నా ప్రజల కోసం అవమానాలైనా దాడులైనా భరిస్తా..

5 Feb, 2019 13:50 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్రంలో వైఎస్సార్‌ సీపీ నేతలు

దాడులను భరించడం అంటే బలహీనత కాదు చంద్రగిరిలో విష సంస్కృతి వద్దు

ప్రజల కోసమే సహనంగా ఉన్నా..

పల్లె ప్రజల్లో ప్రశాంతత కోరుకుంటా

చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: నా ప్రజల కోసం దాడులైనా, అవమానాలైనా భరిస్తున్నా. సహనాన్ని, భరించడాన్ని బలహీనత అనుకుంటే పొరపాటు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల నుంచి వచ్చాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన విష సంస్కృతి వల్ల ప్రజలు అభద్రతా భావంలో ఉంటున్నారన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తాను రాజకీయ ప్రత్యర్థులుగాఉన్నా ఏ రోజు దాడులు, దౌర్జన్యాలను ప్రొత్సహించలేదన్నారు. నియోజకవర్గన్ని ప్రశాంతంగా ఉంచామన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సహజంగా అధికారపార్టీపై విమర్శలు చేస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గడిచిన నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో ఏ రోజూ రాజకీయంగా గాని, వ్యక్తిగతంగా గాని, పార్టీ పరంగా కూడా కనీసం ఎవరిపై విమర్శలు చేయలేదన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే పల్లెల్లోని ఇరుపార్టీల మధ్య అలజడి వస్తుందేమోనని, పచ్చని పల్లెల్లో గొడవలు జరుగుతాయని బాధ్యతగా వ్యవహరిస్తున్నామన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలోనే పుట్టా. ఇక్కడే పెరిగా. ఇక్కడే చదివా. ఇక్కడే శాశ్వత నివాసంతో ఉన్నా. విద్యార్థి నాయకుడిగా, జెడ్పీటీసీగా, తుడా చైర్మన్‌గా, టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఎమ్మెల్యేగా ఈ ప్రజల ఆశీస్సులతోనే ఎదిగా. అలా నాకు భవిష్యత్తును ఇచ్చిన నా నియోజవర్గంలోని ప్రజల అభిష్టాలు, మనోభావాలు, జీవన స్థితిగతులు తెలుసన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎవరి పని వారు చేసుకుంటూ ఎన్నికల రోజే రాజకీయాల గురించి ఆలోచిస్తారన్నారు. ఎన్నికల అయిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరూ ఆత్మీయంగా ఉంటారని గుర్తు చేశారు.

దాడులు పెరిగిపోతున్నాయ్‌...
గత కొన్ని నెలలుగా దళితులు, గిరిజనులు, ముస్లీంలు ఇలా ఎవరినీ వదలకుండా ప్రతి రోజూదాడులు జరుగుతునే ఉన్నాయన్నారు. ఈ దాడుల నుంచి నియోజకవర్గన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదన్నారు. ఇలాంటి చెడు సంస్కతిని అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని ఈ దాడులు, దౌర్జన్యల సంస్కృతి నుంచి కాపాడటంలో ప్రజల కూడా భాగస్వాములు కావాలని, అందరూ చేయి చేయి కలిపి ప్రశాంత చంద్రగిరి నియోజకవర్గాన్ని తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. దాడి జరిగినా భరించానని, దానిని వివాదం చేయదల్చుకోలేదన్నారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. భరించటం అంటే బలహీనతగా భావించవద్దని మరోమారు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు