మళ్లీ రంగు మారె!

7 Nov, 2018 01:03 IST|Sakshi

రంగులు మార్చడంలో చంద్రబాబు ట్రేడ్‌మార్క్‌

ఎన్నికల సమయంలో ఏ పార్టీ కాడ ఆ పాట

అధికారం కోసం ఎవరితోనైనా జట్టు

(సవ్యసాచి)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ బంధాలెంత బలంగా ఉంటాయో, బలహీనంగా ఉంటాయో తెలంగాణ ఎన్నికలతో మరింత తేటతెల్లమౌతోంది. కమ్యూనిస్టులు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ తదితర పార్టీలతో లోగడ పొత్తో, కూటమో కట్టిన ఆయన.. ఇలా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్‌తో బంధం అల్లుతున్నారు. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు వచ్చేసరికి ఆయన ఎటు నుంచి ఎటు మారతారో అంచనాలకు అందని పరిస్థితి. ఈ శిబిరాలు మార్చడం సంగతెలా ఉన్నా ఒక మూల సూత్రం మాత్రం అన్ని వేళలా కచ్చితంగా ఉంటుంది. అదేంటంటే, అధికారమే ఆయనకు పరమావధి!.

ఎటుతిరిగి, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడమో, లేని అధికారాన్ని కైవసం చేసుకోవడమో లక్ష్యంగానే ఆయన ఎత్తులు–ఎత్తుగడలు సాగుతాయి. అందుకు, ఏది పనికి వస్తుందనుకుంటే నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా అదే చేస్తారాయన!. ‘నలుగురేమనుకుంటారో! నవ్విపోతారేమో!!’ అన్న మీమాంసే ఉండదు. 
‘‘ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ, దాన్నే నమ్ముకొని తిమ్మిని బమ్మిని–బమ్మిని తిమ్మిని చేసి జనాన్ని నమ్మించి బోల్తాకొట్టే ‘అనుకూల మీడియా’ సహకారముంటే చాలు! ఇక ఏమైనా చేయొచ్చు!’’ అన్నదే ఆయన నమ్మే రాజకీయ విధానం. 
తన మీద తనకు నమ్మకం లేకపోయినా, ఈ సమీకరణం మీద ఆయనకు ఎక్కడ లేని విశ్వాసం! 
ఇక నైతిక విలువలు! సిద్ధాంతమంటారా? అవి ఆయన డిక్షనరీలోనే లేవన్నది అందరికీ తెలుసు. 
తాజా రాజకీయ సమీకరణమే అందుకు సరిపోయే ఉదాహరణ! 
‘నలభయ్యేళ్ల ఇండస్ట్రీ’, ‘దేశంలో నేనే సీనియర్‌ నాయకుడ్ని’ అని కాలర్‌ ఎగరేసే ఆయన ఈ మధ్య ఓ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘నిజానికి నేనసలు టీఆరెస్‌తోనే పొత్తు పెట్టుకుందామనుకున్నాను. అందుకు ప్రయత్నించాను, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కానీయకుండా అడ్డుతగిలార’ని తమ పార్టీ నాయకుల సమావేశంలో వెల్లడించారు. 

బయట కూడా, మోదీని విమర్శించే ఓ సందర్భంలో, ఆయన మీద అభియోగం లాగా ఇదే మాట మరో రూపంలో చెప్పారు చంద్రబాబు. అధికార పక్షమైన టీఆరెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలనుకున్నారాయన. కానీ, ఇతరేతర కారణాల వల్ల వీలుపడనందున, వారి ప్రత్యర్థులైన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటూ... అవే ఎన్నికల్లో, అదే టీఆరెస్‌పై పోటీ చేస్తున్నారు! 
అంటే, ఏమిటి అర్థం? ‘ఎవరితోనైనా చేతులు కలిపి ఎవరిపైనైనా పోరాడుతాం, మాకు కావాల్సిందల్లా ‘అధికారం’ అనేగా! అదే చేస్తున్నారిప్పుడు. 
తన తప్పుడు నిర్వాకాల వల్ల సొంతంగా ఏ ఎన్నికా గెలవలేనని ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. 
1995లో తాను సీఎం అయిందీ, 1994లో తన మామ ఎన్టీరామారావు (తెలుగుదేశం)కు తెలుగు ప్రజలు కట్టిన పట్టం, దాన్ని వెన్నుపోటుతో తాను లాక్కున్న ఫలం!
ఆ అధికారాన్ని 1999 ఎన్నికల్లో నిలబెట్టుకున్నది, ‘ఒక ఓటుతో ప్రభుత్వం పోగొట్టుకున్నార’ని ప్రజల సానుభూతి పొందిన వాజ్‌పేయి చలువతోనే! పరిస్థితి గమనించి, బీజేపీ చంకలో చేరిన బాబు, వాజ్‌పేయి నేతృత్వపు బీజేపీతోనే (1999) అభివృద్ధి సాధ్యమన్నారు. 

పదేళ్ల టీడీపీ పాలనకు ( 2004లో) ప్రజలు ఛీకొట్టారు. అప్పుడు ‘మిత్రు’లపైన నెపం నెట్టడానికి, ‘బీజేపీ మసీదులు కూల్చే పార్టీ–వారితో కలవడం మా తప్పు’ అని (2009) లెంపలేసుకున్నారు.
కాంగ్రెసేతర పార్టీలతో ‘మహాకూటమి’ కట్టి పోరినా... ప్రజలకు ఆయనపై నమ్మకం ఏర్పడలేదు. ఫలితంగా టీడీపీ మళ్లీ విపక్షానికే పరిమితమైంది. 
‘కాంగ్రెస్, అది నేతృత్వం వహించే యూపీయే కూటమి దేశానికి అరిష్టం, మోదీయే వెలుగురేఖ, అభివృద్ధి మంత్ర (2014)’ అని నాటకీయంగా మాట మార్చి బాబు మళ్లీ బీజేపీ పంచన చేరారు.
ఇప్పుడు, మరోమారు గొంతు మార్చి.. మోదీ ద్రోహి, బీజేపీ అన్నింటా విఫలమైంది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఒక రాజకీయ అనివార్యత’ అని కొత్త ‘రా(హుల్‌)గా(ంధీ’)న్నందుకున్నారు. 

నిన్నటివరకు కలిసున్న పార్టీలను నేడు తిట్టడం, నేటి నుంచి కొత్తగా సఖ్యత కూరిన పార్టీలను పొగడటం.. రేపేమయినా అయితే వారికి జెల్ల కొట్టి కొత్త వారి చంకన చేరడం.. ఇదీ వరుస!’ 
ఏ ఎన్నికయినా, ఎవరో ఒకరి పంచన చేరి లబ్ధిపొందడానికి యత్నించడం, ఏ రోటి కాడ ఆ పాట పాడి, ప్రజల్ని బోల్తాకొట్టించి ఓట్లతో తన బొచ్చె నింపుకో చూడటం, ఇది తప్పని ఎవరైనా ఎత్తి చూపితే వారి నోరు కొట్టి మాట్లాడటం, తానే పెద్ద నోరు చేసుకొని అరిచి గీపెట్టడం’ ఇదే మన బాబుకు తెలిసిన మహా విద్య!.
ఇదంతా తెలుసుకొని నడుచుకోవాల్సింది ప్రజలే.! 

ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా నమోదయ్యే ఓట్ల సంఖ్య 3,840
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషీన్‌ (ఈవీఎం) రాకతో ఎన్నికల నిర్వహణ సులభతరమైంది. పనితీరు విషయానికొస్తే.. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నమోదు చేయగలదు. మన దేశంలో జరిగే ఎన్నికల్లో 1,400 మంది ఓటర్లకు ఒక ఈవీఎం చొప్పున కేటాయిస్తున్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో వీటిని పాక్షికంగా వినియోగించగా, 2004 ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు