బీజేపీతో రీయూనియన్‌కు చంద్రబాబు యత్నం

23 Mar, 2018 13:51 IST|Sakshi

విడాకులు..మళ్లీ పెళ్లి ఆయనకు అలవాటే..

ఏపీ సీఎం తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి విసుర్లు

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు, కూటములకు విడాకులు ఇవ్వడం, మళ్లీ మళ్లీ కలిసిపోవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీల రహస్య భేటీలు, ప్యాకేజీ సాధన కోసం జరుగుతోన్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తిరిగి బీజేపీతో రీయూనియన్‌ అయ్యేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘తన నాలుగేళ్ల పాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బీజేపీకి తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో మాదిరి ఆయన చేస్తోన్న డబుల్‌, ట్రిపుల్‌ యాక్షన్లను ప్రజలు గమనిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన బాబుకు జనం బుద్ధిచెప్పేరోజు ఎంతో దూరంలోలేదు. కూటముల్లోకి వెళ్లడం, మళ్లీ విడాకులు తీసుకోవడం ఆయనకు అలవాటే’’ అని విజయసాయి అన్నారు.

బాబుపై ప్రివిలేజ్‌ నోటీసులు: నేరస్తుల అడ్డాగా మారిందంటూ ప్రధాని కార్యాలయం(పీఎంవో)ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ప్రివిలేజ్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంపీలు  ప్రజాసమస్యలపై పీఎంవోకు వెళ్లడం తప్పేమీకాదని, అయితే చంద్రబాబు మాత్రం సంప్రదాయాలకు విరుద్ధంగా పీఎంవోపై విమర్శలు చేయడం గర్హనీయమని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని అన్నారు.

మరిన్ని వార్తలు