అఖిలపక్షం కాదు.. అంతా సొంత డబ్బా

31 Jan, 2019 04:34 IST|Sakshi
అఖిలపక్ష భేటీలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

గొప్పలు చెప్పుకునేందుకు పోటీపడ్డ చంద్రబాబు 

సర్కారు వైఖరికి నిరసనగా సమావేశానికి వైఎస్సార్‌ సీపీ దూరం 

అదేబాటలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు 

విభజన హామీల సాధన జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయం 

ఫిబ్రవరి 1 నుంచి 13 వరకూ రాష్ట్రంలో ఆందోళనలు 

11న ఢిల్లీలో మంత్రులతో ప్రభుత్వ ఆధ్వర్యంలో దీక్ష   

12న రాష్ట్రపతి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం: చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం పిలుపునిచ్చిన అఖిపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తన గొప్పలు చెప్పుకునేందుకు పోటీపడ్డారు. అఖిలపక్ష భేటీ అని మర్చిపోయి ఎప్పటిలాగానే తన సొంత భజనకే ప్రాధాన్యమిచ్చారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తిగా ప్రాధాన్యం కోల్పోయిన సమావేశాన్ని తాను రోజూ చెప్పే మాటలతోనే చంద్రబాబు సుదీర్ఘంగా నిర్వహించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిర్వహించిన భేటీలో ఒక్క కొత్త అంశంపై కూడా చర్చ జరగలేదు. చంద్రబాబు తన గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి పదే పదే సొంత డబ్బా కొట్టడమే ఎజెండాగా సమావేశం సాగింది. పార్టీ, ప్రభుత్వ సమావేశాల్లో ప్రతిరోజూ చెప్పే ప్రసంగాన్నే మళ్లీ వినిపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అఖిలపక్ష సమావేశానికి రాలేదనే అక్కసుతో ఆ పార్టీపై విమర్శలకే చంద్రబాబు పరిమితమయ్యారు. 

దొంగదెబ్బ తీసేందుకే కన్నాతో కేసు వేయించారు 
చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేంద్రం లెక్కలు అడుగుతోందని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాను చేయాల్సినంత చేశానని, హోదాతో సహా చట్టంలోని అంశాల అమలుకు విశ్వ ప్రయత్నాలు చేశానని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని ఇవ్వలేదని, తనను దొంగదెబ్బ తీసేందుకే కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేస్తామని, కేబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తామన్నారు. కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని కోర్టులో పిల్‌ వేశారని, అవసరమైతే చట్టం తీసుకొచ్చి కేసులు మాఫీ చేస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అఖిలపక్షం ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలపలేమని, కానీ సభలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి 13 వరకూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతామని, అఖిలపక్షం తరఫున కమిటీలు వేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఒకటో తేదీన భారీ నిరసన, 11న ఢిల్లీలో మంత్రులతో కలిసి నిరసన దీక్ష, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిల పక్ష నేతలను తీసుకెళ్తామన్నారు. ఢిల్లీలో నిరసన దీక్షను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ ఏర్పాటు చేస్తామని, అఖిలపక్ష సమావేశానికి రాని పార్టీల్ని కూడా జేఏసీలో చేరాలని ఆహ్వానిస్తామని తెలిపారు. ఏపీతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీలో రావాలని చంద్రబాబు చెప్పారు. దేశంలో బీజేపీ, దాని వ్యతిరేక కూటములే ఉన్నాయని ఫెడరల్‌ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్‌  మాట్లాడుతూ.. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా అభివృద్ధి ఆగకుండా చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని అభినందించారు. హోదా కోసం చేసే ఉద్యమాలకు ఏపీ ఎన్జీవోల మద్ధతు ఉంటుందని, ఢిల్లీలో పోరాటానికి ఉద్యోగులు వస్తారని సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఒకటో తేదీన సచివాలయ సంఘం తరపున నిరసన ర్యాలీ చేపడతామని, 11, 12 తేదీల్లో చేపట్టే ఉద్యమానికి మద్ధతిస్తామని తెలిపారు. సమావేశంలో లోక్‌సత్తా, రిపబ్లికన్‌ పార్టీ, ఫార్వర్డ్‌ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ, నవతరం పార్టీ, సమాజ్‌ వాదీ, ప్రత్యేక హోదా సాధన సమితి, ఏఐయూడీఎఫ్‌ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు