మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి

27 Jan, 2020 12:17 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయంగా స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. 2004లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. శాసన మండలి పునరుద్ధరణ సమయంలో.. మండలి పెట్టడాన్ని చంద్రబాబు దుర్మార్గం అన్నారని గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా 2004లో చంద్రబాబు శాసన సభలో మాట్లాడిన మాటల(‘‘అధ్యక్షా, ఏదైతే ఈరోజు శాసనమండలి తేవడం పట్ల దీనిని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ద్వారా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మంచిపనులు చేస్తే తప్పకుండా సహకరించేవారము. అదే విధంగా ప్రజల పైన భారం పడే చర్యలు ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అనేకసార్లు చెప్పాము. మళ్లీ ఒకసారి రీయిటరేట్‌ చేస్తున్నాము. విధాన మండలికి చాలామంది చాలా గట్టిగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ నిర్ణయం వలన వారి మనుషులకు మళ్లీ పదవులు వస్తాయి తప్ప రాష్ట్రప్రజలకు లాభం లేదు. మీరే చూడబోతున్నారు. ఈ రోజు శాసనమండలి ఒకసారి చూస్తే, కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారు తప్ప దీనివలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అందుకే మనం ఒకసారి ఆలోచించుకుఉంటే ఏ విధంగా ఇవన్నీ జరిగాయో, దేశంలో గానీ, ప్రపంచంలోగానీ ఒకసారి ఎనలైజ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’)ను చెవిరెడ్డి వినిపించారు. (ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకు కేబినెట్‌ నిర్ణయం)

అదే విధంగా... శాసన మండలి వల్ల రూ. 20 కోట్లు ఆర్థిక భారం పడుతుందని.. రాజకీయ ప్రయోజనాల కోసమే మండలిని... రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారంటూ బాబు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు కోరుకున్న మాటను తాము ఈరోజు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘మీరు కోరుకున్నది నిజమవుతుంటే స్వాగతించకుండా ఎందుకు దాక్కుంటున్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒకవిధంగా.. వ్యతిరేకమైతే మరో విధంగా మాట్లాడుతారా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. మండలి ఉపయోగంపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా