అప్పుడలా.. ఇప్పుడిలా.. అసలెందుకిలా బాబూ!

20 May, 2019 15:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలోనూ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో తాను అధికారానికి దూరమవడం ఖాయమని తెలుసుకున్న ఆయన..ఆ వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నూటికి వెయ్యి శాతం అధికారంలోకి వస్తుందంటూ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తూ.. ఒకప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ను సమర్థించిన ఆయనే.. ప్రస్తుతం ఇదంతా తూచ్‌ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

2014.. కాంగ్రెస్‌..క్విట్‌ ఇండియా!
‘దేశ ప్రజల మూడ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రతిబింబిస్తాయి. కాంగ్రెస్‌కు ఇండియా ఇచ్చే మెసేజ్‌.. క్విట్‌ ఇండియా!’ అంటూ గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్సాహంతో.. ఒకింత ఉద్వేగంతో ఎగ్జిట్‌ పోల్స్‌పై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు తరిమి కొడతారు అంటూ చిన్న పిల్లాడిలా సంబరపడిపోయారు. 2014లో గుజరాత్‌ మాజీ సీఎం నరేంద్ర మోదీ హవాతో దేశంలో కమలం విరబూసే సమయం అది. అందుకే ‘సిసలైన’ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తన స్వలాభం కోసం బీజేపీతో జత కట్టారు. ఊహించినట్టుగానే ఎన్డీయే అధికారంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి.

రాష్ట్రంలో కూడా స్వల్ప మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థులు గట్టెక్కడంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ అధికార దాహం తీరక.. సంతలో పశువులను కొన్నట్టు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. తమ అధినాయకుడి నేతృత్వంలో టీడీపీ నేతలు తాము ఆడిందే ఆట అన్నట్లుగా యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. దీంతో 2019 ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అయిందని, టీడీపీ అధికారం కోల్పోవడం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ముక్త కంఠంతో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవ దూరంగా ఉన్నాయి..!
నాలుగున్నరేళ్ల పాటు బీజేపీతో అధికారం పంచుకుని.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే కాంగ్రెస్‌తో జతకట్టి బీజేయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు విశ్వసనీయత ఉంటుందన్న ఆయన తాజాగా.. ‘ప్రజానాడి పట్టుకోవడంలో టైమ్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ మరోసారి విఫలమయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తిగా తప్పని తేలింది. నిజానికి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, వాస్తవాలకు ఇవి దూరంగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ  ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’ అంటూ ట్వీట్‌ చేసి మరోసారి ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఫలితం తనకు అనుకూలంగా ఉంటే ఏ విషయాన్నైనా అంగీకరించే చంద్రబాబు.. వ్యతిరేక ఫలితం వస్తే మాత్రం ఈవీఎంలైనా, ఎగ్జిట్‌ పోల్స్‌ అయినా, ఆఖరికి ఈసీ అయినా సరిగ్గా పనిచేయలేదనే చెబుతారు అందులో కొత్తగా ఆశ్చర్యపడాల్సిందేముంది అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

మరిన్ని వార్తలు