సంపద సృష్టి పెద్ద మాయ 

18 Mar, 2019 07:17 IST|Sakshi

అన్నీ అసత్యాలు, అర్థ సత్యాలు, అంకెల గారడీ

అభివృద్ధి జరిగితే  ప్రజలకు కనిపించాలి కదా! 

చంద్రబాబు విజన్‌లో విజన్‌లో వ్యవసాయం లేదు  

వ్యవసాయంపై ఒక్క విదేశీ పర్యటనా లేదేం? 

గతంలో వ్యవసాయం దండగన్నారు 

చేనేతలకు బాబు చేసింది శూన్యం 

డాక్టర్‌ దొంతిరెడ్డి నరసింహారెడ్డి ఇంటర్వ్యూ 

బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్నబీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. అంతెందుకు? 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం చేసారో ఎందుకు శ్వేతపత్రాన్ని ప్రకటించలేక పోయారు?  
రూ.88వేల కోట్ల మాఫీ చేయాల్సి ఉంటే.. దాన్ని రూ.24,500 కోట్లకు కుదించారు. దాన్ని కూడా ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారిక పత్రాలలో చూస్తే ఇచ్చింది  రూ.15వేల కోట్లకు మించలేదు. 
రూ.88వేల కోట్ల మాఫీ చేయాల్సి ఉంటే.. దాన్ని రూ.24,500 కోట్లకుకుదించారు. దాన్ని కూడా ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారిక పత్రాలలో చూస్తే ఇచ్చింది రూ.15వేల కోట్లకు మించలేదు. 
నూతన రాజధాని పేరిట 33 వేల ఎకరాల సారవంతమైన భూమిని ధ్వంసం చేయడం అభివృద్ధా? ఇప్పుడు దాని చుట్టూ మరో లక్ష ఎకరాలన్నా సాగులో లేకుండా పోతాయి. 

అభివృద్ధి ఎక్కడా కనిపించదేం? 
ఈ ఐదేళ్ల కాలంలో బోలెడంత అభివృద్ధి చేశామని చంద్రబాబు చెబుతున్నారు. సంపద సృష్టించి పంచుతున్నామంటున్నారు. పంచడం సంగతి పక్కనబెడితే.. అసలు సంపద సృష్టి పెద్ద మాయ. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించమంటే బాబు బుకాయిస్తారు. అడిగిన వాళ్ల మీద రుబాబు చేస్తారు. నీకు తెలియదులే కూర్చో అంటారు, లేదంటే నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పను, ఏం చేసుకుంటావో చేస్కో అంటారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే తీరు ఇదేనా? అభివృద్ధి అంటే.. గత పాలనతో ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుని చూడడం. అది చెప్పకుండా అరుపులు, బుకాయింపులు చేస్తానంటే ఎలా? హామీల అమలు జరిగిందో లేదో చూడాలంటే.. ప్లానింగ్‌ బోర్డులో చూడాలి. బాబు ఒక్క ప్లానింగ్‌ బోర్డు మీటింగ్‌ కూడా పెట్టలేదు. ప్రజలతో సంప్రదింపులు జరపలేదు. బడ్జెట్‌ డాక్యుమెంట్‌కు ఓ పవిత్రత ఉంటుంది. అది అధికారిక పత్రం. ఆర్థిక పరిస్థితి ఆర్థిక సర్వేలో కనిపిస్తుంది. ఆర్థిక నిర్వహణ చూడాలంటే కాగ్‌ రిపోర్ట్‌ చూడాలి. ప్రతి బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను విడుదల చేస్తుంటారు. అభివృద్ధి జరిగి ఉంటే దాంట్లోనైనా కనిపించాలి కదా! 2014–15 అభివృద్ధి 2015–16లో.. 2016–17లో జరిగిన అభివృద్ధి.. ఆ మరుసటి ఏడాదిలో కనిపించాలి. అదెక్కడా కనిపించలేదు. ఈ ఏడాదైతే అసలు సర్వేనే విడుదల చేయలేదు. ఎందుకని? అభివృద్ధి లేకనే కదా! నోటి మాటతో చెప్పే డేటా అధికారికమైందిగా భావించలేం.  

రుణమాఫీపై అంకెల గారడీ
రుణమాఫీపై చేసిన అంకెల గారడీనే చూడండి. రూ.88వేల కోట్ల మాఫీ చేయాల్సి ఉంటే.. దాన్ని రూ.24,500 కోట్లకు కుదించారు. దాన్ని కూడా ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారిక పత్రాలలో చూస్తే ఇచ్చింది రూ.15వేల కోట్లకు మించలేదు. దాన్ని పక్కనబెట్టి ఇప్పుడు అన్నదాతా సుఖీభవా అనే ఓట్ల పథకాన్ని తెరపైకి తెచ్చారు. వ్యవసాయం సహా మరే రంగంలోనైనా అభివృద్ధి జరిగి ఉంటే.. విద్యుత్‌ వినియోగం పెరిగి ఉండాలి కదా? ఆర్థిక రంగం ప్రగతికి ఊతం విద్యుత్తే! కరవుతో రాష్ట్రం అల్లాడుతుంటే.. రెయిన్‌గన్లని తీసుకువచ్చారు. వాటివల్ల సమస్య పరిష్కారం కాదని తెలిసి కూడా కోట్లాది రూపాయలు కాజేశారు. ఈ ఐదేళ్లలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో! వాస్తవంగా అభివృద్ధి జరిగితే అది ప్రజలకు కనిపించాలి.  

గిట్టుబాటు ధర ఇవ్వలేదు: 
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు చంద్రబాబు. వాటిని అమలు చేయలేదు. 2014 నుంచి ఇప్పటికి ఐదు బడ్జెట్లు పెట్టారు. హామీలపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే.. అమలు చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కృష్ణా తదితర జిల్లాలలో రైతులు సుబాబుల్, జమాయిల్, సరుగుడు కర్రను సాగు చేస్తే.. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రాలేదు. ఇలా ఏ పంటను తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ జరగాలి. దానికి సంబంధించిన నిధే లేకపోయింది. 

బాబు విజన్‌లో వ్యవసాయం లేదు: 
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నారు. టూరిజమే మేలన్నారు. 2014 ఎన్నికలప్పుడు ’నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి, నేను రైతు వ్యతిరేకిని కాదు’ అని నమ్మించారు. కానీ ఒక్కనాడైనా వ్యవసాయంపై పూర్తి స్థాయిలో చర్చ పెట్టారా? దాన్ని బట్టే ఆయనకు వ్యవసాయంపై ఉన్న శ్రద్ధ ఏమిటో తెలుస్తుంది. బాబు విజన్‌లో వ్యవసాయం లేదు. పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలు అంటూ..ఈ ఐదేళ్లలో ఎన్నో విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు.. వ్యవసాయం కోసం ఒక్క పర్యటైనా చేయలేదేం? రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే చూస్తూ ఉన్నారే తప్ప.. కనీసం ప్రకటించిన పరిహారం సైతం ఇవ్వలేదు. బాబు పాలనలో ఎక్కడా పారదర్శకత లేదు. చివరకు సమాచార హక్కు కింద సమాచారం అడిగినా.. రైతుల ఆత్మహత్యల వివరాలు ఇవ్వడం లేదు. వ్యవసాయ రంగంలో ఏ సమస్యకూ పరిష్కారం చూపని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే.. ఆయన చంద్రబాబే! బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్న బీమా అన్నారు. అదెక్కడ∙ఇచ్చారో చెప్పండి. అంతెందుకు? 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం చేసారో ఎందుకు శ్వేతపత్రాన్ని ప్రకటించలేకపోయారు?  

చేనేతలకు ఎంత ఇచ్చారు  
చేనేతలకు సబ్సిడీ ఎంత ఇచ్చారు. ఎంత వ్యయం అయిందీ?, దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి.. వంటి వివరాలను నోటి మాటతో చెబితే నమ్మలేం. అధికార పత్రంలో పెడితే.. దాన్ని మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజమో, అబద్ధమో చెప్పవచ్చు. అటువంటిదేమీ జరగలేదు గనుకనే చంద్రబాబు గంపగుత్త లెక్కలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. 

ఉద్దానం సమస్య పరిష్కరించారా: 
ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధి పీడితులు డయాలసిస్‌ కేంద్రాలు కావాలని అడిగారు. త్వరితగతిన చికిత్స అందించేందుకు వీలుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దానిమీద ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. సమస్య పరిష్కరించామని నివేదికలో రాసుకున్నారు. కానీ ఆచరణలో ఒకే ఒక్క డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మినహా మరేమీ దక్కలేదు. అదికూడా  సరిగా పనిచేయడం లేదు.  

రాజధానికి అంత భూమి ఎందుకు? 
నూతన రాజధాని పేరిట 33 వేల ఎకరాల సారవంతమైన భూమిని ధ్వంసం చేయడం అభివృద్ధా? ఇప్పుడు దాని చుట్టూ మరో లక్ష ఎకరాలన్నా సాగులో లేకుండా పోతాయి. అంటే.. వేలాది మంది రైతులు, ఆ భూమిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన మరికొన్ని వేల మంది వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులు, రోజువారీ కూలీల పొట్టగొట్టినట్టే కదా. అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల అనర్థం జరిగిందని ఓ పక్క చెబుతూ.. చంద్రబాబు మళ్లీ అదే పని చేస్తున్నారు. వేయి, రెండు వేల ఎకరాల్లో కూడా బ్రహ్మాండంగా రాజధానిని కట్టుకోవచ్చు. ఆ పని చేయడానికి బదులు మూడు నాలుగు పంటలు పండే భూముల్ని నాశనం చేశారు. 

డేటా లీకేజీతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం: 
అధికారంలో ఉన్న మూడు పార్టీలు– బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ డేటా లీకేజీ చేస్తున్నాయి. ఇది ఓటర్ల హక్కులను హరించడమే. ఈ డేటాను ప్రైవేటు కంపెనీలకు అమ్ముతున్నట్టు వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం. డేటాను మార్కెటింగ్‌ కంపెనీలకు అమ్ముకోవడం వల్ల పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతుంది. ఆ డేటా ద్వారా ఎవరు అనుకూలురో, ఎవరు ప్రతికూలురో గుర్తించి బెదిరించడమో, లబ్ధి చేకూర్చడమో జరుగుతుంది. తద్వారా పౌరులకు రాజకీయ అభిప్రాయం లేకుండా చేస్తున్నారు. ఎక్కడెక్కడికో సమాచారం పోవడం వల్ల ఎవరెవరు ఎలా వాడుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.  

ఓట్ల తొలగింపు: 
తెలంగాణలో ఏమి జరిగిందో చూశాం కదా. నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చామనే పేరిట 30లక్షల ఓట్లు లక్షలాది ఓట్లను తొలగించారు. బతికున్న వాళ్లను చంపేశారు, చనిపోయిన వాళ్లను బతికించారు. ఎన్నికల కమిషన్లు, ఇతర అధికార సంస్థలు తమ బాధ్యతను విస్మరించడం వల్ల ఈ అనర్థం జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే జరుగుతోంది. ఎవరు ఓటు తొలగిస్తున్నారో తెలియని దుస్థితి. చివరకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఓటునే తీసేయమని దరఖాస్తు చేస్తుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. 

ఓటుకు నోటుకు భయపడే:  
పదేళ్లు హైదరాబాద్‌లో ఉండడానికి అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయారు. కలుగులో ఎలుకలాగా చంద్రబాబు దొరికినా.. ఆయనపై ఇంతవరకు కేసు పెట్టలేదు. కాలం గడిచే కొద్ది ఆ కేసు నీరుగారిపోయే పరిస్థితి. ఈ కేసే కాదు పార్టీ ఫిరాయింపులైతే మరీ దారుణం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి పదవులు చేపట్టడం మరీ ఘోరం. ప్రజల ఓటును అవమానిస్తున్నారు. స్పీకర్లు అధికార వ్యవస్థలో భాగమైపోవడం మరీ దురదృష్టకరం. 

పథకాల అమలు యంత్రాంగం ఉండాలి
ప్రతి పక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఏదైనా పథకాన్ని అమలు చేయాలంటే.. సరైన యంత్రాంగం ఉండాలి. 45ఏళ్లు నిండిన చేనేత మహిళలకు నాలుగేళ్లలో 75వేలు ఇస్తామని జగన్‌ హామీ ఇవ్వడం సంతోషకరం. చేనేత కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నాయి. ఈ లబ్ధి ఉపశమనంగా పనికి వస్తుంది. అదే సమయంలో చేనేతను ఒక ఉత్పత్తి రంగంగా తీర్చిదిద్దితే అది దీర్ఘకాలం ఉపయోగపడుతుంది. దానిపైన పెట్టుబడులు పెట్టే విషయంపై శ్రద్ధ వహించాలి. ప్రభుత్వంలో అవినీతిని తగ్గించగలిగితే పెట్టుబడులను పెంచవచ్చు. బడ్జెట్‌లో వంద రూపాయలు కేటాయిస్తే కిందికి వచ్చేటప్పటికీ 20, 30 రూపాయలు కూడా మిగలడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇది మరింత పెరిగిందని వింటున్నాం. కంప్యూటరీకరణ, పారదర్శకత పెరిగితే అవినీతి దానంతటదే అంతమవుతుంది!! 

- ఆకుల అమరయ్య
సాక్షి, అమరావతి

మరిన్ని వార్తలు