చేసుకుందాం..ఆరో ‘పెళ్లి’!

22 Aug, 2018 03:57 IST|Sakshi

      ఏపీలో కాంగ్రెస్‌కు కొన్ని సీట్లిద్దాం, తెలంగాణలో తీసుకుందాం

     టీడీపీ ముఖ్య నాయకులకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు 

     ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదోఒక జాతీయ పార్టీ అండ అవసరం

     అనుకూల మీడియా ద్వారా ప్రజలను నమ్మించే బాధ్యత నాది 

     కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రచారం చేద్దాం.. 

     లేకపోతే ఓటుకు కోట్లు కేసు, పోలవరం, అవినీతి వ్యవహారాలతో ఇబ్బందుల్లో పడతాం  

     పలువురు అభ్యంతరం చెప్పినా పొత్తు తప్పదని తేల్చేసిన బాబు 

     ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దల నుంచి సందేశం రాగానే చంద్రబాబు అత్యవసర భేటీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తన పార్టీ నాయకులకు స్పష్టత ఇచ్చేశారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పటికే వివిధ పార్టీలతో ఐదుసార్లు పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు ఆరో పెళ్లికి సిద్ధపడుతున్నారంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్‌తో దోస్తానా తప్పదంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు, పోలవరం ప్రాజెక్టు వ్యవహారాలు, నాలుగేళ్లలో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని, దాంతోపాటు రాష్ట్రంలో మన గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతోందని, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ గణనీయంగా పెరుగుతోందని, అందుకే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే జాతీయ పార్టీతో కలిసి వెళ్లక తప్పదని ఆయన పేర్కొన్నారు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే ఇబ్బందుల్లో పడతామని బాబు తన పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సచివాలయంలో పలువురు మంత్రులు, ఎంపీలతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపై చర్చించారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దల నుంచి సందేశం రాగానే చంద్రబాబు అప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించినట్లు సమాచారం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ చర్చను ప్రారంభించిన చంద్రబాబు చివరికి పొత్తు ఖాయమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందంటూ ఇన్నాళ్లూ మనం తిట్టిపోసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఎలా సమాధానం చెబుతామని ఉత్తరాంధ్రకు చెందిన ఒక ముఖ్య నాయకుడు ప్రశ్నించగా, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సమయానుకూలంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని బాబు చెప్పినట్లు సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుండడం వల్లే కాంగ్రెస్‌తో కలుస్తున్నట్లు చెప్పవచ్చని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ప్రత్యేక హోదా ప్రకటన మళ్లీ చేయించవచ్చని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. బీజేపీతో విడిపోయాం కాబట్టి కాంగ్రెస్‌తో కలిసి నడవాల్సిందేనని, ప్రజలకు ఏంచెప్పాలో తాను చెబుతానని తెలిపారు. 

అవన్నీ పట్టించుకోవొద్దు 
కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, పైగా ఆ పార్టీ కొద్దిరోజుల క్రితం మనపై ఛార్జిషీట్‌ విడుదల చేసిందని అలాంటప్పుడు వారితో కలిసి ఎలా వెళ్లగలమని ఒక నేత ప్రశ్నించగా, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేనని చంద్రబాబు బదులిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌పై రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని, ఆ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయని ఒకరిద్దరు అనుమానం వ్యక్తం చేసినా బీజేపీ గ్రాఫ్‌ తగ్గి, కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందని, కాంగ్రెస్‌తో పొత్తు ద్వారానే రాష్ట్రానికి లాభమంటూ అనుకూల మీడియా ద్వారా ఉధృతంగా ప్రచారం చేద్దామని, అవన్నీ తాను చూసుకుంటానని సీఎం వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సమావేశం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించామని, రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకునే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించామని తెలిపారు. పొత్తులపై చర్చ జరిగిందా? అని అడగ్గా.. నేరుగా సమాధానం చెప్పకపోయినా ఖండించకపోవడాన్ని బట్టి కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు టీడీపీ సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. 

సీట్ల సర్దుబాటుపైనా చర్చలు 
ముఖ్య నాయకుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన తీరును బట్టి చాలారోజుల నుంచే ఆయన కాంగ్రెస్‌తో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన ప్రతినిధులను ఆయన పలుమార్లు ఢిల్లీకి పంపి రాహుల్‌గాంధీ వద్ద పలు ప్రతిపాదనలు ఉంచారు. రాహుల్‌ ప్రతినిధి కొప్పుల రాజు హైదరాబాద్, అమరావతిలో చంద్రబాబుతో సీట్ల సర్దుబాటుపైనా చర్చించారు. జాతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య సహకారం ఎలా ఉండాలి, తెలంగాణ, ఏపీలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి 17 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు తీసుకోవాలని, ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి  20 ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చే ప్రతిపాదనలపై ప్రాథమికంగా ఈ చర్చలు జరిగాయి. ఇటీవల రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో పర్యటించి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తే దానికి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హాజరవడాన్ని బట్టి కాంగ్రెస్, టీడీపీ మధ్య బంధం కుదిరినట్లు తేలిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌ గెలుపు కోసం పనిచేసేందుకు ఇక్కడి నుంచి తన పార్టీ నాయకులను పంపడంతోపాటు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి బెంగుళూరు వెళ్లి రాహుల్‌ను వేదికపై కలిసేందుకు ఉవ్విళ్లూరారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌తో వెళ్లాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారమే ఇవన్నీ చేసినట్లు అర్థమవుతోంది. 

టీడీపీ సిద్ధాంతం అవకాశవాదమే
రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరిగిందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రతో ఆ పార్టీ బలపడిందని టీడీపీ కొద్దిరోజుల నుంచి అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని, అదే సమయంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు జాతీయ స్థాయిలోనూ ఏదో ఒక పార్టీ ఆసరా కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లూ తమ పార్టీ సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటోందని, విలువలున్నాయని చెబుతున్నామని, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు వల్ల అవేమీ లేవని స్పష్టమై ప్రజల్లో చులకనవుతామని పలువురు సీనియర్లు వాపోతున్నారు. టీడీపీకి సిద్ధాంతం ఏమీ లేదని, రాజకీయ అవసరాలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే ఆ పార్టీ విధానమని చంద్రబాబు తాజా నిర్ణయంతో తేలిపోయిందనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ వ్యతిరేకత అనే పునాదులపై పుట్టిన తెలుగుదేశం.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు నమ్ముతారా? అనే అనుమానాలు టీడీపీలో వెల్లువెత్తుతున్నాయి.  

మరిన్ని వార్తలు