లాంటి కబుర్లు చెప్పి సింగపూర్‌ను పొగుడుతూ ఉంటాడు కాబట్టి ఆయన అసలు ఇంటి పేరుకు బదులుగా సింగపూర్‌ అనే ప్రిఫిక్సు చేరిపోయింది. 
దూకుడు సినిమాలోని సింగపూర్‌ రాజేశ్వర్రావు టైప్‌లోనే.. ఈయన కూడా అలవోకగా చాలా కోతలు కోసేస్తుంటాడు. ఉదాహరణకు కొన్ని చూద్దాం.
తనదంతా సింగపూర్‌ టెక్నాలజీ కాబట్టి చాలా చాలా పనులు చాలా తేలిగ్గా, అతి చురుగ్గా, పరమ చులాగ్గా చేయించగలననీ, కాబట్టి తనను వాడుకొమ్మని, వాడుకున్నంత వారికి వాడుకున్నంత అనే లాంటి ఆఫర్లు ఇస్తుంటాడు. తాను తలచుకుంటే బుడతనబిల్లి నుంచి బుడంకాయపల్లి లాంటి పల్లెటూళ్ల మధ్య కూడా బుల్లెట్‌ ట్రైయిన్లు వేయిస్తానని, ఐదునిమిషాలకొకటి నడిపిస్తానని అంటాడు. మరి రైల్వేలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి కదా నువ్వెలా వేయించగలవ్‌ అంటే తానో జవాబు ఇస్తాడు. 
ఆటలంటే తనకు చాలా ఇష్టమంటాడు. జావొలిన్‌ త్రోలో బల్లెం మరీ పొడుగ్గా ఉంటుంది, అంత పెద్దది పట్టుకుంటే ఎదుటివాడికి తెలిసిపోతుంది కాబట్టి జావొలిన్‌లు ఎంచుకోడు. రెజ్లింగూ, కత్తియుద్ధం లాంటి ఆటల్లో పాల్గొనాలంటే, ఎదురు నిలబడి ఆడాల్సి వస్తుందనీ, తనకు పరమ సిగ్గు కాబట్టి వెనక నిలుచుని,  సైలెంట్‌గా టార్గెట్‌కు కరెక్టుగా తగిలే.. వెన్నుపోటు గేమ్స్‌ లాంటివి ఆడతానని అంటాడు. ఇలా తనకు క్రీడల మీద ఉన్న పరమ అభిమానంతో ఈసారి తనను గనక  గెలిపిప్తే ఒలింపిక్స్‌ను అమరావతిలో జరిపిస్తానంటాడు. అదెలా అంటే దానికీ అదే ఆన్సర్‌ చెబుతాడు. 
పెద్ద పెద్ద పెట్టుబడులు తెచ్చేందుకు తాను దావోసూ లాంటి చోట్లకు వెళ్తుంటే మనమంతా కామోసు అనుకుంటుంటాం. తనను కలిసేందుకు బిల్‌గేట్సు గేటు దగ్గర కాచుక్కూచ్చుంటాడనీ, ఎదురు పడగానే ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెడతాడనీ అంటాడు. అలాంటి ఎందరెందరో బిల్‌గేట్సులను అమరావతి గేటు దగ్గరికి రప్పించి, అక్కడ కంప్యూటర్‌ కొట్లూ, టెక్నాలజీ షాపులూ, సైబర్‌ దుకాణాలూ పెట్టిస్తానంటాడు. ప్రజలకు తానిలా అరచేతిలో వైకుంఠం చూపడం కోసమే రాహుల్‌ దగ్గరికి వెళ్లి వాళ్ల గుర్తుకు మద్దతిచ్చానంటాడు. 
మరి.. బులెట్‌ ట్రైయిన్‌గానీ, అంతర్జాతీయ క్రీడలు గానీ, పెద్ద పెద్ద పరిశ్రమలుగానీ రావాలంటే ఆ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉండాలి. అదిప్పట్లో సాధ్యం కాదు. అయినా ఆ లెవల్‌కు తగ్గకుండా హెచ్చులకు వెళ్తుంటాడు ఈ బడాయి బాబుగారు. మరి ఈ బడాయిలు సరే.. ఆ స్థాయివి రాష్ట్రానికైనా రావాలంటే అందులో కేంద్రప్రభుత్వ జోక్యమూ కావాలి కదా.. నువ్వు పిలిస్తే వచ్చేస్తాయా అని అడిగితే.. ‘‘పేరుకు నాది రాష్టమే అయినా.. తెలుగుదేశమంటే అది కేంద్రప్రభుత్వ జోక్యమే లేని స్వతంత్రదేశం. అందుకే నేను సీబీఐనీ, ఈడీని, ఎన్‌ఐఏ.. ఇలా కేంద్రానికి సంబంధించిన ఎన్నింటినో నిషేధించా. నా స్వార్థం కోసం నేనేదైనా చేసేస్తా. కాబట్టి మొదట్నుంచీ.. అన్నీ నేనే చేశా. ఇప్పుడూ అన్నీ నేనే చేస్తా’’ అంటాడు. 
 ఇవన్నీ చూశాక.. పాక్‌ ప్రధాని వంటి మన దేశ వ్యతిరేకుల మాటలు నమ్మే ఇలాంటి వారి మాటలు వింటుంటే.. అదే దూకుడు సినిమాలో సింగపూర్‌ రాజేశ్వర్రావు పాత్ర అన్నట్టుగానే.. ప్రజలందరికీ ఒకే ఒక మాట అనాలనిపిస్తోంది. ఆ మాటకే కట్టుబడాలనిపిస్తోంది. అదేమిటంటే..  
‘‘ఎలిమినేట్‌ చేసేద్దాం సార్‌.. ఎలిమినేట్‌ చేద్దాం. ఎన్నికలొచ్చి.. బడాయి బాబుల్నీ, సింగపూర్‌ బాబుల్నీ ఎలిమినేట్‌ చేసేందుకు మంచి చాన్స్‌ ఇచ్చాయి. ఇలాంటివాళ్లు మనకవసరమా సార్‌. 
కాబట్టి ఎలిమినేట్‌ చేసేద్దాం సార్‌. ఎలిమినేట్‌ చేద్దాం’’ 

– యాసీన్‌ 

మరిన్ని వార్తలు