హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

27 Dec, 2017 12:04 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న మంత్రి వ్యాఖ్యలను విపక్షాలు  తప్పుపట్టాయి. రాజ్యాంగంపై విశ్వాసం లేని మంత్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు పోడియంను చుట్టుముట్టి నిరసన తెలపడంతో రాజ్యసభ చైర్మన్‌ సభను వాయిదా వేశారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లౌకిక అనే పదంపై తన వ్యతిరేకతను బాహాటంగా చాటుకున్నారు.

లౌకికవాదులమని చెప్పుకొనే హక్కు భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ ఆ రాజ్యాంగాన్ని ఎన్నోమార్లు సవరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్‌) పదాన్ని తొలగించాలని అనంతకుమార్‌ హెగ్డే వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.1 కోటి నగదు బహుమానం అందిస్తామంటూ కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్‌ పట్టేదార్‌ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

మరిన్ని వార్తలు