చంద్రబాబు గుప్పిట్లో జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ

21 Mar, 2019 07:09 IST|Sakshi

ఆ పార్టీల మధ్య పొత్తులు, అభ్యర్థులను నిర్ణయిస్తోంది బాబే 

ఈ పార్టీలన్నింటికీ ఎన్నికల నిధులు టీడీపీ ఖజానా నుంచే

బీజేపీతో లోపాయికారి పొత్తు బట్టబయలు 

జగన్‌ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కుయుక్తులు 

తెరచాటు పొత్తులతో ప్రజలను బురిడీ కొట్టించే ఎత్తులు 

టీడీపీకి నాయకత్వం వహించేది..
పవన్‌ కల్యాణ్‌ను ఆడించేది..
 పార్టీ పొత్తులు నిర్ణయించేది..అకస్మాత్తుగా పవన్‌ను మయావతి 
దగ్గరకు పంపి బీఎస్పీని రాష్ట్రంలోకి తెచ్చేది..
ఢిల్లీలో రాహుల్‌తో చేతులు కలిపి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నియంత్రించేది.. 
బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టు నాటకమాడి,
లోపాయికారి ఒప్పందం చేసుకునేది..
టీడీపీతోపాటు జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు ఎన్నికల 
నిధులు సమకూర్చేది.. ఇవన్నీ చేసేది ఒక్కరే!..
ఆయనే చంద్రబాబు. అందుకే ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట..
‘చంద్రబాబూ.. ద రింగ్‌ మాస్టర్‌..’  రాష్ట్రంలో బలంగా వీస్తున్న 
జగన్‌ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నుతూ.. 
రాజకీయ కుయుక్తులకు తెరతీశారు..

సాక్షి, అమరావతి  : తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చంద్రబాబు ఏడాదిన్నర క్రితమే గుర్తించి అందుకు తగ్గట్టుగా ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం వీస్తోందన్న నివేదికలతో చంద్రబాబు కొద్దికాలంగా బెంబేలెత్తుతున్నారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎలాగైనా చీల్చాలని ఎత్తుగడ వేశారు. ఏనాడూ సొంతంగా పోటీ చేయడానికి సాహసించని చంద్రబాబు.. ఈసారి మరో రాజకీయ కుతంత్రాన్ని రచించారు. బహిరంగంగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా.. ఏకంగా ఐదు పార్టీలతో లోపాయికారీ పొత్తుకు ఎత్తు వేశారు. జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్‌లతో ఏడాది క్రితమే తెరచాటు పొత్తుకు ఒప్పందం చేసుకున్నారు. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఒక్కో పార్టీని ఒక్కోసారి తెరపైకి తెస్తూ.. రాజకీయ పన్నాగాల్ని అమలు చేస్తున్నారు. ఇక నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న బీజేపీతో ఏడాది క్రితం తెగదెంపులు చేసుకున్నట్టు నాటకమాడిన చంద్రబాబు... ఎన్నికలు వచ్చేసరికి ప్రధాని మోదీపై విమర్శలు కట్టిపెట్టి మౌనం దాల్చడం బీజేపీతో లోపాయికారీ ఒప్పందాన్ని బట్టబయలు చేస్తోంది. ఇలా తన పొత్తులు, ఎత్తులు, కుయుక్తులతో రాజకీయాలను సర్కస్‌లా మార్చేసి.. తాను రింగ్‌ మాస్టర్‌ అవతారమెత్తారు.  

చంద్రబాబు చేతిలో పవన్‌ కీలుబొమ్మ 
చంద్రబాబు తెరచాటు రాజకీయ కుట్ర నాటకంలో ప్రధాన పాత్రధారి పవన్‌ కల్యాణ్‌.  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి జనసేన పార్టీనే చంద్రబాబు ముఖ్య సాధనంగా మార్చుకున్నారు. ఆ పన్నాగంలో భాగంగానే ఏడాది క్రితం పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలో సభ నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలతో హడావుడి చేశారు. టీడీపీతో మిత్రబంధాన్ని తెంపుకుంటున్నట్లు ప్రజల్ని మోసగించే నాటకానికి తెరతీశారు. అనంతరం అడపాదడపా జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వం మీద కంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీపైనే ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడిక ఎన్నికలు సమీపిస్తుండగా.. చంద్రబాబు ..జనసేన నాటకంలో రెండో అంకానికి తెరతీశారు. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతోపాటు టీడీపీ ఓటు బ్యాంకుకు గండి పడకుండా.. జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే జనసేన.. సీపీఎం, సీపీఐ పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఆ రెండు పార్టీలకు ఎన్నిసీట్లు కేటాయించాలో.. ఎక్కడెక్కడ ఇవ్వాలో కూడా చంద్రబాబే నిర్ణయించారు. 

వైఎస్సార్‌సీపీ అత్యంత పటిష్టంగా ఉండటంతోపాటు  సామాజికవర్గ సమీకరణలు సైతంఅనుకూలంగా ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోనే వామపక్ష పార్టీలకు ఎంపీ సీట్లు కేటాయించడం పక్కా చంద్రబాబు పన్నాగమే. ఆ జిల్లాల్లో జనసేన పోటీ చేస్తే ఆ పార్టీకి  అనుకూలంగా ఉండే సామాజికవర్గం ఓట్లు కొంతవరకు ఆ అభ్యర్థులకే పడతాయి. దాంతో అసలే బలహీనంగా ఉన్న టీడీపీ మరింత నష్టపోతుంది. అందుకే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో జనసేన బరిలో లేకుండా చంద్రబాబు స్కెచ్‌వేశారు. వామపక్ష పార్టీలతో జనసేనకు పొత్తు కుదిర్చిన తరువాత కూడా టీడీపీలో విశ్వాసం పెరగలేదు. దాంతో చంద్రబాబు చివరి నిమిషంలో పవన్‌ కల్యాణ్‌ను బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు పంపి... రాత్రికి రాత్రే పొత్తు ఖరారు చేయించారు.   

 టీడీపీ కోసం ఇంత చేస్తున్నందున పవన్‌కల్యాణతోపాటు జనసేనలో ముగ్గురు ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో వారికి తాము సహకరించేలా చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపు చేశారు. పవన్‌ కల్యాణ్, నాదేండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్‌లు పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ పరోక్షంగా జనసేనకు సహకరిస్తుంది. ఇక పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు పోటీ చేసే నియోజకవర్గంలో కూడా అదే విధానాన్నిఅనుసరించాలని ఇరుపార్టీలూ నిర్ణయించాయి.  

బాబు డైరెక్షన్‌లోనే సీట్ల కేటాయింపు
చంద్రబాబు సూచనల మేరకే పవన్‌ కల్యాణ్‌.. సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో 7 అసెంబ్లీ, రెండేసి ఎంపీ స్థానాలు కేటాయించారు. వాటిలో కూడా అత్యధికం 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. సీపీఎంకు కేటాయించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదింటిలో 2014లో వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఆ పార్టీకి కేటాయించిన రెండు ఎంపీ స్థానాల్లోనూ 2014లో వైస్సార్‌సీపీనే విజయం సాధించింది. ఇక సీపీఐకు కేటాయించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిని 2014లో వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఆ పార్టీకి కేటాయించిన రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి 2014లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ అత్యంత పటిష్టంగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే.. ఆ పార్టీకి అనుకూలంగా ఉండే సామాజికవర్గం ఓట్లు ఆ పార్టీ అభ్యర్థులకే పడతాయి. దాంతో అక్కడ ఇప్పటికే బలహీనంగా ఉన్న టీడీపీ మరింత నష్టపోతుంది. అందుకే ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయకుండా.. వామపక్షాలకు కేటాయించేలా చేశారు. మరోవైపు లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనూ జనసేన పోటీ చేయకుండా కట్టడి చేయడమే కాకుండా... అక్కడ కొంత బలంగా ఉన్న సీపీఎం కాకుండా.. ఏమాత్రం పట్టులేని సీపీఐకు మంగళగిరి స్థానం కేటాయించేలా చంద్రబాబు కథ నడిపించారు. 

పొత్తుల ఎత్తుల్లో కొత్త పాత్ర... బీఎస్పీ
ఎన్ని కుయుక్తులు పన్నుతున్నప్పటికీ.. చంద్రబాబుకు గెలుపుపై నమ్మకం పెరగడం లేదు. దాంతో దళిత వర్గం ఓట్లను చీల్చడానికి బీఎస్పీని రాష్ట్ర రాజకీయ క్షేత్రంలోకి తెచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు పంపి.. ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిర్చారు. ఎందుకంటే.. రాష్ట్రంలో దళితులు ఆది నుంచీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో దళితుల ఊచకోతలతోపాటు ఆ పార్టీ దళిత వ్యతిరేక విధానాలే ఇందుకు కారణం. దాంతో తమకు పడవని గుర్తించి దళిత ఓటు బ్యాంకును చీల్చాలని చంద్రబాబు కుతంత్రం పన్నారు. అందుకే పవన్‌ కల్యాణ్‌తో కథ నడిపించి.. బీఎస్పీతో ఎన్నికల పొత్తు కుదిర్చారు. అంతేకాదు రాష్ట్రంలో ఏమాత్రం పట్టు లేని బీఎస్పీకి ఏకంగా 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు కేటాయించేలా చంద్రబాబు మంత్రాంగం నడిపారు. ఆ మూడు ఎంపీ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ సంస్థాగతంగానూ, సామాజికవర్గ సమీకరణపరంగానూ బలంగా ఉన్న తిరుపతి, చిత్తూరు, బాపట్ల నియోజకవర్గాలు కావడం గమనార్హం. ఇక బీఎస్పీకి కేటాయించనున్న 21 ఎమ్మెల్యే స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చాలన్న ఏకైక ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారన్నది సుస్పష్టం. 

హస్తిన స్థాయిలో హస్తంతో  నేస్తం 
రాష్ట్రంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీని.. చంద్రబాబు తన లోపాయికారీ పొత్తుల ఎత్తులోకి తీసుకువచ్చారు. ఏకంగా ఢిల్లీలో కాంగ్రెస్‌తో బహిరంగ దోస్తీ చేస్తూ.. రాష్ట్రంలో తెరచాటుగా స్నేహ‘హస్తం’ కలిపారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు టీడీపీ సహకరించేలా.. అందుకు ప్రతిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పూర్తిగా తమకు దాసోహమయ్యేలా రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే టీడీపీకి సరైన అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతలను పంపించి మరీ అభ్యర్థులుగా ప్రకటించారు. కర్నూలు, తిరుపతి, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో కోట్ల, పనబాక లక్ష్మి, కిశోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌ కోటాలోనే టీడీపీ ఎంపీ టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మిగిలిన కొద్దిమంది కార్యకర్తలు టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా.. ప్రతిగా మూడునాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు టీడీపీ  సహకరించేలా ఎన్నికల వ్యూహరచన చేశారు.
 
బీజేపీపై మౌనం..   
తన ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టివేసి.. ఎన్నికల్లో ప్రజలను మోసగించడానికే ఏడాది క్రితం చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు డ్రామా ఆడారు. ఏడాదిగా ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నట్లు కథ నడిపించారు. మోదీ సహకరించకపోబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాననే తప్పుడు ప్రచారం ఎత్తుగడ వేశారు. మొదటి నుంచీ కేంద్రంపై పోరాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీతో కలసిపోయారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. తీరా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే ఒక్కసారిగా చంద్రబాబు బీజేపీ విషయంలో మౌనం దాల్చారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం. దాంతో బీజేపీతో చంద్రబాబుకు ఉన్న లోపాయికారీ బంధం బట్టబయలైంది. ప్రజల్ని మోసగించేందుకే బీజేపీతో విభేదించినట్టు నాటకమాడిన చంద్రబాబు..  ఎన్నికల అనంతరం ఆ పార్టీతో కలుస్తారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  

అన్నీ సమకూరుస్తున్నారు.. 
లోపాయికారీ పొత్తులకు అంగీకరించిన ఆ పార్టీలకు అన్నీ చంద్రబాబే సమకూరుస్తున్నారు. టీడీపీతోపాటు జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు ఎన్నికల నిధులను ఎన్టీఆర్‌ భవన్‌ నుంచే సమకూరుస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు మొదటి దశ నిధులు పంపిణీ చేశారు. అదే విధంగా ఈ  పార్టీలకు అవి పోటీ చేసే నియోకజవర్గాల ప్రకారం నిధులు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని.. అటు చంద్రబాబు ఇటు పవన్‌ కల్యాణ్‌కు సంధానకర్తగా నిలుస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు ఏపీలోనే కాకుండా.. తెలంగాణాలోనూ ఎన్నికల నిధులను టీడీపీయే సమకూరుస్తోంది. బీఎస్పీకి కూడా యూపీ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల నిధులను చంద్రబాబే సర్దుబాటు చేస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు