మళ్లీ నేనే సీఎం

7 Sep, 2018 02:53 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, అందులో ఎలాంటి సందేహం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. తాను ఏం చేసినా తెలంగాణ శ్రేయస్సు కోసమే చేస్తానని, చెడు కోరి ఏదీ చేయనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరి పీడ విరగడ కావాల్నో తేలుస్తారని, కాంగ్రెస్సే రాష్ట్రానికి పట్టిన పెద్ద పీడ అని దుయ్యబట్టారు. అసెంబ్లీ రద్దు, గవర్నర్‌తో భేటీ అనంతరం గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘ఎన్నికల నిర్వహణలో కూడా ఊహాగానాలు వద్దు. నాకు ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు అక్టోబర్‌ మొదటివారంలో నోటిఫికేషన్‌ వస్తుంది. నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.

డిసెంబర్‌ మొదటివారంలో ఫలితాలు వస్తాయి. ఇది నాకున్న పరిజ్ఞానం. కచ్చితంగా నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు వస్తాయి. అన్ని చోట్లా ఒకే దశలో జరుగుతాయి.  మీకు కూడా నేను ఏమీ తెలియనీయలేదు. (జర్నలిస్టులనుద్దేశించి). మీరేమీ అనుకోవద్దు. నేనే స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడినా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఊహాగానాలు బంద్‌ చేయండి. 14 స్థానాల్లో అభ్యర్థులను వారం పది రోజు ల్లో ప్రకటించాల్సి ఉంది.  మేనిఫెస్టోలో పెట్టినవి 99.9 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోలో చెప్పని 76 కార్యక్రమాలు చేశాం. కల్యాణలక్ష్మి పెట్టమని మమ్మల్నెవరూ అడగలేదు. ఎవరూ ధర్నాలు చేయలేదు.

పిటిషన్లు ఇవ్వలేదు. బీడీ కార్మికులకు పింఛన్‌ ఇవ్వమని ఎవరూ అడగలేదు. పరిస్థితులను బట్టి అన్నీ చేసినం. కల్యాణలక్ష్మి విషయంలో ఆర్థిక పరిస్థితిని బట్టి తొలుత రూ.51 వేలు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీలకే అన్నాం. తర్వాత  బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకూ ఇచ్చాం. మేం ఏది చేసినా రైతు కేంద్రీకృతంగా చేశాం. రైతుబంధు, రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు ఆత్మగౌరవం కోసం హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాళ్లు ఇచ్చాం. నిధులు మంజూరు చేశాం. ఇప్పుడు తెలంగాణలో పేకాట క్లబ్‌లు లేవు. గుడుంబా అడ్డాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపుల్లేవు. లాఠీచార్జీల్లేవు. 4 సంవత్సరాల 5 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మతఘర్షణలు లేవు. గతంలో ఊ అంటే కర్ఫ్యూ విధించేవారు. వలసలు ఆగిపోయాయి. అక్కడి ప్రజలంతా హైదరాబాద్‌లో ఉన్న రేషన్‌ కార్డులను వాపస్‌ చేస్తున్నరు. ఇవన్నీ విస్మరించి అడ్డగోలు కథలు చేస్తున్నరు.  

వాళ్ల చరిత్ర అందరికీ తెలుసు
ఏ పార్టీ మా మీద ఆరోపణలు చేస్తుందో వాళ్ల చరిత్ర అందరికీ తెలుసు. కేసీఆర్‌ పీడ విరగడ అవుతుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. విరగడయ్యేది కేసీఆర్‌ పీడనా.. కాంగ్రెస్‌ పీడనా రేపు చెప్తం. నేను ఎప్పుడో చెప్పిన. తెలంగాణ కోసం పని చేస్తామంటే హైదరాబాద్‌లో ఇల్లు కిరాయికి ఇవ్వద్దని భయపెట్టిండ్రు. తెలంగాణకు కాంగ్రెస్సే పెద్ద శత్రువు. పెద్ద పీడ.. పెద్ద విలన్‌. నాడు స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణను లేకుండా చేసింది జవహర్‌లాల్‌నెహ్రూ.

నాడు 11 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రం ఇవ్వమన్నా ఇవ్వకుండా ప్రజాతీర్పును కాలరాసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ మనకు భిక్ష పెట్టలే. మేమే కాంగ్రెస్‌కు 2004లో భిక్ష పెట్టినం. పదేండ్ల యూపీఏ పాలన మా భిక్షే. చివరకు సచ్చిపోతం.. దేశంలో ఆగమైపోతమనే స్థితిలో తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తయని ఆగమాగం మీద, ఆగమేఘాల మీద, వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ఇచ్చిండ్రు. నేను మళ్లీ చెపుతున్న. నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు పీడ కాంగ్రెస్సే.  

మా దగ్గర్లోనే ఎవరూ లేరు: ప్రతిపక్షాలు మా దగ్గర్లో లేవు. 82 స్థానాల్లో 60శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని సర్వేలు చెపుతున్నాయి. 17–18 సార్లు సర్వే చేపించినం. 100 స్థానాల్లో 50 శాతంపైన ఉన్నం. మేం 100 గెలుస్తం. మిగిలిన వాటిలో 7 ఎవరికి పోతయో అందరికీ తెలుసు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా 50 శాతం కంటే ఎక్కువ రావు వాళ్లకు. మాకేం కాదు కదా. మేం 100సీట్లు గెలిచి తీరుతాం.  

ఓవైసీ స్వచ్ఛందంగా మద్దతిచ్చారు
ఎంఐఎం మాకు స్నేహపూర్వక పార్టీ. మేం కలిసి పనిచేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అస్థిరపాలు చేయాలని చూస్తుంటే ఆ సమాచారం తెలిసిన అసదుద్దీన్‌ ఓవైసీ ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నారు.. మేం స్వచ్ఛందంగా మీకు మద్దతిస్తామని చెప్పారు. అప్పటినుంచి మేం కలిసే పనిచేస్తున్నాం. అందులో తప్పేముంది.

మేనిఫెస్టో కమిటీ
భవిష్యత్తులో ప్రజలకు ఏం చేస్తామనేది రానున్న ఎన్నికల్లో చెప్పడం కోసం 15 మందితో కేకే అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేస్తున్నాం. నేను అసెంబ్లీ రద్దు లాంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. అది పూర్తిగా కేబినెట్‌కున్న హక్కు. వరాలు ప్రకటించకూడదు. సీఎం హోదాలో ప్రకటిస్తే వాటికి జీవోలిచ్చి అమలు చేయాలె. ఇప్పటివరకు ఇచ్చిన హామీలకు కేబినెట్‌ నిర్ణయాలు అయిపోయాయి. జీవోలు కూడా వచ్చాయి. కొద్దిరోజుల్లో మా మేనిఫెస్టో కూడా వస్తుంది. రాబోయే ఐదేళ్లపై మాకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర ఆదాయం, రాబడుల మీద అవగాహన ఉంది. మాది ఒంటరి పోరే. మజ్లిస్‌ ఫ్రెండ్లీ పార్టీనే. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలన్నీ చెప్తం.  

ఏదైనా ఒకటే..
ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలైనా, బ్యాలెట్‌లైనా ఒకటే. యూపీఏ–2 రాగానే మోదీ వాళ్లు ఆరోపణలు చేసిండ్రు.. మోదీ రాగానే కాంగ్రెస్‌ వాళ్లు చేస్తున్నరు. ఈవీఎంలలో లంగతనం చేసే పని ఏదైనా ఉంటే పవర్‌లో ఉన్నోడు పోనే పోడు కదా.. మరి మోదీ ఎట్ల గెలిచిండు. వీవీప్యాట్‌లు వచ్చిన తర్వాత ఈవీఎంలపై సందేహం అవసరం లేదు. అయినా బ్యాలెట్‌ పెట్టినా నష్టం లేదు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అనేది నిర్ణయం కాలేదు కాబట్టి నేను నా దారిలో పోతున్నా. నిర్ణయం అయి ఉంటే అదే చేసే వాడినేమో.  మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సీఎం నేనే అయితా... సందేహం ఏమైనా ఉందా? ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో కూడా నేను ఒక మాట చెపుతున్నా. మాది చక్రాలు తిప్పే ఫ్రంట్‌ కాదు. ప్రజల కోసం పెట్టే ఫ్రంట్‌. నేను ప్రతిపాదించిన థర్డ్‌ ఫ్రంటేనే నిలబడుతుంది. మీరే చూస్తరు.  

మేమెట్ట కలుస్తం
బీజేపీతో మేమెట్ట కలుస్తం.. మా గోత్రాలే కలవవు. సిద్ధాంత పరంగా టీఆర్‌ఎస్‌ 100 శాతం సెక్యులర్‌. అట్టనే ఉంటది. లక్ష్మణ్‌.. గరీబుగాడు అట్లనే మాట్లాడతడు. వాళ్ల కథేంటో మీకు తెలియదా? నాకు కూడా పీఎం కావాలని ఉంది. అయితనా.. కలలు మస్తుంటయ్‌.. వాళ్లు ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే గొప్పే.  పాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల చేతిలో ఉండాల్సిన ఎన్నో రకాల అంశాలు, అధికారులు కేంద్రం గుప్పిట్లో ఉన్నాయి.

నవ్వుకుంటరనే సోయి లేదు
ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హామీలు చూస్తుంటే కేసీఆర్‌ 100 యూనిట్లంటే వాళ్లు 200 యూనిట్లంటున్నరు. పింఛన్‌ నేను వెయ్యి అంటే వాళ్లు రెండు వేలు అంటున్నరు. ఎంత సిల్లీగా, బాధ్యతారాహిత్యంగా హామీలు ఇస్తున్నరంటే ప్రజలు నవ్వుతరనే సోయ లేకుండా ఇస్తున్నరు. రూ.వెయ్యి పింఛన్‌ ఇవ్వాలని, రైతులకు పెట్టుబడి ఇచ్చి బీమా కల్పించాలని మీ జీవితంలో అనుకోలే. కేసీఆర్‌ చెపితేగానీ సోయ రాలే.

ఇప్పుడైనా బుద్ధి వచ్చి రూ.2 వేలు ఇస్తమని కాంగ్రెస్‌ దెయ్యాల నోటి నుంచి వచ్చింది. వాళ్లు అలా ప్రకటించే స్థితికి తెచ్చింది కేసీఆరే. అది టీఆర్‌ఎస్‌ విజయమే. నేను రూ.2200 పింఛన్‌ ఇస్తనంటే ఓట్లేస్తరా? చిన్నప్పుడు చాక్లెట్ల పంచాయతీలాగా చెప్తున్నరు. ఇది ఆరోగ్యకర పోటీనా. మేం సంపద పెరుగుతున్న కొద్దీ కార్యక్రమాలు పెంచుకుంటూ పోతున్నం. మా లక్ష్యం ఎన్నికల తాయిలాలు కాదు. సంపద పెంచడం... పేద ప్రజలకు పంచడమే.

పాలమూరులోనే 9 లక్షల ఎకరాలకు నీరు
నెట్టెంపాడు మేమే పూర్తి చేసినం. కల్వకుర్తి, బీమా మేమే చేసినం. ఒక్క పాలమూరులోనే 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం. కరెంటు కోతలు నివారించినం. అప్రకటిత కోతల్లేవు. నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణే. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన ఫలితం సిరిసిల్ల గోడల మీద రైతుల ఆత్మహత్యలు వద్దనే రాతలు మాత్రమే. 2014కు ముందు పరిశ్రమలు మూసివేశారు. భయంకరంగా కలప స్మగ్లింగ్‌ జరిగేది. పూటకో ఎన్‌కౌంటర్‌.. మతకల్లోలాలు, మారణహోమం జరిగేది. ఈ దరిద్రానికి నెలవు, రిజర్వ్‌బ్యాంక్‌ కాంగ్రెస్‌ పార్టీనే. వాళ్ల పీడ పోవాలె. చెరపట్టిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్‌. రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరి పీడ పోగొట్టాల్నో తెలంగాణ ప్రజలకు తెలుసు.  

ఉంటే ఉంటడు.. పోతే పోతడు
డీఎస్‌ విషయంలో పార్టీ పరంగా చాలా గౌరవం ఇచ్చినం. వస్తూనే సలహాదారు పదవి ఇచ్చినం. ఆ తర్వాత రాజ్యసభ ఖాళీ అయితే పెద్దమనిషి అడిగిండు కదా అని గౌరవించినం. కొడుకు వేరే పార్టీలోకి పోయి డిస్ట్రబ్‌ చేస్తుండని ఫిర్యాదు చేసిండ్రు. అయినా మేమేమీ నిర్ణయం తీసుకోలేదు. ఉంటే ఉంటడు.. పోతే పోతడు.. మేమైనా ఇంకా ఏదీ నిర్ణయించలేదు.  


త్యాగాలు చేసింది మేమే
ప్రజలకు న్యాయం తెలుసు. టీఆర్‌ఎస్‌ ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు కూడా నాలుగైదు నెలల అధికారాన్ని తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశాం. అభివృద్ధి పథం ఆగిపోవద్దన్నదే మా ఉద్దేశం. చిల్లర మాటలు మాట్లాడొద్దు. నోరు ఫినాయిల్‌తో కడుక్కునే ఆరోపణలు బంద్‌ కావాలే. నేను ఇప్పుడు అంటున్నా.. కమాన్‌.. బిగ్‌ బ్యాటిల్‌కి వెల్‌కమ్‌. ఐయామ్‌ రెడీ.. తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి పోదాం. అక్కడ తేల్చుకుందాం. రేపటి నుంచే మా ఎన్నికల కార్యాచరణ ప్రారంభమవుతుంది. ముందుగా అనుకున్నట్టు 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తం. నేనే పోయి ప్రజలకు చెపుతా.  

డిపాజిట్లు రావు
ఇంకా టీడీపీ ఉందా.. పొత్తు పెట్టుకోవడానికి. మా సర్వేల్లో ఎక్కడా 0.1, 0.2 శాతం మించి రాలేదు. వాళ్లిద్దరూ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే చంద్రబాబు పొద్దున లేస్తే తెలంగాణ మీద అభాండాలు వేస్తడు. కృష్ణానది నీళ్లపై ఉత్తరాలు రాస్తడు. గోదావరి నది మీద కట్టే ప్రాజెక్టులపై కేసులేస్తడు. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు గులాం కావాల్నా.. ఆంధ్ర పార్టీలను తెచ్చి పెట్టుకుంటరా? ఇదే గులాంగిరీ అంటే... అలా కావొద్దు. లేచినోడో.. లేవనోడో ఇక్కడి వ్యక్తే శాసనకర్త కావాలె. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్టీఆరే గెలవలేదని, ఈయన గెలుస్తడా.. అంటున్నరు. కేసీఆర్‌ సాధిస్తడు. చెన్నారెడ్డి కంటే మగోడని నిరూపించుకోలేదా?  

వాటీజ్‌ దిస్‌ నాన్సెన్స్‌
మాపై ప్రతిపక్షాలు చేసిన ఒక్క ఆరోపణ అయినా నిరూపిస్తారా..?  వాటీజ్‌ దిస్‌ నాన్సెన్స్‌? దిసీజ్‌ అన్‌లిమిటెడ్‌ ఇడీయసీ. ప్రగతి నివేదన అట్టర్‌ప్లాఫ్‌ అన్నరు. సభ కాదు.. మీ మైండ్‌ అట్టర్‌ప్లాఫ్‌. యూ ఆర్‌ బ్యాంక్రప్ట్‌.. అందుకే ప్రజల దగ్గరకు వెళ్తున్నం. మేమెవరికీ భయపడడం లేదు. కాంగ్రెస్‌ భయపడుతుందేమో? రాహుల్‌ గాంధీ ఓ ఫ్యాక్టరే కాదు. ఈ దేశంలోనే ఆయన పెద్ద బఫూన్‌..

మన దగ్గరే ఎక్కువ జీతాలు
దేశంలో బాగా జీతాలు అందుకుంటున్న ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. గత ప్రభుత్వాలు చిన్న తరహా ఉద్యోగులతో బానిస చాకిరి చేయించుకున్నాయి. ఆశ వర్కర్లు, హోంగార్డులు, అంగన్‌వాడీలు అనేక మంది చిన్న తరహా ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచాం. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం రిస్క్‌ అలవెన్స్‌ను అదనంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే. చిన్నతరహా ఉద్యోగుల వేతనాలు ఇంకా పెంచాలని ఉంది.

మరిన్ని వార్తలు