మార్పు తథ్యం!

28 Mar, 2019 07:08 IST|Sakshi
కంగాటి శ్రీదేవి, కేఈ శ్యామ్‌కుమార్‌

సాక్షి, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే..రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు కూడా ఇక్కడే జరిగాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 7 సార్లు టీడీపీ, ఒక సారి సీపీఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలిచారు. రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కేఈ సోదరులకు రెండు పర్యాయాలు మద్దతు పలికినా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జనం ముందుకు ఓట్లడగటానికి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలను విస్మరించడంతో రైతులు, ప్రయాణికులు,  విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని కూల్చిన పత్తికొండ ఎమ్మెల్యే
1952లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అప్పటి పత్తికొండ ఎమ్మెల్యే ముడుమాల శంకరరెడ్డి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పడిపోయింది. అంతకుముందు రెండుసార్లు నియోజకవర్గాన్ని పునర్విభజించగా  2007లో మూడోసారి విభజించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి ఎస్‌వీ సుబ్బారెడ్డి మూడుసార్లు హ్యాట్రిక్‌ విజయం సాధించారు.

అమలు కాని హామీలు
పందికోన, కొత్తపల్లి, రిజర్వాయరు నుంచి 32,200 ఎకరాలకు, కృష్ణగిరిలో రిజర్వాయరు నుంచి 5,100 ఎకరాలకు సాగునీరందించి 68 చెరువులకు జలకళ తెస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు.అంతేకాక ఆర్‌టీసీ మినీ డిపో నుంచి పూర్తిగా స్థాయిలో ఏర్పాటు, పాలిటెక్నిక్‌ కళాశాల, బీసీ బాలికలకు వసతి గృహం ఏర్పాటు, 80 గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోలేదు. 

కేఈ కుటుంబంపై ఆగ్రహం
రెండుసార్లు కేఈ కుటుంబానికి మద్దతు పలికినా హామీల గురించి మాటెత్తకుండా మూడోసారి కేఈ శ్యాం కుమార్‌ (కేఈ కృష్ణమూర్తి కుమారుడు) బాబుకు ఓట్లు వేయాలని అడుగుతుంటే ఓటర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పట్టపగలే దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  ఏడాది పాటు శ్యామ్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఆర్‌అండ్‌బీ రోడ్లు, నీరుచెట్టు ,చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు నిర్మాణాల్లో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. పక్కాగృహం మంజూరు కావాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందే. ఇలా లక్షల రూపాయలు వసూలు చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకపోవడంతో కేఈ సోదరులపై ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు ప్రకటించిన 650 çహామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడం వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చే అంశం. 

జోరుగా ఫ్యాను గాలి..
నియోజకవర్గంలో  టీడీపీ నాయకుల అవినీతి, ఆక్రమాలు, ప్రత్యర్థుల చేతిలో భర్తను కోల్పోయిన శ్రీదేవికి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన కేఈ సోదరులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.  ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో  కంగాటి శ్రీదేవికి పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఈఎన్నికల్లో ఫ్యాన్‌ గాలికి సైకిళ్లు లేచిపోవడం ఖాయమని భావిస్తున్నారు.
– పూజారి గోపాల్, పత్తికొండ


ఓటర్ల వివరాలు
మొత్తం        1,89,409
పురుషులు    95,751
మహిళలు     93,640
ఇతరులు      18 

మరిన్ని వార్తలు