ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ అక్కసు

27 Oct, 2018 17:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు? రాష్ట్రానికి ఏదైనా సాధించడానికి ఢిల్లీ వెళ్లారా? గతంలో చెప్పుకున్నట్టు రాష్ట్రానికి రావలసిన నిధులను సాధించుకోవడానికి వెళ్లారా? అవేవీ కాదు. కేవలం విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ వెళ్లారంటే నమ్మకం కలగకపోవచ్చు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. అంతెందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆవిషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అమరావతి నుంచి చెబితే కొందరు రాస్తారు. కొందరు రాయరు. అందుకే ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నా... అని ఆయన విలేకరుల సమావేశంలో వివరణ కూడా ఇచ్చారు.

ఇంతకు విషయమేమంటే... శనివారంనాటి విలేకరుల సమావేశం మొత్తం రాజకీయ విమర్శలు గుప్పించడానికి పరిమితమయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఫలితాల అనంతరం నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సమయంలో ఏఏ అంశాలపైనైతే మద్దతునిచ్చారో వాటిపై చంద్రబాబు యూటర్న్ తీసుకుని విబేధించి మాట్లాడారు. విబేధిస్తే ఐటీ దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థలపై సీబీఐ దాడులు చేసినప్పుడు, ఈడీ దాడులు చేసినప్పుడు ఆ సంస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చిన చంద్రబాబు ఇప్పుడేమో తమపై ఐటీ దాడులకు తెగబడుతోందంటూ రుసరుసలాడారు. చంద్రబాబుకు బినామీగా ఉన్న సీఎం రమేష్ కు చెందిన హైదరాబాద్‌లోని ఇంటిపైన, కార్యాలయాలపైన ఇటీవలి కాలంలో ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే, రెండు రోజుల కిందట పోలవరం కాంట్రాక్టుతో పాటు పలు కీలకమైన కాంట్రాక్టులు సాధించుకున్న నవయుగ సంస్థలపైనా ఐటీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో ఇదే చెబుతూ బీజేపీని వ్యతిరేకిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఈ విషయాలను జాతికి చెప్పడానికే ఢిల్లీ వచ్చానన్నారు.

గంటకుపైగా మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, ఆయా రాష్ట్రాల్లో జరిగిన సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఈ సందర్భంగా ఉటంకించారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేత శివకుమార్ ఇంటిపైనా, పశ్చిమ బెంగాల్ లో కొందరు ఎంపీలపైనా, ఢిల్లీలో కేజ్రీవాల్ పైనా, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన దాడులను ఉదహరిస్తూ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నంగా ఆయన మాట్లాడారు. మీకు నచ్చకుంటే అటాక్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కొనసాగిన నాలుగేళ్లపాటు కిమ్మనకుండా ఉన్న చంద్రబాబు ఇప్పుడు... విదేశాల్లోని నల్లధనం ఎందుకు తేలేకపోయారు? నోట్ల రద్దు నిర్ణయం సరైంది కాదు. జీఎస్టీ సరిగా అమలు చేయడం లేదు... రైతుల పరిస్థితేంటి? రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు ఎక్కడికిపోయాయి? అంటూ ప్రశ్నించడం గమనార్హం.

మరిన్ని వార్తలు