ఇక సగం సమయం పార్టీకే

20 Oct, 2018 04:20 IST|Sakshi

పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

టీడీపీపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరగడం లేదని అసహనం

శ్రీకాకుళంలో సహాయక చర్యలకు విపక్షం అడ్డుపడుతోందని ఆరోపణ

సాక్షి, అమరావతి: ఇకపై ప్రతి రోజూ సగం సమయం పార్టీకే కేటాయిస్తానని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి వ్యక్తమవుతుంటే పార్టీపై ఆమేరకు సంతృప్తి శాతం ఎందుకు పెరగడం లేదని టీడీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ఓటర్ల నమోదు, మండలి ఎన్నికలు, బూత్‌ కన్వీనర్ల శిక్షణ, గ్రామవికాసం కార్యక్రమాల గురించి ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

విపక్షాలపై ఎదురు దాడి చేయండి...
టీడీపీ మిషన్‌ 2019 ఎన్నికలు అని చంద్రబాబు పేర్కొన్నారు. 45,920 బూత్‌ కన్వీనర్లకు శిక్షణ 67 శాతం పూర్తయిందని, మిగతాది వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామవికాసం కార్యక్రమాలు ఇప్పటిదాకా 30 శాతం మాత్రమే జరిగాయన్నారు. పట్టభద్రుల కౌన్సిల్‌ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారు. తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు బీజేపీ నాయకులెవరూ రాలేదన్నారు. తక్షణ సాయంగా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ రెచ్చగొట్టి అడ్డంకులు కల్పిస్తోందని, పవన్‌కళ్యాణ్‌ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేటీఆర్‌ వేరే రాష్ట్రం నుంచి పవన్‌ను అభినందిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడి చేయాలని టీడీపీ నేతలను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో సహాయ చర్యలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌ సీపీ కుట్రలు చేస్తున్నట్లు చెప్పాలని, కిరాయి మనుషులతో సహాయ చర్యలకు అడ్డంకులు కల్పించాలని చూశారని ప్రచారం చేయాలన్నారు. 

పాదయాత్ర చిత్తశుద్ధితో చేయట్లేదు..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని, ఆయన  ఫ్యాక్షన్‌ మనస్తత్వమే దానికి కారణమని చంద్రబాబు ఆరోపణలు చేశారు. పాదయాత్రను చిత్తశుద్ధితో చేయడం లేదని, డ్రామాగా చేస్తున్నారని చెప్పారు. ఇలాగే మరో నాలుగేళ్లు నడిచినా ఫలితం రాదన్నారు. వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, జనసేన, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఎంత టార్గెట్‌ చేస్తే టీడీపీకి అంత లాభమని, ఆ నాలుగు పార్టీలూ కలిసిపోయినట్లుగా ప్రచారం చేయాలని సూచించారు. 

తిత్లీ బాధితులకు ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజీల విరాళం రూ.కోటి
ఉద్దానంలో రూ.10 కోట్ల ప్రాథమిక వ్యయంతో కిడ్నీ జబ్బుల పరిశోధనా కేంద్రం, ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తామని ఏపీ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ తెలిపింది. అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలసి తిత్లీ తుపాను బాధితుల సాయం కోసం  రూ. కోటి విరాళంగా అందించారు. సీఎంను కలిసిన వారిలో ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు నరసరాజు, సభ్యులు లక్ష్మణరావు, శాంతిరాముడు, కృష్ణప్రసాద్, మణి అక్కినేని, రసూల్, ఆలపాటి రవి, దొరస్వామి నాయుడు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు